logo

ఉపాధి పనులకు రాజకీయ గ్రహణం

అక్కడ ప్రభుత్వ నిబంధనలు వర్తించవు. అధికారుల ఆదేశాల అమలుకు చోటుండదు. నియోజకవర్గంలోని ముఖ్యనేత, ఆయన అనుచరులు చెప్పిందే నిబంధన. వారు చేసిందే శాసనం. గ్రామాల్లో సదరునేత సామాజికవర్గానికి చెందిన స్థానిక నేతల కనుసన్నల్లోనే

Published : 24 May 2022 06:00 IST

చెన్నేకొత్తపల్లిలో క్షేత్రసహాయకుల నియామకంలో ఇష్టారాజ్యం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, చెన్నేకొత్తపల్లి: అక్కడ ప్రభుత్వ నిబంధనలు వర్తించవు. అధికారుల ఆదేశాల అమలుకు చోటుండదు. నియోజకవర్గంలోని ముఖ్యనేత, ఆయన అనుచరులు చెప్పిందే నిబంధన. వారు చేసిందే శాసనం. గ్రామాల్లో సదరునేత సామాజికవర్గానికి చెందిన స్థానిక నేతల కనుసన్నల్లోనే అన్ని పనులు జరుగుతున్నాయి. జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలంలోని ఓ పంచాయతీలో ఉపాధి పనుల్లో సామాజిక వివక్ష కారణంగా కూలీలు నష్టపోతున్నారు. తమ కులానికి చెందిన వ్యక్తే క్షేత్రసహాయకుడిగా ఉండాలనే కుట్రతో ప్రస్తుతం క్షేత్రసహాయకుడికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. దీంతో ఉపాధి పనులు ముందుకు సాగడం లేదు. ఓవైపు ఉన్నతాధికారుల ఒత్తిడి, స్థానికంగా రాజకీయ వేధింపులతో సదరు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తన ఉద్యోగాన్ని వదిలేశారు. ఇంతా జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

15 పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి

రాజకీయ పదవులు పంచుకున్నట్లు చెన్నేకొత్తపల్లి మండలంలోని అన్ని పంచాయతీల్లో ఏడాదికి ఒకసారి క్షేత్రసహాయకుల ఉద్యోగాలను పంచుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు చేసినవారికే ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. గ్రామంలోని అధికార పార్టీ నాయకులు, సానుభూతిపరులకు ఏడాదికి ఒకరుచొప్పున ఉద్యోగాన్ని పంచుకుంటున్నారు.

పనుల్లోనూ కులవివక్ష

గత డిసెంబర్‌లో అధికారపార్టీ నేతల ఆదేశాల మేరకు చెన్నేకొత్తపల్లి మండలంలోని అన్ని పంచాయతీల క్షేత్రసహాయకులను తొలగించి కొత్తవారిని నియమించారు. ఓ పంచాయతీ క్షేత్రసహాయకుడిగా దళిత యువకుడిని నియమించారు. చేరిన వారానికే స్థానిక నాయకులు ఒక్కటై దళితుడిని దింపేందుకు పన్నాగం పన్నారు. గత నెలలో ఆ యువకుడు రెండు వారాలపాటు కూలీలకు పనులు కల్పించాడు. దీంతో కూలీలు పనులకు వెళ్లకూడదంటూ హుకుం జారీ చేశారు సదరు నేతలు. దళితవ్యక్తి పనులు చూపిస్తే మీరు చేస్తారా అంటూ తన సామాజికవర్గంతోపాటు, పలువురు కూలీల వద్ద విష ప్రచారం చేశారు. దీంతో కూలీలు పనులకు వెళ్లడానికి సంశయిస్తున్నారు. ఉపాధి కోల్పోతున్నామని వాపోతున్నారు.

నష్టపోతున్న కూలీలు

కూలీలకు ఎందుకు పనులు కల్పించడంలేదని పైఅధికారుల ఒత్తిళ్లు ఓ వైపు, నీకు అవకాశం ఇచ్చాము.. చేతకాకపోతే దిగిపో అని అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు మరోవైపు. మానసికంగా కుంగిపోయిన ఆ యువకుడు రెండువారాల కిందట ఉద్యోగం నుంచి తప్పుకున్నాడు. రాజకీయ ఒత్తిళ్లతో పనులకు ఉపాధి పనులకు వెళ్లలేక, స్థానికంగా పనులు లభించక కూలీల ఇబ్బందులు వర్ణనాతీతం. ఒక్క చెన్నేకొత్తపల్లి మండలంలోనే గతేడాది రోజుకు 10 వేల పనిదినాలు సగటున నమోదు కాగా.. ప్రస్తుతం 3 వేలు దాటడం లేదంటే కూలీలు ఎంతగా నష్టపోతున్నారో అర్థమవుతోంది.

నా దృష్టికి రాలేదు - విజయప్రసాద్‌, డ్వామా పీడీ

నిబంధనల మేరకు అవినీతి, నిర్లక్ష్యం తేలితేనే క్షేత్రసహాయకులను తొలగించాల్సి ఉంటుంది. చెన్నేకొత్తపల్లి మండలంలో ఏడాదికి ఒకసారి ఎఫ్‌ఏలను మారుస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై ఎంపీడీవో, ఏపీడీతో నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తాను. నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా జరిగితే సరిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటాం.

నియోజకవర్గమంతా ఇంతే

ఎక్కడా లేని విధంగా రాప్తాడు నియోజకవర్గంలో నిబంధనలకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. పార్టీ సానుభూతిపరులకు ఏడాది ఒకరికి చొప్పున ఉద్యోగాలు ఇస్తున్నారు. గడువు పూర్తయిన తర్వాత బలవంతపు రాజీనామాలు చేయించి కొత్తవారిని నియమిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని