logo

భయపెట్టి... బకాయిలు రాబట్టి!

జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు పొందిన మొత్తం 487మంది లబ్ధిదారులకు తాఖీదులు ఇచ్చారు. బకాయి చెల్లించకుండా జాప్యం చేస్తున్నవారిపై అధికారులు దృష్టి సారించారు. రుణం పొందే సమయంలో హామీ సంతకం చేసిన ఉద్యోగులను సైతం వదలడం లేదు. జిల్లాలో ఇప్పటికే 200 మంది

Published : 22 Jan 2022 04:25 IST

200మంది ప్రభుత్వ ఉద్యోగులకు తాఖీదులు

ఎస్సీ రుణాల వసూలుకు వ్యూహం


జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంఘం కార్యాలయం

న్యూస్‌టుడే-అనంత సంక్షేమం : ‘జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు పొందిన మొత్తం 487మంది లబ్ధిదారులకు తాఖీదులు ఇచ్చారు. బకాయి చెల్లించకుండా జాప్యం చేస్తున్నవారిపై అధికారులు దృష్టి సారించారు. రుణం పొందే సమయంలో హామీ సంతకం చేసిన ఉద్యోగులను సైతం వదలడం లేదు. జిల్లాలో ఇప్పటికే 200 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చారు. నేరుగా వారి జీతాల నుంచి వసూలు అయ్యేలా చర్యలు చేపట్టారు. ఎప్పుడో తీసుకున్న రుణానికి అప్పట్లో హామీ ఇచ్చిన వారికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి’.

పాత బకాయిల వసూలుపై జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార సంఘం (ఎస్సీ కార్పొరేషన్‌) దృష్టి సారించింది. లబ్ధిదారులతో పాటు ఎవరైతే పూచీ(గ్యారెంటీ) ఇచ్చి ఉంటారో వారికి సైతం తాఖీదులు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇన్నోవా, ట్రాక్టర్లు, ఆటోలు, నాన్‌ ట్రాన్స్‌పోర్టు విభాగాల కింద రుణాలు ఇచ్చారు. ఇందులో 104మంది ఒక్క పైసా కూడా చెల్లించలేదు. 69మంది అడపాదడపా కడుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బంది బృందాలుగా విడిపోయి వసూళ్లే ధ్యేయంగా లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ ద్వారా నిధులు అందించారు. రాష్ట్రస్థాయిలో వసూళ్లు చేయాలని నిర్దేశించడంతో అనంత అధికారులు సైతం వసూళ్లకు తెరతీశారు.

రెండేళ్లుగా రుణం ఊసే లేదు

జిల్లాలో ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ కింద పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. రెండేళ్లుగా కరోనా రావడంతో ఇబ్బంది ఏర్పడిందని, ఉన్న పళంగా పాత బకాయి చెల్లించాలని ఒత్తిడి తెస్తుండటంతో ఇబ్బందులు తప్పడం లేదని బాధితులు పేర్కొంటున్నారు. 2015 నుంచి 2018 సంవత్సరం వరకు రుణాలు ఇచ్చారు. తాఖీదులు ఇవ్వడం, ఉద్యోగుల జీతాల నుంచి వసూలు చేస్తుండటంతో ఏకంగా ఇప్పటికే రూ.కోటి వసూలు అయింది. రెండున్నరేళ్లుగా పథకాన్ని ఆపేశారు. ఇటీవలే కేవలం 8 ఇన్నోవా కార్లు ఇస్తామని లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అయితే ఇంటర్వ్యూలు నిర్వహించలేదు.

హామీ దారులే బాధ్యులు - డాక్టర్‌ ప్రభాకర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ

కార్పొరేషన్‌ ఇచ్చిన రుణం కొందరు సక్రమంగా చెల్లిస్తున్నారు. మరికొందరు చెల్లించకపోవడంతో కలెక్టరు ఆదేశాల మేరకు తాఖీదులు ఇవ్వడంతో చెల్లిస్తున్నారు. బకాయి చెల్లించని వారికి హామీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేస్తున్నాం. ఇప్పటి దాకా ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ ద్వారా రూ.కోటికి పైగానే వసూలు అయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని