logo

అదిరే కొలువు.. ఆకట్టుకునే వేతనం

అనంతపురం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ విద్యార్థినులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటుతున్నారు. మంచి వేతనంతో కొలువులకు ఎంపికవుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఐటీ పరిశ్రమలు ఇక్కడ నిరంతరం ప్రాంగణ నియామకాలు చేపడుతున్నాయి.

Published : 24 May 2022 06:00 IST

ప్రాంగణ నియామకాల్లో జేఎన్‌టీయూ విద్యార్థినుల ప్రతిభ

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: అనంతపురం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ విద్యార్థినులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటుతున్నారు. మంచి వేతనంతో కొలువులకు ఎంపికవుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఐటీ పరిశ్రమలు ఇక్కడ నిరంతరం ప్రాంగణ నియామకాలు చేపడుతున్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌కు చెందిన వివిధ కంపెనీలు విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నాయి. 2022 సంవత్సరంలో 332 మంది ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. విద్యార్థుల్లో నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, ఐటీలో సమస్యలు పరిష్కరించే ప్రతిభ ఉన్న కారణంగా ఉద్యోగాలకు సునాయాసంగా ఎంపికవుతున్నారు. కొత్త అంశాలపై ప్రయోగాలు చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు అవసరమైన మానవ వనరులు జేఎన్‌టీయూలో లభిస్తున్నాయి. దీంతో అత్యధిక వార్షిక వేతనాలు చెల్లించడానికి సంస్థలు ముందుకొస్తున్నాయి. నీరజ అనే కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థిని రూ.23లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి ఎంపికైంది. గత 5 సంవత్సరాల్లో అత్యధిక వేతనంతో జేఎన్‌టీయూ నుంచి ఈ విద్యార్థి ఎంపిక కావడం విశేషం. రూ.16లక్షలు, రూ.11 లక్షలు, రూ.10లక్షల వార్షిక వేతనంతో మరికొందరు విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి అత్యధిక వార్షిక వేతనంతో ఉద్యోగాలు సాధించిన విద్యార్థినుల మనోభావాలిలా..

నైపుణ్యం సాధించా

అనంతపురం జేఎన్‌టీయూలో కంప్యూటర్‌సైన్స్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్నా. మా సొంతూరు హార్స్‌లీహిల్స్‌. ఇటీవల ఆన్‌లైన్‌లో మౌఖిక పరీక్షల్లో పాల్గొన్నా. వాల్‌మార్ట్‌ సంస్థలో రూ.23లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యా. వేతనంతో పాటు పని కూడా ఎక్కువగా ఉంటుంది. సంస్థకు అవసరమైన అంశాలపై నైపుణ్యం సాధించాను. దీంతో ఉద్యోగం లభించింది. అత్యధిక వార్షిక వేతనం లభించడం ఆనందంగా ఉంది. ఏ సంస్థకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో విద్యార్థులు తెలుసుకొని, మౌఖిక పరీక్షలో పాల్గొంటే ఉద్యోగం సాధించడం సులువే . - నీరజ, కంప్యూటర్‌సైన్స్‌ విభాగం, జేఎన్‌టీయూ

కోడింగ్‌ ముఖ్యం

మాది నెల్లూరు నగరం. జేఎన్‌టీయూలో కంప్యూటర్‌ సైన్‌ ఇంజినీరింగ్‌ చేస్తున్నా. విసెంట్‌టీన్‌ సంస్థలో రూ.11 లక్షల వార్షిక వేతనంలో ఉద్యోగానికి ఎంపికయ్యా. కంప్యూటర్‌లో ప్రాబ్లమ్స్‌ సాల్వ్‌ చేయడం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. వెబ్‌సైట్‌లో కోడింగ్‌ చేయడం చక్కగా నేర్చుకున్నా. కంప్యూటర్‌ సైన్స్‌లో కోడింగ్‌ ముఖ్యం. ఇంటర్వ్యూలో కోడింగ్‌ చక్కగా చేయడం వల్ల ఉద్యోగం దక్కింది. - ఫర్హీన్‌, జేఎన్‌టీయూ

అకోలైట్‌ డిజిటల్‌లో ఉద్యోగం

మా సొంతూరు నంద్యాల. జేఎన్‌టీయూలో బీటెక్‌ చేస్తున్నా. అకోలైట్‌ డిజిటల్‌ సంస్థలో ఇటీవల ఉద్యోగానికి ఎంపికయ్యాను. రూ.10లక్షలు వార్షిక వేతనం ప్రకటించారు. ఉద్యోగానికి 3 రకాల పరీక్షలు నిర్వహించారు. కోడింగ్‌ చేయడం ప్రధానం. కోడింగ్‌పై అవగాహనతో పరీక్షకు సన్నద్ధమయ్యా. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు భవిష్యత్తులో కోడింగ్‌ సులువుగా చేయడానికి కృషి చేస్తా. - జయప్రద

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని