logo

‘నకిలీ బంగారు నాణేల’ ముఠా అరెస్టు

నకిలీ బంగారు నాణేలతో తెలంగాణ వాసులను మోసం చేసిన కర్ణాటకకు చెందిన అంతర్‌రాష్ట్ర ముఠాను అనంతపురం గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.10లక్షలు, కారు, ద్విచక్ర వాహనం, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం నగర

Published : 20 Jan 2022 05:24 IST

రూ.10 లక్షలు, వాహనాలు స్వాధీనం


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ మురళీధర్‌రెడ్డి, తదితరులు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: నకిలీ బంగారు నాణేలతో తెలంగాణ వాసులను మోసం చేసిన కర్ణాటకకు చెందిన అంతర్‌రాష్ట్ర ముఠాను అనంతపురం గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.10లక్షలు, కారు, ద్విచక్ర వాహనం, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం నగర ఇన్‌ఛార్జి డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి గ్రామీణ పోలీసు స్టేషనులో బుధవారం సమావేశం నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లా హర్పనహళ్లి తాలూకా మాచెహళ్లి కొరచరహట్టి గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌, అశోక్‌, దివాకర్‌ మిత్రులు. వీరు మద్యానికి బానిసలు. వ్యసనాలు తీర్చుకొనేందుకు కావలసిన డబ్బు కోసం సులువైన మార్గంగా నకిలీ బంగారం నాణేల విక్రయాన్ని ఎన్నుకున్నారు. వీటికోసం ప్రత్యేకంగా పథకం రచించారు. ఇళ్ల పునాదుల తవ్వకాల్లో బంగారు నాణేలు దొరికాయని, వీటిని తక్కువ ధరకే విక్రయిస్తామని ముందుగా సేకరించుకున్న నెంబర్లకు ఫోన్‌ చేసి మాయమాటలు చెబుతారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా బాజకుంట గ్రామానికి చెందిన పరమేష్‌, మహేష్‌ను ఫోన్‌లో నమ్మించారు. వీడియోకాల్‌ ద్వారా ఒక అసలైన బంగారు నాణెం చూపించి.. తమ వద్ద ఒకటిన్నర కిలో నాణేలు ఉన్నాయని నమ్మించారు. వాటిని కేవలం రూ.10లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 14న మహేష్‌, పరమేష్‌కు ఫోన్‌ చేసి అనంతపురం నగర శివారులోని వైఎస్సార్‌ కాలనీకి రావాలని చెప్పారు. అనుకున్న విధంగానే అందరూ కురుగుంట వద్దకు చేరుకున్నారు. ముఠా సభ్యులు తెల్లని గుడ్డ సంచిని బాధితులకు ఇచ్ఛి. అందులో నాణేలు పరీక్షించుకోమన్నారు. వారు నాణేలను పరీక్షించే లోపే.. బాధితుల చేతిలో ఉన్న రూ.10లక్షలు, సెల్‌ఫోన్లు లాక్కొని ముఠా సభ్యులు ద్విచక్రవాహనంలో పరారయ్యారు. ఈ మోసంపై అనంత గ్రామీణం స్టేషనులో కేసు నమోదైంది.

F ఇన్‌ఛార్జి డీఎస్పీ ప్రసాదరెడ్డి పర్యవేక్షణలో గ్రామీణం సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్సైలు మహానంది, కమలాబాషా, ఏఎస్సై వెంకటేష్‌, సిబ్బంది బృందంగా ఏర్పడి ముఠా వ్యవహారంపై నిఘా వేశారు. పక్కాగా వచ్చిన సమాచారంతో ముగ్గురు ముఠా సభ్యులను స్థానిక సీఆర్‌ఐటీ కళాశాల వద్ద పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ముఠాను పట్టుకున్న పోలీసు బృందాన్ని ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప అభినందించారు.


పట్టుబడిన నగదు, నకిలీ నాణేలు, చరవాణులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు