logo

చంద్రబాబుకు ఘన స్వాగతం

తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం అర్ధరాత్రి తర్వాత అనంతపురానికి చేరుకున్నారు. నంద్యాల జిల్లా జలదుర్గంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రోడ్డు మార్గంలో జిల్లాకు వచ్చారు. జిల్లా సరిహద్దులోని కరిడికొండ వద్దకు రాత్రి 1.50 గంటలకు చేరుకోగా.

Published : 20 May 2022 03:23 IST

గుత్తి వద్ద అర్ధరాత్రి 1.50 గంటల సమయంలో చంద్రబాబుకు

స్వాగతం పలుకుతున్న తెలుగు మహిళలు

ఈనాడు, డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, గుంతకల్లు గ్రామీణం, రాణినగర్‌: తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం అర్ధరాత్రి తర్వాత అనంతపురానికి చేరుకున్నారు. నంద్యాల జిల్లా జలదుర్గంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రోడ్డు మార్గంలో జిల్లాకు వచ్చారు. జిల్లా సరిహద్దులోని కరిడికొండ వద్దకు రాత్రి 1.50 గంటలకు చేరుకోగా.. పార్టీ నాయకులు కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, ఉమామహేశ్వరనాయుడు, చాంద్‌బాషా, బండారు శ్రావణి, ఎంఎస్‌ రాజు తదితరులు అధినేతకు స్వాగతం పలికారు. అక్కడ్నుంచి గుత్తి బైపాస్‌లో పార్టీ నేతలు, అభిమానులు పెద్దఎత్తున చేరుకుని చంద్రబాబును కలుసుకున్నారు. పామిడి వద్ద అభిమానులతో మాట్లాడి ముందుకు కదిలారు. కల్లూరు క్రాస్‌ వద్ద నాయకుడు కేశవరెడ్డి ఆధ్వర్యంలో మహిళలు హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతపురంలోని తపోవనం వద్ద కల్యాణ మండపానికి చేరుకుని అక్కడే బస చేశారు.

నేటి కార్యక్రమాలు ఇలా..

శుక్రవారం ఉదయం 10.30 గంటలకు అనంతపురం బైపాస్‌రోడ్డులోని తపోవనం వద్ద ఉన్న వీవీఆర్‌ కన్వెన్షన్‌ హాల్లో జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. 11.30కు ఉమ్మడి అనంతపురం జిల్లా తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. 2.30కు అనంతపురంలో బయలుదేరి రాప్తాడు, చెన్నేకొత్తపల్లి మీదుగా సాయంత్రం 4 గంటలకు సోమందేపల్లి చేరుకుంటున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడే బహిరంగ సభపై ప్రసంగిస్తారు.

జగన్‌కు భయం పట్టుకుంది

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మాజీ మంత్రులు

కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి తదితరులు

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తుంటే.. వారు బ్రహ్మరథం పడుతుండటాన్ని చూసి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి భయం పట్టుకుందని’ మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. రోజుకో కార్యక్రమం తెరపైకి తీసుకొచ్చి ఎమ్మెల్యేలను, మంత్రులను పంపుతున్నా ప్రజావ్యతిరేకత తప్పడం లేదని విమర్శించారు. శుక్రవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అనంతపురంలో చేపట్టిన ఏర్పాట్లను గురువారం ఆయనతో పాటు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధిని పక్కన పడేశారని విమర్శించారు. ధరలు విపరీతంగా పెరిగాయని, సంక్షేమ పథకాలు నిలిపేశారని, ఇంకా ఏమి జరుగుతుందోనన్న భయం ప్రజల్లో పట్టుకుందన్నారు. ఎవరి ఆస్తికి భరోసా లేదని, అన్ని ప్రాంతాల్లో అరాచకం నెలకొందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి, నాయకులు శ్రీధర్‌చౌదరి, బుగ్గయ్యచౌదరి, మురళీధర్‌, నాగరాజు, గౌస్‌మొహిద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని