AP News: నాలుగు రోజుల్లో పెళ్లి.. అంతలో అనంతలోకాలకు
అత్తారింటికి పెళ్లి వస్త్రాలు తీసుకెళ్తూ.. వధువు దుర్మరణం
చైతన్య (పాత చిత్రం)
హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నో ఆశలు.. ఆకాంక్షలతో నూతన జీవితంలోకి అడుగు పెట్టడానికి ఆ యువతి ఎన్నో కలలు కనింది. మరో నాలుగు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆమె.. ఆచార వ్యవహారాల్లో భాగంగా పెళ్లి కుమారుని ఇంటికి వెళ్లి వస్త్రాలు ఇవ్వడానికి తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంలో బయలుదేరింది. అరగంటలో అత్తారింటికి చేరుకుంటుందనే లోగా మార్గమధ్యంలో మృత్యు శకటంలా దూసుకొచ్చిన ఓ లారీ ఆమెను విగతజీవిని చేసింది. ప్రమాదంతో వధువు ఆశలు, ఇరు కుటుంబాల సంతోషాలు ఆవిరయ్యాయి.
అనంతపురం జిల్లా హిందూపురం గ్రామీణ మండలం సంతేబిదనూరుకు చెందిన నరసింహమూర్తి ఏకైక కుమార్తె చైతన్య (19)కు పరిగి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో సెప్టెంబరు రెండో తేదీన పెళ్లి చేయడానికి ఇరు కుటుంబాలు అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు. సంప్రదాయంలో భాగంగా అత్తింటి వారికి కొత్త దుస్తులు ఇచ్చి రావడానికి శనివారం సంతేబిదనూరు నుంచి నరసింహమూర్తి, చైతన్య ద్విచక్రవాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలో హిందూపురం పట్టణ సమీపంలోని మోతుకపల్లి వద్ద పెన్నా నది వంతెనపై వెళుతున్న సమయంలో వారి ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. చైతన్యకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె తండ్రి తలకు, ఇతర చోట్ల గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన ఇతర వాహనదారులు 108కి సమాచారం ఇచ్చారు. 45 నిమిషాలు గడిచినా 108 అంబులెన్స్ ప్రమాదస్థలికి చేరుకోలేదని బాధితుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి గాయపడి రక్తమోడుతున్న తండ్రీకుమార్తెను ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ చైతన్య ఆసుపత్రిలో మృతి చెందింది. నరసింహమూర్తి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. హిందూపురం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకొని, డ్రైవర్ సురేష్‌ను అదుపులోకి తీసుకొన్నారు.
Advertisement