logo

అనంత లోకాలకు.. అక్షర యోధుడు!

ఆయన కవిత్వం ఆలోచనాత్మకం.. ఆయన అవధానం సాహితీలోకానికి వీనులవిందు. పద్యం చెబితే తెలుగుభాషలోని తీయదనం రుచిచూస్తాం. అందుకే ‘పద్యం కమ్మగా పాడువాడు.. పద్యమిథ్యను కాపాడువాడు.. పద్యధ్వేషనలతో రాపాడువాడు’ ఆశావాది

Published : 18 Feb 2022 04:44 IST

అవధాని ఆశావాది ప్రకాశరావు ఇకలేరు


రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి పద్మశ్రీ పురస్కారం
అందుకుంటున్న ప్రకాశరావు (పాతచిత్రం)

అనంతపురం విద్య, పెనుకొండ, న్యూస్‌టుడే: ఆయన కవిత్వం ఆలోచనాత్మకం.. ఆయన అవధానం సాహితీలోకానికి వీనులవిందు. పద్యం చెబితే తెలుగుభాషలోని తీయదనం రుచిచూస్తాం. అందుకే ‘పద్యం కమ్మగా పాడువాడు.. పద్యమిథ్యను కాపాడువాడు.. పద్యధ్వేషనలతో రాపాడువాడు’ ఆశావాది ప్రకాశరావు అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయనను కీర్తించారు. సాహిత్య పిపాసులు ఆయనకు గండపెండేరం తొడిగారు. కనకాభిషేకం చేశారు. ఎన్నో సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సన్మానించింది. ఆరు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సాహితీ శ్రామికుడు ఆశావాది ప్రకాశరావు(77) ఇక లేరు. గురువారం మధ్యాహ్నం పెనుకొండలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. 
ఇదీ ప్రస్థానం..
శింగనమల మండలం పెరవలి గ్రామంలో ఫక్కీరప్ప, కుళ్లాయమ్మ దంపతులకు 1944 ఆగస్టు 2న జన్మించారు. ప్రాథమిక విద్య పెరవలి, 6 నుంచి డిగ్రీ వరకు అనంతపురంలో చదివారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పీజీ సెంటర్‌గా ఉన్నప్పుడు ఎంఏ పూర్తిచేశారు. తెలుగు పండితుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా ఉద్యోగ విరమణ చేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. హైదరాబాద్‌ క్షీరసాహితీ సమితి వారు కనకాభిషేకం చేశారు. పెనుకొండలో గండపెండేరం తొడిగారు. ఉగాది పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక మండలి హంస పురస్కారం, జీవిత సాఫల్య పురస్కారాలు అందుకున్నారు. సుమారు 150కిపైగా రచనలు ఆయన కలం మీదుగా జాలువారాయి.
ఆసాది నుంచి ఆశావాదిగా..
ప్రకాశరావు ఇంటి పేరు ఆసాది. ఆయన అనంతలోని సాయిబాబా కళాశాలలో చదివే రోజుల్లో స్నేహితుల నుంచి ప్రశ్నలు వేయించుకుని వాటికి అవధానం రూపంలో సమాధానం చెప్పేవారు. అప్పటి తెలుగు విభాగం అధ్యక్షుడిగా ఉన్న నండూరి రామకృష్ణమాచార్యులకు తెలిసి ప్రకాశరావును పిలిపించారు. ‘ఏదో అవధానం చేశావట కదా! నేనే సమస్య ఇస్తాను పూరించు’ అన్నారు. దాన్ని పూర్తి చేసిన విధానానికి నండూరి సంబరపడిపోయారు. అవధానంతో నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ఇప్పట్నుంచి నువ్వు ఆసాది కాదు.. ఆశావాది అని ప్రకాశరావు ఇంటి పేరును మార్చారు.


నివాళి అర్పిస్తున్న కుటుంబ సభ్యులు 

పద్యంపై బాల్యం నుంచే మక్కువ
తొలి దళిత అవధానిగా ప్రసిద్ధికెక్కిన ప్రకాశరావుకు బాల్యం నుంచే పద్యంపై మక్కువ పెంచుకున్నారు. తన గురువైన జోగప్పపై విశ్వభూషణ అనే పుస్తకం రాశారు. శతావధాని సి.వి.సుబ్బన్న చేతుల మీదుగా కడప జిల్లా ప్రొద్దుటూరులోని అగస్తేశ్వరాలయంలో అవధానిగా ప్రకటించి మహాపండితుల మధ్య పరీక్షించారు. అందులో విజయం సాధించి సుబ్బన్నకు శిష్యుడిగా మారిపోయారు. 

*ప్రకాశరావు అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం పెనుకొండలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సాహితీ లోకానికి తీరనిలోటు
అనంత సాంస్కృతికం: అక్షరయోధుడు, అష్టావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు మరణం సాహితీలోకానికి తీరనిలోటని సాహితీవేత్తలు పేర్కొన్నారు. పల్లె నుంచి దిల్లీ దాకా తన సాహిత్యాన్ని వినిపించారని, ఆఖరిశ్వాస వరకూ అక్షర సేవకుడిగా పనిచేశారని కొనియాడారు.  ఆయన మృతికి అభ్యుదయ రచయితల సంఘం సభ్యుడు రాచపాళం చంద్రశేఖరరెడ్డి, కవులు, రచయితలు శాంతినారాయణ, ఏలూరి యంగన్న, గుత్తా హరి, రమేష్‌నారాయణ, కొత్తపల్లి సురేష్, జెన్నే ఆనంద్‌కుమార్, నారాయణస్వామి, వన్నప్ప, విద్యావతి, త్యాగరాజ సంగీతసభ సభ్యులు షేక్‌ నబిరసూల్, వేమన అభ్యుదయ, అభివృద్ధి కేంద్రం సభ్యుడు అప్పిరెడ్డి హరినాథరెడ్డి, సాహితీ స్రవంతి, జిల్లా రచయితల సంఘం, తెలుగువెలుగు సాహిత్య సామాజిక సేవాసంస్థ అధ్యక్షుడు టీవీరెడ్డి, మహాబోధి సాహిత్యవేదిక సభ్యుడు దాసన్నగారి కృష్ణమూర్తి, మాదిగ హక్కుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు పసలూరి ఓబులేసు, సబ్‌కలెక్టరు నవీన్, పలువురు సాహితీవేత్తలు, సాహితీ సంస్థల నిర్వాహకులు సంతాపం తెలియజేశారు.  

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని