logo
Published : 02/12/2021 06:13 IST

హలధారి ఇంట.. కన్నీటిధార

వర్షం తగ్గినా పంటలను వీడని ముంపు

తీవ్రంగా నష్టపోయిన జిల్లా రైతులు

ముదిగుబ్బ మండలం గుంజేపల్లిలో ముంపులోనే చీనీ తోట

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: వర్షాలు, వరదలు తగ్గినా ఇంకా ముంపు వీడలేదు. పొలాల్లో నీరు తగ్గడం లేదు. ఎక్కడికక్కడ వాగులు, చెరువులు, కుంటలు నిండిపోవడంతో పొలాల్లో చెమ్మ వస్తోంది. ఊటనీటిలో పంటలు మునిగి కుళ్లిపోతున్నాయి. ఎప్పుడూ లేనంతగా జిల్లా రైతులు తీవ్ర నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. దెబ్బతిన్న పంటను తొలగించి కొత్తగా విత్తు వేయాలన్నా వాతావరణం అనుకూలించని పరిస్థితి. ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా నష్టపోయిన రైతులు రబీ సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే భారీ వర్షాలు దెబ్బతిశాయి. వరదలు ముంచెత్తడంతో పంటలు కొట్టుకుపోయాయి. వానలు తగ్గి వారం రోజులు కావస్తున్నా చాలాచోట్ల ముంపు వదలకపోవడంతో పొలాల్లోనే వరికి మొలకలు వస్తున్నాయి. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కనీసం నష్టపరిహారం కూడా అందని స్థితిలో ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. ఉద్యాన పంటలైన మిరప, టమోటాపైనా తీవ్ర ప్రభావం పడింది.

కష్టాల్లో కౌలు రైతు

జిల్లాలో టమోటా, మిరప, వరి పంటలను అధిక శాతం కౌలుదారులే సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వరకు కౌలు చెల్లిస్తున్నారు. టమోటా 30 వేల ఎకరాలు, మిరప సుమారు 50 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఉరవకొండ, తాడిపత్రి ప్రాంతాల్లో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు రూ.40 వేల కౌలుతో పాటు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. అంటే మిరప రైతుకు ఎకరాకు రూ.1.40 లక్షలు నష్టం వాటిల్లింది. మొత్తం 40వేల ఎకరాల్లో మిరప దెబ్బతింది. టమోటా 30 వేల ఎకరాల్లో సాగు చేయగా.. 10 వేల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఉద్యానశాఖ అధికారులు మాత్రం 250 ఎకరాల్లోనే నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.

ఆత్మహత్యలే శరణ్యం

- గంగమ్మ, అడవి బ్రాహ్మణపల్లి

ఎకరాకు రూ.40 వేలు చొప్పున రెండెకరాలు కౌలుకు తీసుకుని టమోటా సాగు చేశాం. ఎకరాకు రూ.లక్ష వరకు ఖర్చయ్యింది. వర్షాల కారణంగా పూత రాలిపోయింది. కాయలకు మచ్చలు ఏర్పడుతున్నాయి. నేలలో ఇంకా తేమ ఉండటంతో మొక్కలు కుళ్లిపోతున్నాయి. కుటుంబ సభ్యులమంతా పొలంలోనే పనిచేస్తున్నాం. ఒక్కో కాపులో 10 బాక్సులు కూడా రావడం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. లేదంటే ఆత్మహత్యలే శరణ్యం.

అప్పులే మిగిలాయి

- ఎర్రిస్వామి, కౌకుంట్ల, ఉరవకొండ

నాకున్న నాలుగెకరాల్లో మిరప సాగు చేశా. ఎకరాకు రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెట్టాం. వర్షాలకు రెండెకరాలు పూర్తిగా నీటమునిగింది. ముంపు వీడినా పొలంలో నీటి ఊట తగ్గడం లేదు. మొక్క వేర్లు కుళ్లి పంట పూర్తిగా దెబ్బతింది. పక్కనే ఉన్న పప్పుశనగ పంట కూడా నీటి మునిగి దెబ్బతింది. అటు ఖరీఫ్‌లో వానలు లేక వేరుసెనగ ఎండిపోయింది. ఇటు రబీలో అకాల వర్షంతో పంట కుళ్లిపోయింది. ఈ ఏడాది అప్పులే మిగిలాయి.

రూ.3 లక్షలు నష్టం

- తిరుపతినాయుడు, ముదిగుబ్బ

ఎంబీఏ చదివి వ్యవసాయంపై మక్కువతో సాగు మొదలుపెట్టా. రెండెకరాల్లో రూ.లక్ష పెట్టుబడి పెట్టి టమోటా సాగు చేశాను. వరద ముంచెత్తడంతో పంట పూర్తిగా కొట్టుకుపోయింది. వంకకు ఆనుకుని పొలం ఉండటంలో రెండెకరాల్లో వేసిన జామ చెట్లు సగానికి పైగా కొట్టుకుపోయాయి. వరద కొంచెం పెరిగి ఉంటే ఇల్లు కూడా నీటిలో కలిసిపోయేది. పొలంలో ఇంకా నీరు ఊరుతుండటంతో మొక్కలు చనిపోతున్నాయి. మొత్తం రూ.3 లక్షల దాకా నష్టం వాటిల్లింది. పంటల బీమా కూడా రాదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.

వలస వెళ్లాల్సిందే

- చెన్నమ్మ, కొత్తకోట, బుక్కపట్నం

మాకున్న ఆరెకరాల్లో వరి వేశాం. రెండు రోజుల్లో కోతలకు సిద్ధమైన తరుణంలో వరదలు ముంచెత్తాయి. వానలు వెలిసి వారం దాటినా పొలాల్లో నీరు నిలిచి ఉంది. వడ్లు పొలంలోనే మొలకొలస్తున్నాయి. రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టాం. సుమారు రూ.6 లక్షల వరకు ఆదాయం వచ్చేది. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. కుటుంబం మొత్తం వలస వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాం. మాకు రూ.2 వేలు పరిహారం ఇవ్వడం అన్యాయం. పాలకులు స్పందించి ఎకరాకు రూ.10 వేలు చొప్పున పరిహారం అందించాలి.

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని