రేషన్ కోటా.. ప్రతినెలా కోత!
గోదాములో బియ్యం నిల్వలు
వరద బాధితులకు ఇచ్చారట
జిల్లాలో 3,012 చౌక దుకాణాలు ఉన్నాయి. 18 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 600 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 600 మెట్రిక్ టన్నుల పంచదార కేటాయింపులు జరిగాయి. అయితే రెండు నెలల నుంచి పంచదార, కందిపప్పు పూర్తిస్థాయిలో సరఫరా కాలేదు. అరకొర పంపిణీ చేస్తున్నారు. చక్కెర హైదరాబాద్ నుంచి, కందిపప్పు వినుకొండ నుంచి జిల్లాకు సరఫరా అవుతోంది. భారీ వర్షాలతో ఈనెల సరఫరా ఆగిపోయిందని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో నవంబరు నెల భారీ వర్షాలు కురిశాయి. కదిరి రెవెన్యూ డివిజన్‌లో చాలామంది నిరాశ్రయులయ్యారు. వారికి బియ్యం, కందిపప్పు, పామాయిల్ పంపిణీ చేశారు. మొత్తం 6,615 మంది బాధితులకు కిలో చొప్పున కందిపప్పు పంచినట్లు అధికారులు తెలిపారు. కందిపప్పు వరద బాధితులకు పంచడం మంచిదేనని, తమ కోటా రద్దు చేయడం సరికాదని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
27 శాతం పంపిణీ: జిల్లాలో నిత్యావసర సరకుల పంపిణీ నత్తనడకన సాగుతోంది. మొత్తం 12,03,438 తెల్ల కార్డుదారులు ఉన్నారు. శనివారం వరకు 3,32,713 కార్డులకు సరకులు ఇచ్చారు. అంటే 27 శాతం మాత్రమే పంపిణీ చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నెలనెలా సరకుల పంపిణీలో కొత విధిస్తూనే ఉన్నారని పలు మండలాల తహసీల్దార్లు చెప్పడం గమనార్హం.
సరఫరా ఆగింది
వెంకట్రాముడు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ
వరదల కారణంగా పంచదార, కందిపప్పు సరఫరా ఆగిన విషయం నిజమే. కందిపప్పు కొంత నిల్వలు ఉండగా.. కొన్ని దుకాణాలకు సర్దుబాటు చేశాం. వరద ప్రాంతాల్లో బాధితులకు కందిపప్పు పంపిణీ చేశారు. ఈ నెలలో పంచదార సరఫరా పూర్తిగా ఆగిపోయింది. రెండ్రోజుల్లో కందిపప్పు వస్తుంది. అన్ని దుకాణాలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
జేసీ మాట: డిసెంబరు నెల కోటా సరకులు కార్డుదారులకు ఒకటో తేదీ నుంచి పంపిణీ ప్రారంభమవుతుంది. బియ్యం, కందిపప్పు, చక్కెర ఇంటి వద్దే అందిస్తారు. ఆయా సరకులకు నిర్ణయించిన ధరలు చెల్లించి కార్డుదారులు తీసుకోవాలని గత నెల 30న జేసీ సిరి జారీ ప్రకటన ఇచ్చారు.
కార్డుదారుల ఆందోళన: బియ్యం తప్ప మిగతా సరకులు ఇవ్వలేదు. కందిపప్పు, చక్కెర అడిగితే డీలర్లు రాలేదని సమాధానం ఇస్తున్నారు. నవంబరు నెలలోనూ చక్కెర, కందిపప్పు పూర్తిస్థాయిలో ఇవ్వలేదు.
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.