logo

ఉరిమిన ఉపాధ్యాయులు

జిల్లా ఉపాధ్యాయ లోకం పిడికిలి బిగించింది.. తమ సమస్యలపై ఉద్యమించింది.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించింది.. కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్‌, ఇంటి అద్దె స్లాబుల తగ్గింపుపై భగ్గుమంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గురువులు ఆగ్రహించారు. సీఎం డౌన్‌..డౌన్‌ అంటూ కదం తొక్కారు. . ఏపీ ఉపాధ్యాయ సంఘా

Published : 21 Jan 2022 06:24 IST

దద్దరిల్లిన కలెక్టరేట్‌

కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు

వివిధ సంఘాల నాయకుల అరెస్టు

కలెక్టరేట్‌ ముట్టడికి భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘ నాయకులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లా ఉపాధ్యాయ లోకం పిడికిలి బిగించింది.. తమ సమస్యలపై ఉద్యమించింది.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించింది.. కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్‌, ఇంటి అద్దె స్లాబుల తగ్గింపుపై భగ్గుమంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గురువులు ఆగ్రహించారు. సీఎం డౌన్‌..డౌన్‌ అంటూ కదం తొక్కారు. . ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) జిల్లా ఛైర్మన్‌ జయరామిరెడ్డి, సెక్రటరీ జనరల్‌ సాలెవేముల బాబు ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ముట్టడించారు. ఉదయం 9 గంటలకే పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు కలెక్టర్‌ కార్యాలయ ప్రధాన గేటు వద్ద బెంగళూరు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. అప్పటికే ఇన్‌ఛార్జి డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి సారథ్యంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. కలెక్టరేట్‌ ప్రధాన గేటు ముందు మూడంచెల బారీకేడ్లను ఏర్పాటు చేశారు.

ఇది పచ్చి మోసం

ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్‌, సెక్రటరీ జనరల్‌ జయరామిరెడ్డి, బాబు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల అనుకూల ప్రభుత్వమని భావించాం. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఐఆర్‌తోనే సరిపెట్టుకున్నాం. తీరా 11వ పీఆర్సీ నివేదికను పూర్తిగా పక్కనపెట్టి.. అధికారుల కమిటీ ఆధారంగా ఫిట్‌మెంట్‌ 23 శాతం మాత్రమే ఇవ్వడం చాలా అన్యాయం. ఇది పచ్చి మోసమని మండిపడ్డారు. సత్వరమే కొత్తగా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలి. అప్పటిదాకా తమ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఉపాధ్యాయులకు సంఘీభావంగా పాల్గొన్న ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అతావుల్లా, పెన్షనర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పెద్దన్నగౌడ్‌, జయరామప్ప మాట్లాడుతూ పీఆర్సీపై ఇచ్చిన చీకటి జీవోలన్నీ రద్దు చేయాలని డిమాండు చేశారు. ఐఏఎస్‌ల కమిటీ పూర్తిగా పక్కదారి పట్టిస్తోంది. తప్పుడు లెక్కలతో మోసం చేస్తున్నారన్నారు. ఫ్యాప్టో జిల్లా ముఖ్యనేతలు బి.నరసింహులు, సాకే పెద్దన్న, నాగేంద్ర, ఓబిలేసు, రమణారెడ్డి, సిరాజుద్దీన్‌, రవీంద్ర, గోపాల్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలను తుంగలో తొక్కిందన్నారు. మోసపూరిత వాగ్దానాలతో తమను నిండా ముంచే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. సీపీఎస్‌ రద్దు చేయాల్సిందేనని, అశుతోష్‌మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండు చేశారు.

తోపులాట.. ఉద్రిక్తత

ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడిన తర్వాత కలెక్టరేట్‌లోకి వెళ్లడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. కొందరు టీచర్లు బారీకేడ్లపైకి ఎక్కారు. మహిళలు సైతం బారికేడ్లను తోసే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో చొచ్చుకురావడంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పోలీసు రోప్‌ పార్టీలతో నిరసనకారులను బలవంతంగా వెనక్కినెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. సమీప పోలీసు స్టేషన్లకు తరలించారు.

బాసలు ఏమాయె సారూ..

పలువురు ఉపాధ్యాయులు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. కొందరు పాటల రూపంలో, మరికొందరు నినాదాలతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. జేవీవీ నాయకుడు, టీచరు శంకర్‌ శివరావు పాడిన పాట ఆకట్టుకుంది. ‘మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగారు.. ఉద్యోగాలకు ఇచ్చిన చేతి బాసలు ఏమాయే సారు’.. అంటూ సాగిన పాట అందరినీ ఆలోచింపజేసింది.

 

ప్లకార్డు ప్రదర్శిస్తూ..

జీవోలను రద్దు చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్న ఉపాధ్యాయినులు

వివిధ సంఘాల నాయకులను అరెస్టు చేసి తీసుకెళుతున్న పోలీసులు

తలకిందులుగా పీఈటీల నిరసన

కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని