logo
Published : 02/12/2021 06:13 IST

బిందెడు నీరూ ఇవ్వలేదప్పా

మిడ్‌పెన్నార్‌ తాగునీటి ప్రాజెక్టుకు గ్రహణం

120 గ్రామాలకు నీటి సరఫరా ప్రశ్నార్థకం


జలాశయం వద్ద ట్యాంకు నిర్మాణం

శింగనమల, గార్లదిన్నె, న్యూస్‌టుడే: జిల్లాలోనే అత్యంత తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న శింగనమల నియోజకవర్గ ప్రజల దాహం తీరనే లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.వందల కోట్ల తాగునీటి పథకం మరుగున పడింది. పట్టించుకొనే నాథుడే లేక మొదటి దశలోనే ఆగిపోయింది. రూ.36 కోట్లు వెచ్చించినా చుక్క నీరు అందని పరిస్థితి. నిధులు రాక పనులు ముందుకు సాగక పల్లె వాసుల గొంతులు తడవని దయనీయమిది.

ప్రాజెక్టు రూపకల్పన

గార్లదిన్నె మండలం పెనకచెర్ల డ్యాం నుంచి శుద్ధి చేసిన నీటిని శింగనమల నియోజకవర్గంలోని శింగనమల, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, నార్పల మండలాల్లోని దాదాపు 120 గ్రామాలకు సరఫరా చేయాలి. ఇందు కోసం మొదటి విడత 2017లో రూ.40 కోట్లు మంజూరు చేశారు. వీటితో గార్లదిన్నె మండలంలోని 25 గ్రామాల దాహం తీర్చాల్సి ఉంది.

‘నీరు’గారిన లక్ష్యం

రూ.36 కోట్లతో పనులు పూర్తి చేశారు. మిగిలిన రూ.4కోట్లతో చేపడుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. పైప్‌లైన్‌ ద్వారా నీరు వదలడంతో లీకేజీలు ఏర్పడి నిలిపివేశారు. రూ.కోట్లు ఖర్చు చేసినా చుక్కనీరు ఇవ్వలేకపోయారు.

రూ.40 కోట్లు నిరుపయోగం

డ్యాం లోపలి భాగంలో ట్యాంకు కట్టారు. అక్కడి నుంచి గార్లదిన్నె మండలంలోని 25 గ్రామాలకు పైప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. కల్లూరు వద్ద ట్యాంకుకు లైన్‌ కలిపారు. ఆ తర్వాత గ్రామాలకు నీరు సరఫరా చేసే ప్రయత్నం చేశారు. ఈ పనులకు దాదాపు రూ. 40 కోట్లు ఖర్చు చేశారు. డ్యాం వద్ద నీటిని బయటికి తోడే చోట పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అక్కడక్కడ పైప్‌లైన్‌ పనులు పూర్తి కాలేదు. ఈ పనులు పూర్తి చేయాలని గుత్తేదారులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే నిధులు రానిదే పనులు చేయలేమని గుత్తేదారులు దీర్ఘించారు. దీంతో పథకం ముందుకు సాగడం లేదు.

వేసవి వస్తే దాహం కేకలే

శింగనమల నియోజకవర్గ ప్రజలు వేసవిలో దాహంతో అల్లాడిపోతున్నారు. ఏటా 40 గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంటోంది. గార్లదిన్నె, నార్పల, శింగనమల, బుక్కరాయసముద్రం మండలాల్లో సరైన తాగునీటి వనరులు లేవు. వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. చాలా చోట్ల ప్రజలు బోర్లపైనే ఆధారపడ్డారు. గార్లదిన్నె, నార్పల మండలాల్లో తోటలు, బావుల వద్దకు పరుగులు తీయాల్సి వస్తోంది.

కొనుగోలు చేయాల్సిందే

శుద్ధి చేసిన తాగునీరు అందిస్తామని రూ.కోట్లు ఖర్చు చేశారు. ఒక్క రోజు కూడా నీళ్లు రాలేదు. రోజు రూ.15 వెచ్చించి శుద్ధజలం కొనుగోలు చేస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోక పోవడంతో గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతోంది. వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. - రమేష్‌, ఎంపీఆర్‌ డ్యాం, గార్లదిన్నె

వ్యవసాయ బోర్లే దిక్కు

వేసవిలో తాగునీటి కోసం వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్తున్నాం. తాగునీరు దొరక్క రోజంతా ఆ పని మీదే ఉండాలి. గ్రామంలో ట్యాంకుల ద్వారా నీటిని అందించినా అరకొరగానే ఉంటుంది. గత ఆరేళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. - రమేష్‌, లోలూరు, శింగనమల

రూ.230 కోట్లకు ప్రతిపాదన

నాలుగు మండలాల గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ప్రాజెక్టును రూ.230 కోట్లతో రూపొందించాం. బహుళ తాగునీటి పథకం కింద నిధులు రావాల్సి ఉంది. గతేడాది కాలంగా నిధుల కోసం వేచి చూస్తున్నాం. ప్రస్తుతం ఆగిపోయిన పనులను గుత్తేదారులతో చేయించే ప్రయత్నం చేస్తాం. - రామారావు, డీఈ, గ్రామీణ తాగునీటి పథకం

నిధులు తీసుకొచ్చి పనులు జరిగేలా చూస్తాం

తాగునీటి పథకానికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తాం. ప్రాజెక్టు పనులపై త్వరలోనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తాం. అన్ని గ్రామాలకు తాగునీటిని అందించే ప్రయత్నం చేస్తాం. ఆగిపోయిన పనులు చేపట్టేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. - జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్యే, శింగనమల

ప్రాజెక్టు పేరు: మిడ్‌పెన్నార్‌ తాగునీటి ప్రాజెక్టు

నిధుల అంచనా: రూ.230 కోట్లు

ఖర్చు చేసిన నిధులు: రూ.36 కోట్లు

పథకం ప్రారంభం: 2017

చేపట్టిన పనులు: 25 గ్రామాలకు పైప్‌లైన్‌

దక్కిన ఫలితం: పల్లె గొంతు తడవలె

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని