logo

విత్తనోత్పత్తి క్షేత్రంఅధికారి పెత్తనం !

కణేకల్లు వరి విత్తనోత్పత్తి కేంద్రం అక్రమాలకు నిలయంగా మారింది. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటం.. ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం ఆ క్షేత్రంలోని అధికారికి కలిసొచ్చాయి. తనను అడిగేదెవరు అంటూ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎలాంటి రికార్డులు, లెక్కలు లేకుండానే

Published : 22 Jan 2022 04:25 IST

ప్రభుత్వ సొమ్ము పక్కదారి

తనిఖీల్లో గుర్తించినా చర్యల్లేవు

విత్తనోత్పత్తి క్షేత్రంలో ధాన్యం కుప్పలు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, కణేకల్లు: కణేకల్లు వరి విత్తనోత్పత్తి కేంద్రం అక్రమాలకు నిలయంగా మారింది. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటం.. ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం ఆ క్షేత్రంలోని అధికారికి కలిసొచ్చాయి. తనను అడిగేదెవరు అంటూ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎలాంటి రికార్డులు, లెక్కలు లేకుండానే దశాబ్దంపాటు క్షేత్రాన్ని నడిపించారు. వచ్చిన దిగుబడిని తక్కువ చేసి చూపిస్తూ భారీ అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఫలితంగా పదేళ్లలో సుమారు రూ.10 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలకు గతంలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారుల సహకారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతేడాది ఆడిట్‌ జరగ్గా.. పెట్టుబడి వ్యయం, దిగుబడి వివరాలు, వచ్చిన ఆదాయాన్ని చూపే బిల్లులు, రికార్డులు లేకపోవడంతో అవినీతి జరిగినట్లు తేలింది. అయినా సదరు అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. నివేదికను గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికితోడు తనిఖీలకు వచ్చిన కమిషనరేట్‌ అధికారులు కూడా సుమారు రూ.5 కోట్ల వరకు అవినీతి జరిగిందనే నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

లెక్కలు లేవప్ఫా.

సాధారణ రైతు వరి సాగు చేసినా హెక్టారుకు (2.5 ఎకరాలు) 75 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. విత్తనోత్పత్తి కేంద్రంలో మాత్రం 40-45 క్వింటాళ్లకు మించడం లేదు. అంటే హెక్టారుకు 30 క్వింటాళ్లు తక్కువ చేసి చూపుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రంలోని అధికారిపై ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఏడాది ఉన్నతాధికారులు పర్యవేక్షించగా.. 53.98 క్వింటాళ్ల దిగుబడి రావడం గమనార్హం. గతంతో పోలిస్తే హెక్టారుకు 13 క్వింటాళ్ల దిగుబడి పెరిగింది. ఈలెక్కన 56 (140 ఎకరాలు) హెక్టార్లకు సగటున 3,024 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు రాయితీ పోగా రెండు పంటలకు గాను ఏడాదికి రూ.కోటిపైనే ఆదాయం వస్తుంది. ఈ లెక్కన హెక్టారుకు 53.98 క్వింటాళ్ల ప్రకారమే. సగటు దిగుబడి 75 క్వింటాళ్లుగా పరిగణనలోకి తీసుకుంటే ఆదాయం రూ.కోటిన్నర వరకు ఉంటుందని అంచనా. జేడీఏ ఆధ్వర్యంలో ఈఏడాది వరిగడ్డి వేలం వేయగా రూ.2.57 లక్షల ఆదాయం వచ్చింది. పదేళ్లలో గడ్డి వేలానికి సంబంధించిన రికార్డులు లేవని చెబుతున్నారు. ప్రాసెసింగ్‌ చేయగా మిగిలిన నాణ్యత తక్కువగా ఉన్న ధాన్యాన్ని వేలం వేసిన దాఖలాలు లేవు. అంటే ఆ మొత్తం పక్కదారి పట్టినట్లు అర్థం అవుతోంది. మరోవైపు విత్తన వరిని ఎన్ని జిల్లాలకు ఎంతమేర పంపారు? దాన్ని విక్రయించగా.. వచ్చిన సొమ్ములో ప్రభుత్వానికి ఎంత చెల్లించారు? అనే రికార్డులు చూపించడం లేదని తనిఖీలకు వెళ్లిన ఉన్నతాధికారులే చెబుతున్నారు.

విచారణ చేపడుతున్నాం - చంద్రనాయక్‌, జేడీఏ

వరి విత్తనోత్పత్తి క్షేత్రంలో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదు నేపథ్యంలో ఈసారి దిగుబడులపై నిఘా పెట్టి పక్కాగా నమోదు చేయించాం. వరిగడ్డి ద్వారా ప్రభుత్వానికి రూ.2.57 లక్షల ఆదాయం వచ్చింది. సంబంధిత రికార్డులను అడిగితే సమాధానం దాటవేస్తున్నారు. అందుకే క్షేత్రంలో ఏం జరిగిందనే దానిపై సమగ్ర విచారణ చేపడుతున్నాం. దీనిలో భాగంగానే కమిషనరేట్‌ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. అక్రమాలపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం.

ఇదీ ఉద్దేశం

హెచ్చెల్సీ ఏర్పాటుతో సాగునీటికి ఢోకా ఉండదనే ఉద్దేశంతో కణేకల్లులో 1966లో వరి విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 192 ఎకరాల భూమిని కేటాయించగా.. రెండు క్షేత్రాల పరిధిలోని 140 ఎకరాల్లో విత్తనోత్పత్తి చేస్తున్నారు. మిగిలిన భూమిని ఖాళీగా ఉంచారు. ఇక్కడ బీపీటీ సోనా 5204 రకం వరి విత్తనోత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వం హెక్టారుకు రూ.60 వేలు చొప్పున రివాల్వింగ్‌ ఫండ్‌ ఇస్తుంది. వచ్చిన దిగుబడిని ప్రాసెసింగ్‌ చేసి 30 కిలోల బస్తాల్లో ప్యాకింగ్‌ చేసి రాష్ట్రంలోని 13 జిల్లాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. క్వింటా ధర రూ.3,950గా నిర్ణయించారు. రాయితీపోగా రైతులు క్వింటాకు రూ.2,210 చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా విత్తన వరిని విక్రయించగా వచ్చిన సొమ్మును సంబంధిత ఏవోలు క్షేత్రం ఖాతాలో జమ చేస్తారు. దీంతోపాటు వరిగడ్డి, ప్రాసెసింగ్‌ చేయగా మిగిలిన నాణ్యత తక్కువ ఉన్న ధాన్యాన్ని వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి.

పదేళ్లుగా తిష్ట

2011లో విత్తనోత్పత్తి క్షేత్రం బాధ్యతలు చేపట్టిన సదరు అధికారి ఇంకా అక్కడే కొనసాగుతుండటం విశేషం. గతంలో కళ్యాణదుర్గం, మరోసారి జిల్లా కేంద్రం సమీపంలోని రైతు శిక్షణ కేంద్రానికి బదిలీ అయినా డిప్యుటేషన్‌పై ఇక్కడికే వచ్చి చేరడం గమనార్హం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నిబంధనలను గాలికొదిలేసి క్షేత్రాన్ని తన సొంత పొలంలా మార్చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రంలో కొంతభాగాన్ని కణేకల్లుకు చెందిన పలువురు రైతులకు కౌలుకు ఇచ్చి రూ.లక్షల్లో దండుకున్నట్లు సమాచారం. విత్తనోత్పత్తి క్షేత్రం మినహాయించి మిగిలిన ఖాళీ భూముల్ని కూడా అనధికారికంగా సాగు చేసి వచ్చిన ఆదాయాన్ని జేబులో వేసుకున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడి కోసం ప్రభుత్వం ఇచ్చే రివాల్వింగ్‌ ఫండ్‌కు కనీసం ప్రతిపాదనలు కూడా పంపడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు వచ్చిన దిగుబడిని కూడా తక్కువ చూపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు తనిఖీలకు వచ్చిన అధికారులు గుర్తించినట్లు సమాచారం.

కణేకల్లు వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్ర కార్యాలయం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని