logo

పదోన్నతుల్లో పైసా వసూల్‌!

జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో (ఐసీడీఎస్‌) మరో అవినీతి బాగోతం తెరపైకి వచ్చింది. పదోన్నతుల వ్యవహారంలో చేతివాటం చోటుచేసుకున్నట్లు తెలిసింది. తాజాగా ఐసీడీఎస్‌లోని సూపర్‌వైజర్లకు గ్రేడ్‌-2 నుంచి గ్రేడ్‌-1గా పదోన్నతులు కల్పించారు. కర్నూలు ప్రాంతీయ సంయుక్త

Published : 23 Jan 2022 03:17 IST

కౌన్సెలింగ్‌ లేకుండా పోస్టింగ్‌

ఐసీడీఎస్‌లో ఇదీ పరిస్థితి

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో (ఐసీడీఎస్‌) మరో అవినీతి బాగోతం తెరపైకి వచ్చింది. పదోన్నతుల వ్యవహారంలో చేతివాటం చోటుచేసుకున్నట్లు తెలిసింది. తాజాగా ఐసీడీఎస్‌లోని సూపర్‌వైజర్లకు గ్రేడ్‌-2 నుంచి గ్రేడ్‌-1గా పదోన్నతులు కల్పించారు. కర్నూలు ప్రాంతీయ సంయుక్త సంచాలకురాలు(ఆర్జేడీ) సారథ్యంలో రాయలసీమ జిల్లాలోని 68 మంది సూపర్‌వైజర్లకు గ్రేడ్‌-1 పదోన్నతి లభించింది. ఇందులో అనంత జిల్లాకు సంబంధించి 28 మందికి పదోన్నతి కల్పించారు. ఈ ప్రక్రియ ఇష్టారాజ్యంగా సాగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ర్యాంకుల సీనియార్టీ ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహించి పదోన్నతి కల్పించాల్సి ఉంది. అయితే కౌన్సెలింగే నిర్వహించలేదు. మరోవైపు రోస్టర్‌ అమలు చేయలేదన్న వాదన వినిపిస్తోంది.

పనిచేసే చోటే నియామకం

జిల్లాలో పదోన్నతి పొందిన 28 మందిలో.. ఏకంగా పదకొండు మందికి ప్రస్తుతం పనిచేసే చోటే పోస్టింగ్‌ ఇవ్వడం విమర్శలకు దారి తీస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పదోన్నతి కల్పించిన తర్వాత స్థానచలనం కల్పించాలి. ఒకరికి ఉరవకొండ నుంచి కర్నూలు జిల్లా ఆలూరు ప్రాజెక్టు పోస్టింగ్‌ ఇచ్చారు. తక్కిన 16 మంది సూపర్‌వైజర్లను ఇతర ప్రాజెక్టులకు నియమించారు. కౌన్సెలింగ్‌ నిర్వహించకపోవడంతో ప్రతిభ కల్గిన వారికి నష్టం వాటిల్లిందని, దూరంలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయించినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తమీ తతంగంలో చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఓ అధికారికి సన్నిహితంగా మెలిగే ఓ సీనియర్‌ ఉద్యోగి దళారీగా వ్యవహరించినట్లు ప్రచారం సాగుతోంది. పదోన్నతి జాబితాలో పేరు నమోదుకు రూ.50 వేలు, కావాల్సిన చోటుకు పోస్టింగ్‌కు మరో రూ.50 వేలు ప్రకారం వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ఆరోపణల్లో నిజం లేదు

- పద్మజ, ఆర్జేడీ, ఐసీడీఎస్‌

పదోన్నతుల కల్పన, పోస్టింగ్‌ల కోసం డబ్బులు వసూలు చేశారని ఆరోపించడంలో నిజం లేదు. అలాంటిదేమీ జరగలేదు. అవన్నీ వదంతులే. పోస్టింగ్‌ల కోసం కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదు. సూపర్‌వైజర్ల నుంచి ఆప్షన్లు తీసుకున్నాం. ఖాళీలను బట్టి పోస్టింగ్‌ ఇచ్చేశాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని