logo

కరోనాపంజా

జిల్లాలో కరోనా ఉద్ధృతమవుతోంది. శుక్రవారం కొత్తగా 1,235 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసులు 4,254కు చేరాయి. పాజిటివ్‌ రేటు కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 4,903 మందికి పరీక్షలు చేయగా.. 1,235 మందికి పాజిటివ్‌గా

Published : 22 Jan 2022 04:25 IST

కొత్తగా 1,235 కేసులు

పాజిటివిటీ 25.19 శాతం

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా ఉద్ధృతమవుతోంది. శుక్రవారం కొత్తగా 1,235 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసులు 4,254కు చేరాయి. పాజిటివ్‌ రేటు కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 4,903 మందికి పరీక్షలు చేయగా.. 1,235 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాజిటివిటీ 25.19 శాతం నమోదయ్యింది. దీన్నిబట్టి వైరస్‌ ఏ స్థాయిలో విస్తరిస్తుందో స్పష్టమవుతోంది. కేసులు పెరుగుతుండటంతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిల్లో 2,190 పడకలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తే వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఆసుపత్రుల్లో 71 మందికి చికిత్స

జిల్లాలో యాక్టివ్‌ కేసులు 4,254 ఉన్నాయి. వీరిలో 71 మంది మాత్రమే కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం నాటికి ఆక్సిజన్‌ పడకల్లో ఏడుగురు, సాధారణ పడకలపై 64 మంది ఉన్నారు. మిగతా వారంతా హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు.

3,499 పడకలు సిద్ధం

జిల్లాలోని 33 కొవిడ్‌ ఆసుపత్రుల్లో 3,499 పడకలు ఏర్పాటు చేశారు. వీటిలో ఐసీయూ 522, ఆక్సిజన్‌ 2,205, సాధారణ పడకలు 772 అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 522 ఐసీయూ, 2,198 ఆక్సిజన్‌, 708 సాధారణ పడకలు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు 15 కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. బాధితులు ఆయా కేంద్రాల్లో ఉంటూ వైద్యుల సలహాలు తీసుకోవచ్ఛు

20మంది సిబ్బందికి..

టేకులోడుక్రాస్‌(చిలమత్తూరు): టేకులోడుక్రాస్‌లోని గురుకుల పాఠశాలలో 20 మంది బోధన, బోధనేతర సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గురువారం 40 మందికి కరోనా పరీక్ష చేయగా 20మందిలో వైరస్‌ నిర్ధారణ అయ్యింది. శుక్రవారం 70 మంది విద్యార్థినుల నుంచి నమూనాలను స్వీకరించారు.

గురుకుల పాఠశాలలో కలకలం

పెనుకొండ పట్టణం: పెనుకొండలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడుగురు విద్యార్థినులకు కొవిడ్‌ లక్షణాలున్నట్లు నిర్ధారణ అయ్యింది. పాఠశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ రఘునందన్‌నాయక్‌ బాధిత తల్లిదండ్రులను పిలిపించి వారి వెంట విద్యార్థినులను ఇంటికి పంపించారు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లి వచ్చిన వారిలో 23 మంది తీవ్రమైన జ్వరం ఉండటంతో రెండు రోజుల క్రితం కొవిడ్‌ పరీక్షలు చేశారు. వీరిలో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం పాఠశాలలో 60 మంది ఉన్నారు. శుక్రవారం 20 మందికి కొవిడ్‌ పరీక్ష చేశారు.

ఎక్కడెక్కడ ఎన్నెన్ని..

అన్ని పట్టణ, మండల కేంద్రాలకు వైరస్‌ వ్యాప్తి చెందింది. తాజాగా కేసులను పరిశీలిస్తే.. అనంత నగరంలో 361, హిందూపురం 119, కదిరి 69, పుట్టపర్తి 63, పెనుకొండ 57, గుంతకల్లు 38, అనంత గ్రామీణం 37, తాడిపత్రి 35, పెద్దవడుగూరు 30, సోమందేపల్లి 30, కళ్యాణదుర్గం 28, ధర్మవరం 27, గోరంట్ల 26, లేపాక్షి 21, ముదిగుబ్బ 20, యాడికి 16, బుక్కరాయసముద్రం 15, గుత్తి 15, కొత్తచెరువు 15, చిలమత్తూరు 14, గుడిబండ 13, బత్తలపల్లి 11, కంబదూరు మండలంలో 11 చొప్పున నమోదయ్యాయి.

సర్వజనలో కలవరం

సర్వజనాసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బందిని కరోనా వెంటాడుతోంది. సుమారు 15 మంది వైద్యులు ఇప్పటికే హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇద్దరు అధికారులు, నర్సింగ్‌ పర్యవేక్షకురాలు క్వారంటైన్‌లో ఉన్నారు. గర్భిణులు, బాలింతల వార్డులో 24 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈక్రమంలో సాధారణ రోగుల ఓపీ సేవలను తగ్గించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. సర్వజనాసుపత్రిలోని కొవిడ్‌ ఓపీ విభాగంలో అనుమానిత లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేయనున్నారు. బాధితుల మొదటి, రెండో కాంట్రాక్టులు, ఇతరులు పీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ కేంద్రాల్లో నమూనాలు ఇవ్వాలని అధికారులు సూచించారు.

ఏడుగురు ఉపాధ్యాయులకు..

తనకల్లు: మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న ఏడుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. చండ్రాయునిపల్లి, పరమటవారిపల్లి, రాసినేపల్లి, లక్ష్మేనాయక్‌తండా, మార్పూరివాండ్లపల్లి, కొక్కంటి దళితవాడ, వేపలపల్లి పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకున్నారు. కరోనా నిర్ధారణ కావడంతో హోమ్‌ క్యారంటైన్‌లో ఉన్నారు. ఆయా పాఠశాలల్లో శానిటైజ్‌ చేయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని