logo

నూలుమిల్లు స్థలం పై తెగని వివాదం

సహకార నూలుమిల్లుకు చెందిన స్థలం అమ్మకం విషయంలో హౌసింగ్‌బోర్డు అధికారులు, మిల్లు అధికారుల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీన్ని ఏవిధంగా పరిష్కరించాలోనని జిల్లా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గుంతకల్లు పట్టణంలో మిల్లుకు సంబంధించి మొత్తం 56 ఎకరాల స్థలాలు ఉన్నాయి. దీనిలో 16

Published : 25 May 2022 04:49 IST


మూతపడ్డ ఆంధ్రా సహకార స్పిన్నింగ్‌ మిల్లు

 

న్యూస్‌టుడే: గుంతకల్లు : సహకార నూలుమిల్లుకు చెందిన స్థలం అమ్మకం విషయంలో హౌసింగ్‌బోర్డు అధికారులు, మిల్లు అధికారుల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీన్ని ఏవిధంగా పరిష్కరించాలోనని జిల్లా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గుంతకల్లు పట్టణంలో మిల్లుకు సంబంధించి మొత్తం 56 ఎకరాల స్థలాలు ఉన్నాయి. దీనిలో 16 ఎకరాలను ఎకరా రూ.80 లక్షల వంతున ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ బోర్డుకు అమ్మడానికి ప్రభుత్వం 2012 సంవత్సరంలో నిర్ణయించింది. 16 ఎకరాలను మిల్లుకు చెందిన స్థలాల్లో సర్వేనెంబర్లు 620, 621, 624లో ఇచ్చేవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకారం 16 ఎకరాల కోసం మిల్లుకు రూ.12.80 కోట్లను హౌసింగ్‌ బోర్డు అధికారులు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు హౌసింగ్‌బోర్డు అధికారులు రూ.5.60 కోట్లను అందజేయగా.. ఈ మొత్తాన్ని మిల్లులో పనిచేసే కార్మికులకు బకాయిల కింద చెల్లించారు. ఇంకా హౌసింగ్‌బోర్డు అధికారులు మిల్లుకు రూ.7.20 కోట్లను చెల్లించాల్సి ఉంది. మిల్లు అధికారులు ఇప్పటివరకు బోర్డు వారికి ఐదు ఎకరాలను స్వాధీనం చేశారు. మొత్తం 16 ఎకరాలను బోర్డుకు స్వాధీనం చేయాలంటే మిల్లుకు పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది.

భారీగా పెరిగిన స్థలాల ధర

హౌసింగ్‌ బోర్డు అధికారులకు ప్రభుత్వం మిల్లుకు చెందిన స్థలాన్ని గతంలో చాలా తక్కువ ధరకు ఇచ్చింది. అప్పుడు ఎకరా రూ.80 లక్షలు కాగా.. ఇప్పుడు దీని ధర రూ.10 కోట్లుగా అంచనా. బోర్డుతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ప్రభుత్వానికి రూ.150 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం హౌసింగ్‌ బోర్డు సకాలంలో డబ్బును చెల్లించలేదు కాబట్టి వారికి స్థలాన్ని కేటాయించే ఉత్తర్వులను రద్దుచేసేలా చూడాలని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మిల్లు అధికారులను కోరారు. స్థలాన్ని పట్టణంలోని వారికి ఇళ్లను నిర్మించుకోవడానికి తక్కువ ధరకు కేటాయించడం సమంజసంగా ఉంటుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి ముఖ్యమంత్రి అంగీకరించారని ఎమ్మెల్యే ప్రకటించారు.

 

నష్టపోయిన గుంతకల్లు వాసులు

మిల్లుకు చెందిన స్థలాన్ని ఇళ్ల నిర్మాణానికి కేటాయిస్తామని, ఆసక్తి ఉన్నవారు హౌసింగ్‌ బోర్డుకు రూ.10 వేలు చొప్పున డిపాజిట్‌గా చెల్లించాలని తెలపడంతో దాదాపు 250 మంది డబ్బుతో పాటు కొందరు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు 2012 సంవత్సరంలో చెల్లించారు. మిల్లుకు చెందిన స్థల వివాదం పరిష్కారం కాకపోవడంతో డబ్బు కట్టిన వారికి స్థలాల కేటాయింపు జరగలేదు. బోర్డు అధికారులు రూ.10 వేలను మినహాయించుకుని మిగిలిన మొత్తాలను వారికి వాపసు ఇస్తున్నారు. ఈ విషయంలో తాము బోర్డు వారిని నమ్ముకుని డబ్బును కోల్పోతున్నామని పలువురు వాపోతున్నారు.

 

సమస్య ఏమిటంటే..

స్థలాలను మూలన కాకుండా రోడ్డు పక్కన, మిల్లు లోపల ఉన్నవి ఇవ్వాలని హౌసింగ్‌బోర్డు అధికారులు పట్టుబడుతున్నారు. అలా ఇవ్వడానికి వీలుకాదని, తాము ఇచ్చే భూమిని మాత్రమే తీసుకోవాలని మిల్లు అధికారులు వాదిస్తున్నారు. దీంతో మిల్లుకు చెందిన స్థలాలను బోర్డుకు అప్పగించే అంశంతో పాటు బోర్డు నుంచి మిల్లుకు బకాయిల చెల్లింపు ఆగిపోయింది. స్థలాల కేటాయింపు విషయంలో వివాదం గత ఎనిమిది సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయింది. సమస్యను పరిష్కరించడానికి అధికారులు చొరవ చూపలేదు.

వారి తీరు సరికాదు

హౌసింగ్‌బోర్డు అధికారులు ఒప్పందం చేసుకున్న విధంగా స్థలాలను తీసుకోకుండా తమకు రోడ్డు పక్కన, మిల్లు లోపల కావాలని పట్టుబట్టడం సమంజసంగా లేదు. వారు సకాలంలో డబ్బును చెల్లించకుండా చాలా జాప్యం చేశారు. స్థలాల విషయాన్ని, డబ్బు చెల్లించే అంశాన్ని గాలికి వదిలేశారు.మిల్లు స్థలాల విలువ గణనీయంగా పెరిగినందున ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. - మిల్లు అధికారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని