logo

ఒక్క రోజులో రూ.50 లక్షలు.. ఖర్చు పెట్టకపోతే వెనక్కే!

రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి మంగళవారం ఐసీడీఎస్‌ పీడీ ఖాతాకు రూ.50 లక్షలు బడ్జెట్‌ జమ అయింది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు రెండు రోజులే గడువు ఉంది. నిర్దేశిత అంశాల ఆధారంగా రూ.50 లక్షలు ఖర్చు పెట్టి.. తగిన బిల్లులు ఖజానా శాఖలో సమర్పించాలని ఆదేశాలు అందాయి

Updated : 30 Mar 2022 08:43 IST

ఐసీడీఎస్‌లో వింత వైఖరి

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి మంగళవారం ఐసీడీఎస్‌ పీడీ ఖాతాకు రూ.50 లక్షలు బడ్జెట్‌ జమ అయింది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు రెండు రోజులే గడువు ఉంది. నిర్దేశిత అంశాల ఆధారంగా రూ.50 లక్షలు ఖర్చు పెట్టి.. తగిన బిల్లులు ఖజానా శాఖలో సమర్పించాలని ఆదేశాలు అందాయి. బుధవారం (30న) సామగ్రి కొనాలి.. గురువారం (31న) ఖజానా శాఖలో బిల్లులు సమర్పించాలి. లేదంటే నిధులు ప్రభుత్వానికి వెనక్కి వెళ్తాయి. ఇదంతా ఒక్క రోజులోనే సాధ్యమయ్యే పనేనా అన్నది ఆ శాఖలో చర్చనీయాంశమైంది.

ముప్పై రోజుల్లో రూ.30 కోట్లు ఖర్చు పెట్టాలి. లేదంటే.. రూ.3 వేల కోట్ల ఆస్తులు దక్కవు.. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘అరుణాచలం’ సినిమా కథ ఇది. ఈ సినిమా తరహాలోనే ప్రస్తుతం ఐసీడీఎస్‌ శాఖ నిధులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్క రోజులోనే రూ.50 లక్షలు ఖర్చు పెట్టాలని, తగిన బిల్లులు 31లోపు ఖజానా కార్యాలయంలో సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

సామగ్రి కొనుగోలుపై హడావుడి

రూ.50లక్షలు బడ్జెట్‌ వచ్చిందని తెలిసిన వెంటనే.. ఆ శాఖ పీడీ కార్యాలయ సిబ్బంది తర్జనభర్జన పడుతున్నారు. ఏం కొనాలి.. ఎలా కొనాలన్న దానిపై ఆలోచిస్తున్నారు. ముద్రణకు సంబంధించిన కాగితాలు, కంప్యూటర్లు, స్కానర్లు, రబ్బరు స్టాంపులు.. ఇలా అనేక వాటిని రాసుకున్నారు. వీటికి సంబంధించి రాత్రికి రాత్రే కొనుగోలు చేసి.. బిల్లులు పెట్టాలన్న ఆలోచన సాగుతోంది. ఇదంతా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే జరగాలి. ఇన్నాళ్లూ కాగితాలు, పెన్ను, ర్యాపర్లు, ట్యాగు.. వంటి సాధారణ సామగ్రి కొనుగోలుకు నానాతంటాలు పడ్డారు. ప్రస్తుతం బడ్జెట్‌ వచ్చినా కొనుగోలు చేయలేని దుస్థితి. ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే కొనుగోలు చేసి బిల్లులు పెడతామని ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయ పర్యవేక్షకుడు ఉమామహేశ్వర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని