logo

బడికెళ్లేదెలా సారూ...!

ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా పడగ విప్పింది. 88 మంది ఉపాధ్యాయులు, సుమారు 30 మంది విద్యార్థులు వైరస్‌ బారిన పడ్డారు. ఇది అధికారికంగానే.. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది. విద్యార్థుల్లో 30 శాతంపైగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. వీరికి ప్రత్యేకంగా ఎలాంటి

Published : 23 Jan 2022 03:17 IST

పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా

పాఠశాలల్లో నిబంధనలు గాలికి..

ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా పడగ విప్పింది. 88 మంది ఉపాధ్యాయులు, సుమారు 30 మంది విద్యార్థులు వైరస్‌ బారిన పడ్డారు. ఇది అధికారికంగానే.. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది. విద్యార్థుల్లో 30 శాతంపైగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. వీరికి ప్రత్యేకంగా ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదు. బాధితులు ఉన్న పాఠశాలలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు.

కస్తూరిబా విద్యాలయాల్లోనూ అదే పరిస్థితి. పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులను వైరస్‌ చుట్టుముట్టింది. వసతి గృహాల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కస్తూరిబా బాలికా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో వసతి గృహాలున్నాయి. వీటితోపాటు సంక్షేమ వసతి గృహాల్లోనూ అందరూ కలసి ఉండటంతో కరోనా మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. వసతి గృహ విద్యార్థుల్లో 40 శాతం మందికి దగ్గు, జలుబు, జ్వరం ఉన్నట్లు తెలుస్తోంది.

న్యూస్‌టుడే, అనంతపురం విద్య కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. మూడో అల ఉద్ధృతంగా ఉంటుందని సంకేతాలు వస్తున్నా సర్వత్రా నిర్లక్ష్యం నెలకొంది. పాఠశాలల్లో మరీ దారుణం. కొవిడ్‌ నిబంధనలు అమలు చేయడం లేదు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మాస్కులు అరకొరగానే ధరిస్తున్నారు. పాఠశాలలోకి ప్రవేశించే సమయంలో శరీర ఉష్ణోగ్రత పరిశీలించేవారే లేరు. శానిటైజర్‌ ఊసేలేదు. శుభ్రత అంతంత మాత్రమే. ఎక్కడా భౌతికదూరం కనిపించడం లేదు. దీంతో తల్లిదండ్రులు భయంభయంగానే పిల్లలను పాఠశాలలకు పంపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 88 మంది ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు. పలువురు విద్యార్థులకు వైరస్‌ సోకింది. ఇవి ప్రభుత్వ వైద్యకేంద్రాల్లో చేసిన పరీక్షా ఫలితాలే. అనేకమంది ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పరీక్షలు చేయించుకుంటున్నారు. కొందరు ఫలితాలను గోప్యంగా ఉంచుతున్నారు. ప్రతిఒక్కరూ కరోనా కట్టడికి బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గుంపులుగా చేరొద్దు

సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభంలో మొదటి రెండు రోజులు విద్యార్థులు 50 శాతం మాత్రమే హాజరయ్యారు. మూడు రోజులుగా 70 శాతం హాజరు నమోదవుతోంది. అయితే అనేకమంది జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. అయినా పాఠశాలకు వస్తుండటంతో తోటి విద్యార్థులు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. వందల మంది విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. అయినా భౌతిక దూరం పాటించడం లేదు. చాలామంది మాస్కులు ధరించడం లేదు. మధ్యాహ్న భోజన సమయంలో గుంపులుగా చేరుతున్నారు.

నిబంధనలు అమలు చేస్తాం: శామ్యూల్‌, డీఈఓ

కొవిడ్‌ నిబంధనలు పాఠశాలల్లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. ఉపాధ్యాయులందరికీ టీకాలు 100 శాతం వేయించాం. 15 ఏళ్లు నిండిన విద్యార్థులకు మొదటి డోసు పూర్తి చేశాం. కరోనా నిర్ధారణ అయిన తరగతి విద్యార్థులందరికీ పరీక్షలు చేయించాలని ఆదేశించార. పాఠశాలల్లో శానిటైజ్‌ చేయిస్తున్నాం. కొవిడ్‌ పరీక్షలు పాఠశాలల్లో నిర్వహించే విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

కస్తూరిబాలో కరోనా కలకలం

ఉరవకొండ: పట్టణంలోని కస్తూరిబా విద్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. మొత్తం 20 మంది వైరస్‌ బారినపడ్డారు. మూడురోజుల కిందట ఓ విద్యార్థిని కొవిడ్‌బారిన పడినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో రెండు రోజుల కిందట 38 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు చేశారు. ఆ ఫలితాలు శనివారం వచ్చాయి. 19 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో విద్యాలయం ఎస్‌వోతో కలిపి 9 మంది ఉపాధ్యాయినులు, 11 మంది విద్యార్థినులు ఉన్నారు. ఉన్నతాధికారులు విద్యాలయానికి మూడురోజులు సెలవులు ప్రకటించారు. విద్యార్థినులందరినీ ఇళ్లకు పంపించేశారు.

తల్లిదండ్రులూ జాగ్రత్త

విద్యార్థుల ఆరోగ్యాన్ని అధికారులు, పాఠశాల యాజమాన్యంపైనే వదిలేయకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. తమ పిల్లలు మాస్కులు ధరించేలా అవగాహన కల్పించాలి. చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం నేర్పాలి. అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యం చేయించాలి. జ్వరం, దగ్గు, జలుబు తగ్గేవరకు బడికి పంపవద్ధు

విశ్వవిద్యాలయాల్లో..

ఎస్‌కేయూ, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూ, ఎస్‌కేయూలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఎస్కేయూ వీసీ, రిజిస్ట్రార్‌కు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ రెండు విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు, బోధన సిబ్బంది సుమారు 50 మంది కొవిడ్‌ బారినపడ్డారు. జేఎన్‌టీయూ వసతి గృహంలో 20 మంది విద్యార్థినులు కరోనాతో బాధపడుతున్నారు. అయినా వారికి ప్రత్యేకంగా గదులు కేటాయించలేదు. ఇతర విద్యార్థినులతో కలిసి ఉండటంతో భయాందోళన నెలకొంది. మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో వారు ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు కూడా సరఫరా చేయడం లేదు. కొందరు విద్యార్థులు ప్రైవేటుగా పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

మాస్కులు ధరించని విద్యార్థినులు

అందరికీ పరీక్షలు చేస్తేనే..

15 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు టీకాలు పాఠశాలలోనే వేయిస్తున్నారు. అలాగే ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులకు కొవిడ్‌ పరీక్షలు చేయించాలి. అనుమానం ఉన్న ప్రతిఒక్కరికీ పరీక్షలు విధిగా చేయిస్తే మంచిది. ఫలితాలు వెలువడిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలి. ఇలా చేస్తేనే కరోనా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అన్ని పాఠశాలలను శానిటైజ్‌ చేయాలి

ప్రభుత్వ పాఠశాలలు: 3,841

ఉపాధ్యాయులు: 25,894

విద్యార్థులు: 3.61 లక్షలు

వైరస్‌ సోకిన ఉపాధ్యాయులు: 88

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని