logo

ఒక్క పునాదీ తీయలేదు..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల నిర్మాణం మండలంలో అమలుపై సందిగ్ధం నెలకొంది. అనువుగానిచోట స్థలాలు కేటాయించడమే అందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. మండలవ్యాప్తంగా ఇంటి స్థలాలకోసం రెండేళ్ల కిందట పేదలు 10,318 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Published : 23 Jan 2022 03:24 IST

అనువుగానిచోట స్థలాల కేటాయింప

కొలిమిపాళ్యం సమీపంలో కేటాయించిన స్థలం

కుందుర్పి, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల నిర్మాణం మండలంలో అమలుపై సందిగ్ధం నెలకొంది. అనువుగానిచోట స్థలాలు కేటాయించడమే అందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. మండలవ్యాప్తంగా ఇంటి స్థలాలకోసం రెండేళ్ల కిందట పేదలు 10,318 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు నిబంధనల పేరిట, రాజకీయ ఒత్తిళ్లతో 263 మందికి మాత్రమే అర్హత ఉన్నట్లు లెక్కతేల్చి అందుకు అనుగుణంగా స్థలాలు అందించే కార్యక్రమం చేపట్టారు. 13 గ్రామ పంచాయతీలకు గాను ఆరింటిలో లబ్ధిదారులకు నిరుపయోగంగా ఉన్న కొండలను కేటాయించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుట్టలను చదునుచేసి లేఅవుట్‌లు వేసి రెండేళ్లు పూర్తయినా ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేదు. కనీసం పునాది కూడా తీయలేదు.

జంబుగుంపల పంచాయతీ పరిధిలో మూడు గ్రామాలకు స్థలాలను కి.మీ.ల దూరంగా కర్ణాటక సరిహద్దును ఆనుకొని ఉన్న కొండలో ఇచ్చారు. ఎత్తుపల్లాలను సరిచేసి పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు పంచాయతీ కేంద్రానికి, ఇటు నివాసగ్రామానికి దూరంగా ఉండటంతో నిర్మాణం ఎలా చేపట్టాలని, అక్కడ నివాసం ఉండటమెలా అని ఆందోళన చెందుతున్నారు. కొలిమిపాళ్యంలోనూ అదే పరిస్థితి.

మండలకేంద్రంలోనూ ఊరికి దూరంగా పెద్దకొండను ఆనుకొని బూడిదనేలను చదునుచేసి, పైనమాత్రం అడుగు మేర ఎర్రమట్టిని వేసి రోలింగ్‌చేశారు. పునాదులకు అనుకూలంగా లేదని లబ్ధిదారులు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో కొండపైన ఉన్న కోటగోడలు జారిపడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెనగల్లులో గ్రామానికి దూరంగా కి.మీ. పరిధిలో కొండకు ఆనుకొని స్థలాలు కేటాయించారు. పనులు చేపట్టకపోవటంతో పిచ్చిమొక్కలు, కంపచెట్లు మొలిచి కేటాయించిన సంబర్లు కూడా కనిపించనంతగా మారిపోయాయి.

అపిలేపల్లి పంచాయతీ పరిధిలో రెండు గ్రామాలకు కలిపి మందలపల్లి సమీపాన కొండగుట్టలో రాళ్లను తొలగించి లేఅవుట్‌ వేశారు. వర్షాకాలంలో ఇక్కట్లు తప్పవని, కొండపైనుంచి నీళ్లొచ్చే ప్రమాదం ఉందని లబ్ధిదారులు ఆసక్తి చూపటంలేదు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..

మండలంలో ప్రభుత్వ భూములు లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు కొండప్రాంతాల్లోనే చదునుచేసి పట్టాలు ఇచ్చినట్లు తహసీల్దారు ఈశ్వరమ్మ పేర్కొన్నారు. గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలో త్వరలో రెండో విడత నిర్మాణాలు ప్రారంభమవుతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని