logo

కలెక్టర్‌ ఉత్తర్వు బేఖాతరు!

అనేక రకాల అభియోగాలు ఎదుర్కొంటున్న శిశుగృహ సోషల్‌ వర్కర్‌ బదిలీ స్థానంలో చేరలేదు. కలెక్టర్‌ నాగలక్ష్మి ఉత్తర్వునే బేఖాతరు చేయడం చర్చనీయాంశమైంది. సదరు ఉద్యోగి వారం రోజులు గడిచినా రిలీవ్‌ కాలేదు. హిందూపురానికి చెందిన ఓ మహిళ దత్తత విషయంలో సదరు ఉద్యోగిపై లిఖిత పూర్వక ఫిర్యాదు చే

Updated : 25 May 2022 04:56 IST

బదిలీ స్థానంలో చేరని శిశుగృహ ఉద్యోగి

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: అనేక రకాల అభియోగాలు ఎదుర్కొంటున్న శిశుగృహ సోషల్‌ వర్కర్‌ బదిలీ స్థానంలో చేరలేదు. కలెక్టర్‌ నాగలక్ష్మి ఉత్తర్వునే బేఖాతరు చేయడం చర్చనీయాంశమైంది. సదరు ఉద్యోగి వారం రోజులు గడిచినా రిలీవ్‌ కాలేదు. హిందూపురానికి చెందిన ఓ మహిళ దత్తత విషయంలో సదరు ఉద్యోగిపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడంతో ముడుపుల తతంగం తెరపైకి వచ్చింది. ఇదే క్రమంలో ‘ఈనాడు’ వరుస కథనాలు ప్రచురించింది. ఈనెల 11న ‘దత్తతలో మాయాజాలం!’ అన్న కథనానికి స్పందించిన కలెక్టర్‌ విచారణ చేయించారు. సీనియర్‌ సీడీపీఓ వనజా అక్కమ్మ సమగ్ర విచారణ చేసి నివేదిక పంపారు. సదరు ఉద్యోగిని సత్వరమే రిలీవ్‌ చేసి.. బదిలీ స్థానంలోకి పంపాలంటూ 17న కలెక్టర్‌ ఉత్తర్వు జారీ చేశారు. అదే రోజే బదిలీ ఉత్తర్వును సదరు ఉద్యోగి వాట్సప్‌ నెంబరుకు పంపారు. సోషల్‌ వర్కర్‌ రెండు రోజులు శిశుగృహకు వచ్చి వెళ్లారు. రిలీవ్‌ కాలేదు. ఎలాంటి సెలవు మంజూరు చేయలేదని అధికారులు చెబుతున్నారు. మరో వైపు.. శిశుగృహ సిబ్బంది ఫిర్యాదు మేరకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. హిందూపురం మహిళ ఫిర్యాదు, విచారణ చేసిన వ్యవహారం.. వంటి అంశాలేవీ బదిలీ ఉత్తర్వులో పేర్కొనలేదు. దీనిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ విషయమై ఐసీడీఎస్‌ పీడీ సుశీలాదేవిని వివరణ కోరగా.. ఆమె నివాసం ఎక్కడుందో తెలియదు. వాట్సప్‌ ద్వారా ఉత్తర్వు పంపాం. ఆమె రిలీవ్‌ కాలేదు, బదిలీ స్థానంలో చేరలేదు. తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని