logo

గ్రంథాలయాలు ఇలా.. పరీక్షల్లో నెగ్గేదెలా !

 రాష్ట్రంలో గ్రూప్‌-3, గ్రూపు-4 ఉద్యోగ నియామక ప్రకటనలు ఇచ్చారు. మొత్తం 1,550 పోస్టులను భర్తీ చేయనున్నారు. త్వరలో మరిన్ని ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. వీటికి పోటీ పడాలన్న ఉత్సాహంతో గ్రంథాలయాలకు వెళుతున్న నిరుద్యోగులకు నిరాశే మిగులుతోంది. అక్కడ అవసరమైన పుస్తకాలు లేక దిక్కుతోచని

Updated : 25 May 2022 04:54 IST

అన్నీ పాత పుస్తకాలే

యువతకు అవస్థలు


అనంత గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధం

న్యూస్‌టుడే, అనంత సంక్షేమం : రాష్ట్రంలో గ్రూప్‌-3, గ్రూపు-4 ఉద్యోగ నియామక ప్రకటనలు ఇచ్చారు. మొత్తం 1,550 పోస్టులను భర్తీ చేయనున్నారు. త్వరలో మరిన్ని ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. వీటికి పోటీ పడాలన్న ఉత్సాహంతో గ్రంథాలయాలకు వెళుతున్న నిరుద్యోగులకు నిరాశే మిగులుతోంది. అక్కడ అవసరమైన పుస్తకాలు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కోచింగ్‌ సెంటర్లకు వెళ్లే స్తోమత లేని ఎంతో మంది పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

ప్రయోజనమెంత

పోటీ పరీక్షలకు సంబంధించి 2016-18 మధ్య కొనుగోలు చేసిన పుస్తకాలే ఉన్నాయి. ఆ తర్వాత కొత్తవి అందుబాటులోకి రాలేదు. పాత వాటితో పోటీ పరీక్షల్లో నెగ్గేదెలాగని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా కొందరు ముఖ్యమైన రచయితల పుస్తకాలను ఎంపిక చేసుకుని పరీక్షలకు సన్నద్ధం అవుతారు. లోతుగా, విశ్లేషణాత్మకంగా ఉన్న పుస్తకాలను చదివితేనే ఉపయుక్తం ఉంటుంది. చరిత్రకు సంబంధించి బీఎస్‌ఎన్‌ హనుమంతరావు, సయ్యద్‌ హిస్టరీ, బీపీఎన్‌ చంద్ర మధ్యయుగ, ఆధునిక, ప్రాచీనాంధ్ర చరిత్ర పుస్తకాలు, కృష్ణారెడ్డి, లక్ష్మీకాంత్‌, బీఎస్‌ శర్మ రచించిన పాలిటీ, ఎకానమీ, అకాడమీ పుస్తకాలనే ఎక్కువగా నిరుద్యోగులు కోరుకుంటున్నారు. అలాంటివి గ్రంథాలయాల్లో అందుబాటులో లేవు.

సెస్‌ అందక ప్రతిబంధకం

అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో సెస్‌ సక్రమంగా చెల్లించకపోవడంతో కొత్త పుస్తకాల కొనుగోలుకు ప్రతిబంధకం అవుతోంది. ఇంటి పన్ను వసూళ్లలో 8 శాతం గ్రంథాలయ సెస్సు వసూలవుతున్నా ఆయా నగర, పట్టణ, గ్రామ పంచాయతీలు గ్రంథాలయాలకు చెల్లించడం లేదు.

నెల రోజుల తర్వాతే..

హిందూపురం పట్టణం: పట్టణంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో లేవు. ఎవరైనా పుస్తకాలు కావాలని రాతపూర్వకంగా తెలియజేస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తారు. నివేదించిన నెలరోజుల తర్వాత పంపిస్తారని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఆలోపు విలువైన కాలం పోయినట్లే. మరోవైపు గ్రంథాలయానికి సొంత భవనం లేదు. రోటరీ క్లబ్‌ కేటాయించిన చిన్న భవనంలో నిర్వహిస్తున్నారు.

ఇరుకు గదిలో అవస్థలు

కదిరి గ్రంథాలయంలో 16,118 పుస్తకాలు ఉన్నాయి. గతంలో సరఫరా చేసిన 670 పుస్తకాలు మాత్రమే పోటీ పరీక్షలకు అవసరమైనవి. కొత్త పుస్తకాలు సరఫరా లేక పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. దీనికితోడు అద్దె భవనం కావడంతో పుస్తక పఠనానికి అసౌకర్యంగా ఉంది. ఏడెనిమిది కుర్చీలకు సరిపోయే గది మాత్రమే ఉంది. ఈ విషయంపై గ్రంథాలయ అధికారి నాగేంద్రను అడగ్గా పోటీ పరీక్షలకు కొత్త పుస్తకాలు రావాల్సి ఉంది. భవన నిర్మాణానికి స్థలం దొరకలేదని తెలిపారు. - కదిరి - రవినాయక్‌, గుంతకల్లు

కొన్నవి.. వృథానే

జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో మూడు నెలల కిందట రూ.34 లక్షలతో పలు రకాల పుస్తకాలను కొనుగోలు చేశారు. ఇప్పటిదాకా వాటి విభజన, ఏయే గ్రంథాలయాలకు పంపాలో లెక్కలు తేల్చలేదు. శాఖా గ్రంథాలయాలకు ఒక్కటీ సరఫరా చేయలేదు. వాటిని గ్రంథాలయాలకు చేరిస్తేనే ప్రయోజనం ఉంటుంది.

అన్నింటా అదే పరిస్థితి

ఉమ్మడి జిల్లాలో 70 గ్రంథాలయాలు, 64 పుస్తక నిక్షిప్త కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి నగరంతోపాటు పరిసర గ్రామాల్లోని యువత రోజుకు సరాసరి 500 నుంచి 700 మంది వస్తున్నారు. పెద్దసంఖ్యలో పాఠకులు వస్తున్నా.. సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, పాలకులు విఫలమవుతున్నారు.

చరిత్ర గ్రంథాలు ఏవీ? - రాజశేఖర్‌రెడ్డి, నిరుద్యోగి, ధర్మవరం

గ్రూపు-2 పరీక్షలకు ఇండియన్‌ ఎకానమీ పుస్తకం మాత్రమే ఉంది. మిగతా తెలుగు అకాడమీ పుస్తకాలు లేవు. భారతదేశ చరిత్ర, ఏపీ చరిత్ర తదితర పుస్తకాలు గుంతకల్లు గ్రంథాలయానికి రావడం లేదు. పాత ప్రశ్నపత్రాలు ఉంటే సాధన చేయడానికి సులువుగా ఉంటుంది. గ్రూపు-2 నోటిఫికేషన్‌ 2018 తర్వాత రాలేదు. ప్రకటన వస్తుందన్న ఆశతో సిద్ధమవుతున్నా. - గుంతకల్లు పట్టణం

నీట్‌ పుస్తకాల్లేవు

ఇంటర్‌ పూర్తయింది. ఎంసెట్‌ ద్వారా అగ్రికల్చర్‌, వెటర్నరీ చేయడానికి సిద్ధమవుతున్నా. అవసరమైన పుస్తకాలు గ్రంథాలయంలో లేవు. నీట్‌కు సంబంధించి కొత్త పుస్తకాలు కొనుగోలు చేయాలి. - కొండ, విద్యార్థి, అనంతపురం

అడిగినవి తెప్పిస్తున్నాం - రమ, జిల్లా గ్రంథాలయసంస్థ కార్యదర్శి

పాఠకుల డిమాండ్‌ను బట్టి అవసరం మేరకు కొనుగోలు చేస్తున్నాం. 2013 నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయలేదు. ఇటీవల కొనుగోలు చేశాం. వాటిని 15 రోజుల్లోపు శాఖా గ్రంథాలయాలకు పంపుతాం.

ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయాలు: 70

పుస్తక నిక్షిప్త కేంద్రాలు: 64

సభ్యులు: 71,648

పాఠకుల సంఖ్య: 8,23,524

అందుబాటులోని పుస్తకాలు: 7,43,639

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని