logo

ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం కావాలి

ఈ ఏడాది జిల్లాలో ముందస్తుగా వర్షాలు కురవడంతోపాటు నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో ఖరీఫ్‌లో రైతులు సాగు చేసే వర్షాధార పంటల వివరాలు, వాటి యాజమాన్య పద్ధతులపై రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సహదేవరెడ్డి వివరించారు. పంటల ది

Updated : 25 May 2022 04:57 IST

‘న్యూస్‌టుడే’తో వ్యవసాయ శాస్త్రవేత్త సహదేవరెడ్డి


సహదేవరెడ్డి, శాస్త్రవేత్త

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: ఈ ఏడాది జిల్లాలో ముందస్తుగా వర్షాలు కురవడంతోపాటు నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో ఖరీఫ్‌లో రైతులు సాగు చేసే వర్షాధార పంటల వివరాలు, వాటి యాజమాన్య పద్ధతులపై రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సహదేవరెడ్డి వివరించారు. పంటల దిగుబడి పెరగాలంటే విత్తనాల ఎంపిక, భూసార పరీక్షలు అత్యంత కీలకమని ఆయన తెలిపారు. ఖరీఫ్‌లో పంటల సాగు యాజమాన్య పద్ధతులు, ప్రణాళికను శాస్త్రవేత్త వివరించారు.

సాగు విస్తీర్ణం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా వేరుసెనగ 55 లక్షల హెక్టార్లు, పప్పుశనగ 23 లక్షలు, కంది 12 లక్షలు, సజ్జ 6 వేల హెక్టార్లు, చిరుధాన్యాలు 8 వేల హెక్టార్లు, పత్తి 29 లక్షల హెక్టార్ల చొప్పున వర్షాధార పంటలు సాగవుతాయని శాస్త్రవేత్త సహదేవరెడ్డి తెలిపారు. భూమిలో తేమ శాతం బట్టి రైతులు జూన్‌ 15 నుంచి జులై 30 వరకూ వర్షాధార పంటలు సాగు చేయడానికి అనుకూలమైన సమయమని ఆయన చెప్పారు.

లోతు దుక్కులు అవసరం

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిసినందున భూమిలో తగినంత తేమ ఉంది. రైతులు భూముల్లో వాలుకు అడ్డంగా ట్రాక్టరు నాగళ్లతో 20 సెం.మీ లోతు దుక్కులు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల భూమిలో గడ్డిజాతి మొక్కల వేర్లు, కీటకాలు, పురుగులు పైకి వచ్చి ఎండకు నశిస్తాయి. తద్వారా కలుపు సమస్యలు, తెగుళ్ల బెడదను సమర్థవంతంగా అరికట్టవచ్ఛు పొలంలో ఫారంపాండ్లు తవ్వుకుని పొలం చుట్టూ కందకాలు ఏర్పాటు చేస్తే వర్షంనీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి. ఐదేళ్లకు ఒకసారి చెరువు మట్టిని పొలంలో చల్లుకుంటే పోషకాలు సమృద్ధిగా పైరుకు అందుతాయి. ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువులు వేసుకుంటే మంచిదని శాస్త్రవేత్త తెలిపారు.

 

విత్తన ఎంపిక, భూసార పరీక్షలు, విత్తనశుద్ధి అత్యంత కీలకం

పంటల సాగులో విత్తనాల ఎంపిక, భూసార పరీక్షల ఫలితాలు దిగుబడిపై అధిక ప్రభావం చూపుతాయి. భూసార పరీక్షల్లో భూమిలో పోషకాల లభ్యత, లోపాలు తెలుస్తాయి. ఈ ఫలితాల ఆధారంగా ఎలాంటి పంటలు సాగు చేయాలనే విషయాలు కూడా తెలుస్తాయి. రైతులు గుర్తింపులేని వ్యక్తుల వద్ద, దుకాణాల్లో విత్తనాలు కోనుగోలు చేయకూడదు. ప్రభుత్వం గుర్తింపు పొందిన దుకాణాల్లో విత్తనం కొనుగోలు చేసి రసీదు తీసుకోవాలి. విత్తే ముందు తప్పని సరిగా విత్తనశుద్ధి చేసుకుంటే నెల రోజుల వరకూ పంటకు తెగుళ్లు రాకుండా అరికట్టవచ్ఛు నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులను రక్షించడానికి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో వేరుసెనగ, ఆముదం, కంది, సజ్జ విత్తనాలను విక్రయిస్తున్నామని శాస్త్రవేత్త తెలిపారు.

నల్లరేగడి నేలల్లో సాగు చేసే పంటల వివరాలు

జిల్లాలో నల్లరేగడి భూముల్లో రైతులు జూన్‌, జులైలో వర్షాధారంగా పత్తి, పప్పుశనగ, కొర్ర, ఆముదం, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేస్తే ఆశించిన దిగుబడి సాధించవచ్ఛు ఆగస్టులో ఈ పంటలు సాగు చేస్తే దిగుబడి తగ్గుతుంది.

ఎర్రనేలలో.. జిల్లాలో ఎర్రనేలలు అధికంగా ఉన్నాయి. అందులో వేరుసెనగ, పప్పుశనగ, ఆముదం, జొన్న, సజ్జ, అలసంద పంటలను జూన్‌, జులై 30 వరకూ సాగు చేయడానికి అనువైన సమయం. మే నెలలో వర్షాలు కురిసినందున కొందరు రైతులు ముందుగానే పంటలు సాగు చేస్తున్నారని, అలా చేస్తే దిగుబడి తగ్గుతుందని శాస్త్రవేత్త పేర్కొన్నారు.

అనువైన విత్తన రకాలు

వేరుసెనగ: వేమన, కదిరి, ప్రసూన, అనంత, అభయ, గ్రీశ్మ, ధరణి.

కంది: ఎల్‌ఆర్‌జీ-41, ఐసీపీఎల్‌-85063, ఎల్‌ఆర్‌జీ-330, పీఆర్‌జీ-100, పీఆర్‌జీ-158.

జొన్న: సీఎస్‌హెచ్‌-9, 13, 14 రకాలు, సీఎస్‌వీ- 12, 13 రకాలు.

పత్తి : నరసింహా, శివానంది, సవిత, ఎల్‌హెచ్‌ఏ-5166.

ఆముదం: క్రాంతి, జ్యోతి, పీసీహెచ్‌-111, 222 రకాలు.

కొర్ర: ప్రసాద్‌, కృష్ణదేవరాయ, నరసింహరాయ, శ్రీలక్ష్మి, సూర్యనంది ప్రసాద్‌.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని