logo

ఢీకొట్టి.. నాలుగు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి!

ఒక్కసారిగా జీపు దూసుకొచ్చింది.. ముగ్గురు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.. వాహనాన్ని సుమారు నాలుగు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది.. దారిమళ్లించి జీపును కాలువలోకి తోసి తప్పించుకుని వెళ్లారు. ఇదంతా ఏదో సినిమా అనుకుంటే పొరపాటే. పట్టపగలే నడిరోడ్డుపై జరి

Updated : 25 Jan 2022 06:12 IST

ముగ్గురికి తీవ్రగాయాలు

కోర్టు వాయిదాకు వెళ్తుండగా ఘటన

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ఒక్కసారిగా జీపు దూసుకొచ్చింది.. ముగ్గురు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.. వాహనాన్ని సుమారు నాలుగు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది.. దారిమళ్లించి జీపును కాలువలోకి తోసి తప్పించుకుని వెళ్లారు. ఇదంతా ఏదో సినిమా అనుకుంటే పొరపాటే. పట్టపగలే నడిరోడ్డుపై జరిగిన ఘటన ఇది. అనంత గ్రామీణం సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరుకు చెందిన తండ్రి వెంకటరమణారెడ్డి, కుమారులు పుల్లారెడ్డి, గరుడశేఖర్‌రెడ్డి ద్విచక్రవాహనంపై అనంతపురం వస్తుండగా.. పామురాయి చెరువు కట్ట వద్ద గంగమ్మ గుడి మలుపులో వెనుక నుంచి సఫారీ జీపు వేగంగా వచ్చి ఢీకొట్టింది. జీపు ఇంజన్‌లోకి ద్విచక్ర వాహనం ఇరుక్కుపోయింది. అలాగే సుమారు నాలుగు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. నిందితులు స్థానిక హెచ్చెల్సీ కాలువ వద్ద సర్వీస్‌రోడ్డు పక్కన ద్విచక్ర వాహనాన్ని వదిలేశారు. అక్కడి నుంచి కాలువ గట్టు వెంబడి జీపులో వేగంగా వెళ్లి, శ్రీశ్రీ నగర్‌ వద్ద హెచ్చెల్సీ కాలువలోకి సఫారీ వాహనాన్ని తోసేశారు. అనంతరం అందులోని ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పుల్లారెడ్డి, గరుడశేఖర్‌ రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. రెండో పట్టణ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అనంత గ్రామీణం, మూడో పట్టణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, ఏఎఫ్‌వో అశ్వర్థ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది కాలువలోకి దిగి జీపును బయటకు తీశారు.

పాతకక్షలే కారణమా ?..

ఈ ఘటనకు పాతకక్షలే కారణమని తెలుస్తోంది. రేగడి కొత్తూరులో సోమిరెడ్డి, వెంకటరమణారెడ్డి కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా పొలంలో రస్తా వివాదం ఉండేది. ఈ క్రమంలో 2019 ఆగస్టు 13న వెంకటరమణారెడ్డి కుటుంబ సభ్యులు పుల్లారెడ్డి, గరుడశేఖర్‌రెడ్డిలు.. సోమిరెడ్డి ఇంటి వద్దకెళ్లి అతనిపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ఆ మరుసటి రోజే బెంగళూరులో ఓ ఆసుపత్రిలో మృతిచెందాడు. ఈ కేసులో పై ముగ్గురిపై బుక్కరాయసముద్రం పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చి సోమవారం వాయిదాల నిమిత్తం వారు జిల్లా కోర్టుకు వస్తుండగా ఘటన జరిగింది. పాత క్షక్షతోనే అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని