logo
Published : 02/12/2021 06:13 IST

వాణిజ్య పన్ను.. అక్రమాలకు దన్ను..!

తాడిపత్రిలోని వాణిజ్య పన్నుల కార్యాలయం

తాడిపత్రి, తాడిపత్రి పట్టణం, న్యూస్‌టుడే: తాడిపత్రి వాణిజ్య పన్నుల శాఖలో ఇటీవల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు కావడంతో ఈ శాఖలో పన్నుల వసూళ్లతోపాటు అక్రమ వసూళ్లకు అంతు లేకుండాపోతోంది. తాడిపత్రి ప్రాంతంలో వ్యాపార వ్యవహారాలు ఎక్కువగా ఉండటంతో కొందరు అధికారులు, సిబ్బంది ఎక్కువగా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పన్ను కడితే వాణిజ్యం.. వదిలిపెడితే స్వభోజ్యం అనే విధంగా ఇక్కడి సిబ్బంది తీరు మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడి సిబ్బంది అవినీతిపై ఇటీవల జాయింట్‌ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్‌, కమిషనర్‌లకు ఫిర్యాదులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

జిల్లాలో అనంతపురం-1, అనంతపురం-2, హిందూపురం, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లులో సీటీవో కార్యాలయాలు ఉన్నాయి. తాడిపత్రి కార్యాలయం పరిధిలో కేంద్ర విభాగానికి సంబంధించి 1,310, రాష్ట్ర విభాగానికి సంబంధించి 2,072 వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. వీటిలో ఆల్ట్రాటెక్‌, పెన్నా సిమెంట్స్‌-1, పెన్నా సిమెంట్స్‌-2, సాగర్‌ సిమెంట్స్‌, అర్జాస్‌ స్టీల్స్‌ వంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉన్నాయి. వీటి నుంచి ఏటా దాదాపు రూ.223 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.222.89 కోట్లు పన్ను వసూళ్లు లక్ష్యం కాగా రూ.182.59 కోట్లు వసూలు చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.168.28 కోట్లు లక్ష్యం కాగా ఈ ఏడాది అక్టోబరు నాటికి రూ.165.03 కోట్లు పన్నులు వసూలు చేయగలిగారు. ఇదంతా బాగానే ఉన్నా ఈ కార్యాలయంలోని కొందరు అధికారులు, సిబ్బంది వసూళ్ల మాటున ప్రదర్శిస్తున్న చేతివాటం హద్దులు మీరుతోంది.

తప్పులకు తార్కాణాలు

తాడిపత్రి-రాయలచెరువు మధ్య నాపరాళ్లతో వెళుతున్న లారీని వాణిజ్య పన్నుల అధికారి ఒకరు ఆపి రూ.1,500 తీసుకొని వదిలేశారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత విజిలెన్స్‌ అధికారులు సదరు లారీని స్వాధీనం చేసుకొని యాడికి పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. రూ.40 వేలు అపరాధ రుసుము చెల్లించి యజమాని లారీని విడిపించుకున్నాడు. లారీ డ్రైవర్‌ తాను ఇచ్చిన రూ.1,500 కోసం ఆ అధికారి చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. అతను మొహం చాటేయడం కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది.

తాడిపత్రి కార్యాలయంలోని ఓ ఉద్యోగి అధికారుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని లారీ బ్రోకర్లకు చేరవేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడని, అతనికి ఎవరైతే మామూళ్లు ఇవ్వరో వారి వాహనాల సమాచారం మాత్రమే అధికారులకు తెలియజేస్తూ వేదింపులకు గురి చేస్తున్నాడని కొందరు వాహనాల యజమానులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు.

ఓ చిరుద్యోగి నెలసరి మామూళ్లు తన భార్య ఖాతాలో ఫోన్‌ పే ద్వారా జమ చేయించుకొని అధికారులకు చేరవేస్తున్నాడని పలువురు బాధితులు ఖాతా వివరాలతో జాయింట్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణకు ఆదేశించిన అధికారులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇటీవల మిడుతూరు టోల్‌గేట్‌ వద్ద ఇద్దరు ఉద్యోగులు సుపారి తీసుకొని అధికారికి తెలియకుండా వాహనాలు వదిలేశారు. ఈ విషయం అధికారులకు తెలిసి మందలించారు.

పెద్దపప్పూరుకు చెందిన ఓ వ్యాపారికి వాణిజ్య పన్ను కార్యాలయ ఉద్యోగికి మధ్య లంచం గురించి జరిగిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీంతో ఆ ఉద్యోగిని ఉన్నతాధికారులు విధుల నుంచి పక్కన పెట్టారు.

సింహాద్రిపురం మండలం గురజాలకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి తాడిపత్రి నుంచి తన దుకాణానికి సరకులు తీసుకొని వెళుతుండగా సిబ్బంది అడ్డగించి రూ.1,500 డిమాండ్‌ చేసి ఫోన్‌ పే ద్వారా వసూలు చేసుకొని వాహనాన్ని వదిలారు.

తనిఖీలకు, పన్నుల వసూళ్లకు వినియోగించాల్సిన వాహనాన్ని ఓ అధికారి తనకు మాత్రమే పరిమితం చేసుకోవడం విమర్శలకు దారితీస్తోంది.

కార్యాలయ ఆవరణలో నిత్యం మద్యం సీసాలు కనిపిస్తుండటం గాడితప్పిన కార్యాలయ క్రమశిక్షణకు అద్దం పడుతోంది.

విచారణ చేపడుతున్నాం

మా దృష్టికి వచ్చిన కొన్ని ఫిర్యాదులపై విచారణ చేస్తున్నాం. తరచూ తాడిపత్రి కార్యాలయాన్ని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. మేము కూడా త్వరలోనే అక్కడి కార్యాలయాన్ని, పరిస్థితులను పరిశీలించి చక్కదిద్దుతాం.- నీరజ, జాయింట్‌ కమిషనర్‌, వాణిజ్య పన్నులశాఖ, అనంతపురం

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని