logo

మృతులకూ టీకా వేస్తున్నారట ..!

ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వెరసి జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గందరగోళంగా మారింది. టీకా వేయకుండానే వేసినట్లు చాలామంది చరవాణులకు సంక్షిప్త సందేశాలు వస్తున్నాయి. ఏడాది కిందట చనిపోయిన వారికి కూడా రెండు డోసులు టీకా వేసినట్లు వివరాలు నమోదు చేసి కుటుంబ

Published : 21 Jan 2022 06:24 IST

క్షేత్రస్థాయిలో సిబ్బంది అలసత్వం

వివరాల నమోదులో గందరగోళం

ఫిర్యాదులొచ్చినా పట్టింపేదీ?


టీకా వేస్తున్న సిబ్బంది

కంబదూరు మండలం వైసీపల్లికి చెందిన లక్ష్మీదేవి 2020 ఫిబ్రవరిలో చనిపోయింది. అయితే లక్ష్మీదేవికి రెండో డోసు టీకా వేసినట్లు ఈనెల 18న ఆమె భర్త చరవాణికి సందేశం రావడంతో అవాక్కయ్యారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె భర్త తిరుపాల్‌ ఉన్నతాధికారులను కోరారు.

తాడిపత్రి పట్టణం అంబేడ్కర్‌నగర్‌లో నివాసముంటున్న ఎర్రిస్వామి గతేడాది మే 22న మొదటిడోసు టీకా వేయించుకున్నాడు. రెండు రోజుల కిందట రెండో డోసు వేసుకోవడానికి టీకా కేంద్రానికి వెళ్లగా వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు సిబ్బంది తెలిపారు. దీంతో ప్రభుత్వ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలు పరిశీలించగా గత ఆగస్టు 25న రెండో డోసు పూర్తయినట్లు నమోదై ఉంది.

అనంత నగరం కమలానగర్‌కు చెందిన సురేష్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో వర్క్‌ ఫ్రం హోం ఉండటంతో ఇక్కడి నుంచే పనిచేశారు. ఆ సమయంలోనే మే 24న మొదటిడోసు టీకా వేసుకున్నారు. అదే ఏడాది నవంబరులో బెంగళూరు వెళ్లి కార్యాలయం నుంచి పనిచేస్తున్నారు. అప్పటినుంచి అతను అనంతపురం రాలేదు. అయితే రెండు రోజుల కిందట ఆయనకు రెండో డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు చరవాణికి సందేశం వచ్చింది.

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వెరసి జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గందరగోళంగా మారింది. టీకా వేయకుండానే వేసినట్లు చాలామంది చరవాణులకు సంక్షిప్త సందేశాలు వస్తున్నాయి. ఏడాది కిందట చనిపోయిన వారికి కూడా రెండు డోసులు టీకా వేసినట్లు వివరాలు నమోదు చేసి కుటుంబ సభ్యుల ఫోన్లకు సందేశాలు పంపుతున్నారు. గతేడాది టీకా కార్యక్రమం ప్రారంభమైన సమయంలోనూ ఇదే పరిస్థితి. అప్పట్లో రెండో డోసు వేసుకోకుండానే వేసినట్లు నమోదైంది. సాంకేతిక లోపంతో పొరపాట్లు జరిగాయని ఉన్నతాధికారులు చెప్పుకొచ్చినా.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణమన్నది బహిరంగా రహస్యం.

ఆధార్‌ నెంబర్లు సేకరించి..

తప్పుడు సందేశాలు నిత్యం వందల్లో వెలుగుచూస్తున్నాయి. కిందిస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులు తమకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల్లోని వ్యక్తుల ఆధార్‌కార్డు, ఫోన్‌ నెంబర్లు సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి టీకా వేయకుండానే సమాచారాన్ని యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. కొవిన్‌ యాప్‌లో టీకా వేసినట్లు నమోదు కావడంతో సంబంధిత వ్యక్తులకు వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు సమాచారం వెళ్తోంది. దీంతో టీకాలు వేసుకోని వారు ఇబ్బందులు పడుతున్నారు. టీకా వేసుకోవడానికి సమీపంలోని కేంద్రానికి వెళ్తే అప్పటికే వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు సమాధానం చెబుతున్నారు. దీనిపై కొంతమంది వైద్యాధికారులకు ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. సాంకేతిక లోపాలు ఉన్నాయని చెబుతున్నారు తప్ఫ. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు.

లక్ష్యం చేరేందుకు...

జిల్లాలో వందశాతానికి మించి మొదటి డోసు వేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది టీకా వేసుకోలేదు. కొంతమందికి అవగాహనలేక, మరికొందరు భయపడి టీకాకు దూరంగా ఉన్నారు. మరోవైపు 85 శాతం మందికి రెండో డోసు కూడా పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. వైద్య సిబ్బంది చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. లక్ష్యం చేరేందుకు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

పరీక్షలపైనా ఉదాసీనత

రెండు దశల్లో వచ్చిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. చాలామందికి లక్షణాలు లేకుండానే వైరస్‌ బారిన పడుతున్నారు. జిల్లాలో పాజిటివిటీ రేటు 30 శాతం దాటింది. పెద్దసంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించి ఎక్కడికక్కడ వైరస్‌ సోకినవారిని ఆసుపత్రులు, హోంఐసోలేషన్‌ కేంద్రాల్లో చేర్పించాల్సి ఉంది. అయితే అధికారులు ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అనంతలోని వైరాలజీ ల్యాబ్‌లో రోజుకు 6 వేల పరీక్షలు చేయవచ్ఛు ప్రస్తుతం రోజుకు 3,500కి మించి చేయడం లేదు. నియోజకవర్గ కేంద్రాల్లో కిట్ల కొరత వేధిస్తోంది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో రోజుకు సగటున 30కి మించి పరీక్షలు చేయడం లేదు. కేవలం లక్షణాలు ఉన్నవారి నమూనాలు మాత్రమే సేకరిస్తున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులు తిరిగి తరగతులకు హాజరయ్యేందుకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు. అయితే లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయడం లేదు.

నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు

కొంతమందికి రెండో డోసు వేయకుండానే వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు తప్పుడు సందేశాలు వస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. పోర్టల్‌లో కొన్ని సాంకేతిక లోపాల కారణంగా ఇలా జరుగుతోంది. దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరైనా సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా టీకాలు వేసినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. - యుగంధర్‌, జిల్లా వ్యాధినిరోధక టీకాల నిర్వహణాధికారి

జిల్లాలో వ్యాక్సినేషన్‌ లెక్కలిలా..

మొదటిడోసు 32,77,873

రెండో డోసు 28,00,684

15-18 ఏళ్ల వారికి 2,03,943

ప్రీకాషన్‌ డోసు 17,330

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని