logo

ఊపేసింది.. ముంచేసింది

ఉమ్మడి జిల్లాలో రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షం పడింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు రహదారులు కోతకు గురయ్యాయి. పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమ

Published : 20 May 2022 03:23 IST

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు

పొంగిన వంకలు, వాగులు


మడకశిర పట్టణం ఆరేపేటలో ఇళ్లల్లోకి చేరిన వర్షపునీరు

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షం పడింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు రహదారులు కోతకు గురయ్యాయి. పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. పత్తి, టమోటా, వేరుసెనగ తదితర పంటలు నీట మునిగాయి. బుధవారం రాత్రి అత్యధికంగా మడకశిర మండలంలో 94.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ప్రేమచంద్ర తెలియజేశారు.

ట్రాక్‌పై మట్టి పెళ్లలు.. ఆగిన రైలు

కళ్యాణదుర్గం గ్రామీణం: భారీ వర్షానికి కళ్యాణదుర్గం రైల్వేస్టేషన్‌ సమీపంలోని కురాకులతోటకు వెళ్లే దారివద్ద మట్టిపెళ్లలు విరిగి ట్రాక్‌పై పడ్డాయి. రాయదుర్గం వైపు వెళుతున్న కదిరిదేవరపల్లి-తిరుపతి రైలు గురువారం మధ్యాహ్నం సుమారు 25 నిమిషాల పాటు ఆగిపోయింది. రైల్వే అధికారులు ఘటనా స్థలం చేరుకొని సిబ్బంది, స్థానికుల సాయంతో మట్టిని తొలగింపజేశారు. అనంతరం రైలు అక్కడి నుంచి బయలుదేరింది.

కోతకు గురైన రేకులకుంట రహదారి

కూలిన వంతెన

హిందూపురం పోచనపల్లి వద్ద కూలిన వంతెన వద్ద ఇలా.

హిందూపురం పట్టణం: పట్టణం నుంచి అనేక గ్రామాలు, కర్ణాటకలోని పలు ప్రాంతాలకు రాకపోకలకు పోచనపల్లి వద్ద పెన్నానదిపై ఉన్న వంతెన నీటి ప్రవాహానికి కూలిపోయింది. పోలీసులు ఇరు వైపులా ముళ్ల కంచె వేసి రాకపోకలను నిలిపివేశారు. పోచనపల్లి, ఊడుగలపల్లి, నక్కల పల్లి, బేవనహళ్లి, సంజీవరాయుని పల్లి, నారగన పల్లి, కసనం పల్లి, కడగత్తూరు తదితర గ్రామాలకు రాకపోకలు ఆగాయి.

రాక పోకలకు అంతరాయం

రహదారిపై ప్రవహిస్తున నీరు

విడపనకల్లు: ఎగువప్రాంతాల్లో కురిసిన వర్షానికి విడపనకల్లు మండలం డోనేకల్లు వద్ద 67వ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఇక్కడ వంతెన నిర్మాణం కొనసాగుతుండటంతో వాహనాలు పాత రహదారిపై నుంచి వెళుతున్నాయి. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో గురువారం వేకువజాము నుంచి 11 గంటల వరకు రాకపోకలకు అంతరాయం ఎదురైంది. గుత్తి డిపో బస్సు నిలిచిపోవడంతో తాడుకట్టి పొక్లెయిన్‌తో రోడ్డుపైకి తీసుకొచ్చారు.

మడకశిరకు ముప్పు

కణేకల్లు: నాగలాపురంలో నీట మునిగిన పత్తి పంట

మడకశిర: పట్టణ పరిధిలోని మాళేరొప్పం వెళ్లే రహదారిపై నిర్మించిన వంతెన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. రేకులకుంటకు వెళ్లే తారురోడ్డు కోతకు గురైంది. విద్యుత్తు స్తంభాలు విరిగిపోయాయి. ఆర్‌.అనంతపురం వద్ద పెనుకొండ వెళ్లే ప్రధాన దారిపై నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో మధుగిరి నుంచి ధర్మవరానికి కోళ్లను తీసుకెళ్తున్న బొలేరో బోల్తా పడింది. వైబీహళ్లికి రాకపోకలు ఆగిపోయాయి. టీడీపల్లి సమీపంలోని చెక్‌డ్యామ్‌ తెగి పంట దెబ్బతింది. మడకశిర పట్టణం ఆరేపేటలో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని