logo
Published : 05 Dec 2021 04:48 IST

ఉపాధి హామీ ఏమైంది?

పండ్లతోటల పెంపకానికి ఆగిన సాయం

రెండేళ్లుగా అన్నదాతల ఎదురుచూపు

ఉపాధి అనుసంధానంతో సాగు చేసిన మామిడితోట

లక్ష్మీనగర్‌(అనంతపురం), తాడిమర్రి, న్యూస్‌టుడే: ప్రభుత్వం చేయూతనిస్తుందన్న ఆశతో పండ్ల తోటలను సాగు చేసిన రైతులు అవస్థలు పడుతున్నారు. రెండేళ్లుగా తోటల పెంపకానికి నిధులు విడుదల చేయకపోవడంతో అప్పులపాలవుతున్నారు. మొక్కలకు నీటి తడులు, ఎరువులు అందించేందుకు చేతిలో డబ్బు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులను అడిగినా అదిగో..ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ఫ. నిధులు ఎప్పుడిస్తారో చెప్పలేని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా 63 మండలాల్లో ఉపాధి పథకం అనుసంధానంతో పండ్ల మొక్కల పెంపకం చేపట్టారు. 2019-20లో 6,388 మంది రైతులు 17,447 ఎకరాలు, 2020-21లో 5,417 మంది రైతులు 14,961 ఎకరాలు, 2021-22లో 4,703 మంది రైతులు 10,876 ఎకరాల్లో పలు రకాల పండ్ల మొక్కలను సాగు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకం అందిస్తున్న ఉద్దేశంతో రైతులు తోటల పెంపకానికి ఆసక్తి చూపారు. మామిడి, దానిమ్మ, నేరేడు, సపోటా, జామ తదితర పండ్ల మొక్కల సాగు, సరరక్షణకు మూడేళ్లపాటు నిబంధనల ప్రకారం ప్రభుత్వం రైతులకు చేయూతనందించాలి. మొక్కల కొనుగోలు, గుంతల ఏర్పాటు, తోట చుట్టూ ఫెన్సింగ్‌, మొక్కలకు నీటి సరఫరా, ఎరువుల కొనుగోలుకు నిధులకు రైతుల ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉంది. అయితే రెండేళ్లుగా నిధుల ఊసేలేదు.

బకాయి రూ.32.20 కోట్లు

ఉపాధి పథకం అనుసంధానంతో జిల్లా వ్యాప్తంగా నాటిన పండ్ల మొక్కల సరరక్షణకు రెండేళ్లుగా నిధులివ్వలేదు. రూ.32.20 కోట్ల బకాయి పేరుకుపోయింది. మండలాల వారీగా పరిశీలిస్తే.. రాప్తాడు రూ.1.92 కోట్లు, రొళ్ల, శెట్టూరు రూ.1.39 కోట్లు చొప్పున, ధర్మవరం రూ.72.86 లక్షలు, తాడిమర్రి రూ.66.48 లక్షలు, ఆత్మకూరు రూ.63.58 లక్షలు, బత్తలపల్లి రూ.63.58 లక్షలు, బెళుగుప్ప రూ.62.12 లక్షలు, గాండ్లపెంట మండలానికి రూ.54.43 లక్షలు విడుదల చేయాల్సి ఉంది. సొమ్ము అందక అన్నదాతలు పండ్ల మొక్కలను సరరక్షించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

ఒక్క రూపాయీ ఇవ్వలేదు

- నారాయణ, రైతు, భీమరాయనిపేట

ఉపాధి పథకం అనుసంధానంతో నాలుగున్నర ఎకరాల్లో 600 చీనీ మొక్కలు ఏడాదిన్నర కిందట నాటించా. ఇప్పటివరకు మొక్కల సంరక్షణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్న నమ్మకంతో అప్పులు చేశా. సుమారు రూ.75 వేల వరకు బకాయి రావాల్సి ఉంది. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలి.

రూ.లక్ష ఖర్చు చేశా

- ఓబిరెడ్డి, రైతు, తాడిమర్రి

రెండున్నర ఎకరాల్లో 157 మామిడి మొక్కలను ఏడాదిన్నర కిందట నాటాం. ఇప్పటివరకు రూ.3,600 బిల్లు బ్యాంకు ఖాతాలో జమైంది. మొత్తంగా ఎంత బిల్లు వస్తుందని సంబంధిత అధికారులను అడిగినా సరైన సమాచారం ఇవ్వడం లేదు. మొక్కల కొనుగోలుకు రూ.30 వేలు, భూమి చదును, డ్రిప్‌ తదితరాలకు రూ.లక్ష ఖర్చు చేశా. అప్పులు చేసి, చెట్లను కాపాడుకుంటున్నా. బకాయిలను వెంటనే విడుదల చేసి ప్రభుత్వం ఆదుకోవాలి.

రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు

పండ్లతోటల పెంపకానికి నిధుల విడుదలలో జాప్యం జరిగింది. రైతులు తమ ఇబ్బందులను తెలియజేస్తున్నారు. నిధులు విడుదల చేయాలని ఉన్నతాధికారులకు తెలియజేశాం. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేలా చూస్తాం. - వేణుగోపాల్‌రెడ్డి, పీడీ, డ్వామా

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని