logo

కోమాలో ట్రామా కేంద్రాలు

రోడ్డు ప్రమాదాల మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను తొలి గంటలోనే సరైన వైద్య చికిత్స అందితే ప్రాణాలు కాపాడటానికి వీలవుతుంది. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2005లోనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం

Updated : 24 May 2022 10:59 IST

అనంతపురం (వైద్యం), పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే : రోడ్డు ప్రమాదాల మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను తొలి గంటలోనే సరైన వైద్య చికిత్స అందితే ప్రాణాలు కాపాడటానికి వీలవుతుంది. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2005లోనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అప్పట్లో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ ట్రామా కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. పెనుకొండ, అనంతపురం, గుత్తి ఆసుపత్రులకు అనుబంధంగా ట్రామా కేర్‌ సెంటర్లను మంజూరు చేసింది. ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను తీసుకొచ్చే సమయంలో ఆలస్యమైతే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఇలా జరగకుండా అంబులెన్సులోనే శస్త్రచికిత్స చేయడానికి వీలుగా ఆపరేషన్‌ థియేటర్‌ ఉండేలా అంబులెన్సులు అందజేసింది. కాగా.. జిల్లాలో నిర్మించిన భవనాలు వృథాగా మారగా, కేటాయించిన అంబులెన్స్‌ల ఆచూకీ లేదు.

అనంతపురం, పెనుకొండలో భవనాలు..

* 2007లో అనంత, పెనుకొండ ఆస్పత్రుల్లో రూ.65 లక్షలు చొప్పున వెచ్చించి ప్రత్యేక భవనాలు నిర్మించారు. రూ.18 లక్షలు విలువైన అంబులెన్స్‌లను సరఫరా చేశారు.

* భవనాలు నిర్మించినప్పటి నుంచి ఈ కేంద్రాలు వృథాగా ఉన్నాయి. రూ.లక్షలు ఖరీదైన వైద్య పరికరాలు తుప్పు పట్టే పరిస్థితికి వచ్చాయి.

* అవసరమైన ఆర్థో, జనరల్‌ సర్జరీ, రేడియాలజీ విభాగాలకు సంబంధించిన వైద్యులు, స్టాఫ్‌నర్సులు, పారామెడికల్‌, సాంకేతిక సిబ్బంది నియమించలేదు.

* ఒక్కో కేంద్రానికి సుమారు 83 పోస్టులు అవసరం. వీటి నియామకానికి కేంద్రం ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంది.

* పెనుకొండలో అత్యాధునిక సౌకర్యాలతో భవన నిర్మాణం పూర్తి చేసి 2011లో వైద్యశాలకు అప్పగించారు.

* పెనుకొండ, చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే రోడ్డు ప్రమాద బాధితులను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలలో కేవలం ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం, కర్నూల్‌, బెంగళూరు తరలిస్తుంటారు.

* తక్షణం మెరుగైన వైద్యం అందక చాలా మంది మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోతున్నారు.

* వైద్య సిబ్బందిని నియమించకుండా ఉపయోగంలోలేని ట్రామాకేర్‌ భవనంపై మరో భవనం నిర్మించటం విచారకరం. ప్రస్తుతం ఉన్న భవనాన్ని మందులు నిల్వ చేయటానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు.

అనంతపురంలోని ట్రామా కేర్‌ యూనిట్‌

ఏటా 600 మందికి పైగా మృతులు..

ఉమ్మడి జిల్లాలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 600 నుంచి 700 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సుమారు 1,500 మందికి పైగా క్షతగాత్రులవుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఓవైపు కసరత్తు జరుగుతున్నా ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కుటుంబ యజమానులు మృతి చెందటంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఆర్థికంగా చితికిపోతున్నారు. కాళ్లు, చేతులు పోగొట్టుకున్నవారు దుర్భర జీవనం సాగిస్తున్నారు.

నియామకాలు జరగలేదు

- డాక్టర్‌ రామస్వామి, ఇన్‌ఛార్జి పర్యవేక్షకులు, సర్వజన ఆసుపత్రి

ట్రామా కేర్‌ సెంటర్లలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యులను, వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. భవన నిర్మాణంతోనే సేవలు ఆగిపోయాయి. తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని