logo
Published : 05/12/2021 04:48 IST

రెక్కల కష్టమూ దక్కలేదాయె!

పత్తి రైతుకు తీరని నష్టం

అక్కంపల్లిలో పూత విచ్చుకోని పత్తి పంట

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: అధిక వర్షం.. తెగుళ్ల బెడద పత్తి రైతులను దెబ్బతీశాయి. తెల్లబంగారంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అన్నదాతలకు నిరాశే మిగిలింది. పంట ఏపుగా పెరిగినా పూత, కాయ లేదు. దీంతో రెక్కల కష్టం వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పత్తి పంటను వర్షాధారం కింద సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో సుమారు 60 వేల మంది రైతులు 50 వేల హెక్టార్లలో పంట వేశారు. విత్తు వేసిన తొలినాళ్లలో వర్షాలు ముఖం చాటేసింది. ఆ తర్వాత తెగుళ్లు సోకాయి. ప్రస్తుతం భారీ వర్షాలు పంటను దెబ్బతీశాయి. దుక్కి, విత్తనాలు, పురుగు మందులు, కలుపు నివారణ తదితర వాటికి రూ.వేలు అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. ఎకరాకు రూ.30 వేలకుపైగా ఖర్చు చేశారు. ఈ లెక్కన జిల్లా అంతటా రూ.150 కోట్ల వరకు వెచ్చించారు.

50 వేల హెక్టార్లలో సాగు

ఖరీఫ్‌లో 50 వేల హెక్టార్లకుపైగా పంట సాగైయింది. గతం కంటే ఈసారి పురుగు దాడి అధికమైంది. ఎర్ర తెగులుగా గుర్తించి అధికారులు సూచించిన కీటకనాశిని పిచికారీ చేసినా ఉద్ధృతి తగ్గలేదని రైతులు చెబుతున్నారు. జులైలో పంట వేశారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వానలు రాలేదు. సకాలంలో వర్షాలు లేక.. పురుగు చావక పత్తి పంట దెబ్బతింది. ఎకరాకు 8-10 క్వింటాళ్లు పత్తి వచ్చేదని, ప్రస్తుతం రెండు, మూడు క్వింటాళ్లు కూడా చేతికందే పరిస్థితి లేదని రైతులు తెలిపారు. మార్కెట్‌లో ధర బాగున్నా.. దిగుబడి లేదన్నారు.

బీమా అమలు చేస్తేనే మేలు

పంటల సాగు లాభసాటిగా మారాలంటే ఖర్చులపై 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ సిఫారసు చేశారు. దాన్ని అమల్లోకి తీసుకురావడంతోపాటు సాగుకు అవసరమయ్యే ఉపకరణాల ధరలను అందుబాటులో ఉంచాలి. ప్రకృతి వైపరిత్యాల నుంచి రైతులను ఆదుకునేలా పంటల బీమాను పక్కాగా అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అప్పుల నుంచి గట్టెక్కలేం

- దేవనాథ్‌రెడ్డి, అక్కంపల్లి, అనంతపురం గ్రామీణం

20 ఎకరాల్లో పత్తి సాగు చేశా. పంటంతా పోయింది. బాగుంటే నాలుగు కోతలు వచ్చేది. ప్రస్తుతం ఒక కోత కూడా పూర్తిగా వచ్చేలా లేదు. 20 ఎకరాల్లో 25 క్వింటాళ్లు వచ్చింది. పెట్టుబడి ఖర్చులు కూడా అందలేదు. అప్పులే మిగిలాయి. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప అప్పుల నుంచి గట్టెక్కలేం.

సర్కారు ఆదుకుంటేనే..

- కదిరెడ్డి, అక్కంపల్లి, అనంతపురం గ్రామీణం

ఏటా 18 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. సుమారు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టా. ఈసారి ప్రకృతి కరుణించలేదు. దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. 50 క్వింటాళ్ల పత్తి కూడా దక్కేలా లేదు. ఈ ఏడాది సేద్యం పనుల కోసం రూ.4 లక్షలకు ట్రాక్టరు కొన్నా.. అప్పులు పెరిగిపోయాయి. సర్కారు ఆదుకుంటే తప్ప అప్పుల నుంచి బయటపడలేం.

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని