logo

భూమి డబ్బులు అడిగితే.. బెదిరిస్తున్నారు

తనతండ్రి నుంచి కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని అడిగితే అధికార వైకాపా నాయకులు కాళ్లు నరుకుతామని బెదిరించడంతో మనస్తాపానికి గురైన బాధితుడు పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన బుధవారం కదిరి మండలంలో చోటు చేసుకుంది

Published : 27 Jan 2022 07:55 IST

అవమానంతో ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు


ప్రభుత్వ ఆసుపత్రిలో రోదిస్తున్న రంజిత్‌నాయక్‌

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: తనతండ్రి నుంచి కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని అడిగితే అధికార వైకాపా నాయకులు కాళ్లు నరుకుతామని బెదిరించడంతో మనస్తాపానికి గురైన బాధితుడు పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన బుధవారం కదిరి మండలంలో చోటు చేసుకుంది. బాధితుడు గ్రామీణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు. కదిరి మండలం అలీపూర్‌తండాకు చెందిన రమణానాయక్‌ సంవత్సరం కిందట ముత్యాలచెరువు గ్రామ పొలంలోని 86 సెంట్ల భూమిని వైకాపా నాయకులు కృష్ణానాయక్‌, ఉపేంద్రనాయక్‌, సేవేనాయక్‌లకు రూ.66 లక్షలకు విక్రయించి రిజిస్ట్రేషన్‌ చేయించారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో రూ.2.37 లక్షలు చెల్లించి మిగతా సొమ్ము త్వరలోనే ఇస్తామని చెప్పారు. కృష్ణానాయక్‌ భార్య జడ్పీటీసీ ఎన్నికలబరిలో ఉన్నందున కౌంటింగ్‌ పూర్తయ్యాక మొత్తం డబ్బు చెల్లిస్తామన్నారు. బంధువులే కావడంతో రమణనాయక్‌, అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు. కౌంటింగ్‌ పూర్తయి నెలలు గడుస్తున్నా... వాయిదా వేస్తుండటంతో రమణానాయక్‌ కుటుంబం డబ్బుకోసం ఒత్తిడి పెంచారు. ఈలోపే అనారోగ్యం పాలైన రమణానాయక్‌ నెలరోజుల కిందట మరణించారు. భూమి డబ్బులు ఇవ్వని కారణంగానే తమతండ్రి మనోవేదనకు గురై మరణించాడని రంజిత్‌నాయక్‌ భూమిని కొనుగోలు చేసిన కృష్ణానాయక్‌, ఉపేంద్రనాయక్‌, సేవేనాయక్‌ల దృష్టికి తీసుకెళ్లారు. వారు మరోసారి వాయిదా కోరారు. అందుకు రంజిత్‌ నాయక్‌, ఆయన కుటుంబ సభ్యులు ససేమిరా అనడంతో వైకాపా నాయకులు బెదిరింపులకు దిగారు. తమకు రావాల్సిన డబ్బులు అడిగితే బెదిరింపులకు దిగడాన్ని జీర్ణించుకోలేని రంజిత్‌నాయక్‌ మనస్తాపానికి గురై పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు కదిరి గ్రామీణ సీఐ మహమ్మద్‌ రియాజ్‌ అహమ్మద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని