logo

పంట పండినా ..రైతన్నకు కన్నీరే !

ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం కల్లాల్లోనే మగ్గిపోతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ప్రక్రియ మొదలుకాలేదు. రెండురోజుల కిందట కణేకల్లులో ఓ కేంద్రాన్ని ప్రారంభించినా కొనుగోళ్లు చేపట్టలేదు. ఆర్బీకేల ద్వారా ధాన్యం కొంటామని చె

Published : 22 May 2022 04:46 IST

వరి ధాన్యం అమ్ముకోలేక అవస్థలు

కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై నిర్లక్ష్యం

కల్లంలో ధాన్యం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, బొమ్మనహాళ్‌: ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం కల్లాల్లోనే మగ్గిపోతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ప్రక్రియ మొదలుకాలేదు. రెండురోజుల కిందట కణేకల్లులో ఓ కేంద్రాన్ని ప్రారంభించినా కొనుగోళ్లు చేపట్టలేదు. ఆర్బీకేల ద్వారా ధాన్యం కొంటామని చెబుతున్నా ఆచరణలోకి రాలేదు. మరోవైపు వర్షాలు ప్రారంభం కావడంతో ధాన్యం తడిసిపోతోంది. రైతు దీనస్థితి ఆసరాగా తీసుకుని వ్యాపారులు ధరను అమాంతం తగ్గించేశారు. పంటను అమ్ముకోలేక.. కల్లాల్లో ఉంచుకోలేక రైతన్న అవస్థలు పడుతున్నారు.

కొనేది ఒక శాతమే

జిల్లాలో హెచ్చెల్సీ కింద కణేకల్లు, బొమ్మనహాళ్‌, డి.హీరేహాళ్‌ మండలాల పరిధిలో ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు. గార్లదిన్నె, శింగనమల, పామిడి మండలాలతోపాటు ఉమ్మడి జిల్లాలోని పలు చెరువుల కింద వరి పండిస్తున్నారు. 80 వేల ఎకరాలపైనే సాగవుతోంది. ఎకరాకు సగటున 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొత్తం 2 లక్షల టన్నుల ధాన్యం పండుతోంది. ప్రభుత్వం రెండు జిల్లాలో కలిపి 2,500 టన్నులు మాత్రమే కొనడానికి అనుమతి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్క శాతం మాత్రమే కొంటున్నారు. అందులోనూ జాప్యం చేస్తున్నారు. ఖరీఫ్‌లోనూ అధిక దిగుబడి రాగా.. 5 వేల టన్నులే కొనుగోలు చేసి చేతులు దులుపుకొన్నారు.

 

క్వింటాకు రూ.500 నష్టం

వరి క్వింటాకు రూ.1,960 కనీస ధర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరతో మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు ప్రయోజనం. బొమ్మనహాళ్‌, కణేకల్లు, డి.హీరేహాళ్‌ మండలాల పరిధిలో మూడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కోతలు పూర్తై ధాన్యాన్ని కల్లాల్లో నిల్వ చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆలస్యం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దళారులు క్వింటాకు రూ.1500కు మించి ఇవ్వడం లేదు. కొన్ని ప్రాంతాల్లో రూ.1300, రూ.1400 చెల్లిస్తున్నారు. దీంతో అన్నదాతలు క్వింటాకు రూ.500 చొప్పున నష్టపోతున్నారు.

 

పెట్టుబడి భారమై..

పెరిగిన ఇంధన, ఎరువుల ధరలతో వరి సాగు భారంగా మారింది. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, కూలీల వేతనాలు, సేద్యం ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఎకరా సాగుకు రూ.35 వేల వరకు ఖర్చవుతోంది. ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. క్వింటా రూ.1500 ప్రకారం అమ్మితే రూ.37 వేలు వస్తుంది. ప్రభుత్వం కొనుగోలు చేస్తే రూ.49 వేల వరకు అందుతుంది. వ్యాపారులకు విక్రయిస్తే ఎకరాకు రూ.12 వేలు నష్టపోవాల్సిందే. కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. పెట్టుబడి పెరిగిన నేపథ్యంలో క్వింటా వరికి రూ.2,500 మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండు చేస్తున్నారు.

 

మద్దతు ధర పెంచాలి - వెంకటరెడ్డి, వరి రైతు

పెరుగుతున్న పెట్టుబడుల దృష్ట్యా ప్రభుత్వం అన్నదాతలకు మద్దతు ధర క్వింటాకు రూ.2200కు పెంచాలి. వరి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లోని ధరలతో రైతులకు పెట్టుబడి కూడా దక్కదు. ఏటా అప్పులే మిగులుతున్నాయి. 

గోనె సంచులు ఇవ్వలేదు - రాము, ఉప్పరహాళ్‌ క్రాస్‌

కనీసం గోనె సంచులు కూడా పంపిణీ చేయలేదు. అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బహిరంగ మార్కెట్లో ఖాళీ గోనె సంచి రూ.60 పలుకుతోంది. ధాన్యం ఇంటికి చేర్చడానికి బస్తాకు రూ.40, లారీకి లోడింగ్‌కు రూ.20 ఖర్చు అవుతోంది. మొత్తంగా కల్లం నుంచి లారీలో లోడింగ్‌ వరకు బస్తాకు రూ.120 చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం హమాలీ ఖర్చులు భరించాలి.

సాంకేతిక సమస్యతో ఆలస్యం : వెంకటరాముడు, జిల్లా మేనేజరు, సివిల్‌ సప్లై

జిల్లాలో 2,500 టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కణేకల్లు, బొమ్మనహాళ్‌, డి.హీరేహాళ్‌ మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సాంకేతిక సమస్యతో ఆలస్యమవుతోంది. రెండు రోజుల్లో కొనుగోళ్లు మొదలుపెడతా. ప్రభుత్వం క్వింటాకు రూ.1960 నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని