logo
Published : 26 May 2022 03:53 IST

ఏమాత్రం లేవు

పెద్దాసుపత్రికి మందుల రోగం!
పేద రోగులపై ఆర్థిక భారం

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే సర్వజన ఆసుపత్రిలో మందుల కొరత ఏర్పడింది. ఆరు నెలలకు పైగా మందుల కొరత పట్టి పీడిస్తోంది. బయట నుంచి తెచ్చుకోమని  వైద్యులు రోగులకు చీటీలు రాసి పంపుతున్నారు. ప్రైవేటు వైద్యం పొందలేక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే మందుల కొనుగోలు తడిసిమోపెడవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  గత ఏడాది సెప్టెంబరు నుంచి సర్జికల్‌ వస్తువులు లేక శస్త్ర చికిత్సలకు వైద్యులు ఇబ్బంది పడుతున్నారు. వ్యాధిని బట్టి రోజుకు కనీసం రూ.2 వేల నుంచి రూ.5 వేలు వరకు మందుల కోసం ఖర్చు చేయాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్జికల్‌ బడ్జెట్‌ అంతంతనే..
* ఏటా ప్రభుత్వం సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు రూ.2.04 కోట్లు త్రైమాసికానికి కేటాయిస్తుంది. ఇందులో రూ.1.50 కోట్లు మందుల కొనుగోలుకు, రూ.54 లక్షలు సర్జికల్‌ వస్తువుల కొనుగోలుకు ఇస్తుంది. వాటిని రాష్ట్ర స్థాయిలో కొనుగోలు చేసి ఏపీఎంఐడీసీ ద్వారా పెద్దాసుపత్రికి సరఫరా చేస్తారు. 
* అత్యవసర కొనుగోళ్లలో భాగంగా 20 శాతం మందులను ఆసుపత్రి పర్యవేక్షకులు స్వయంగా కొనుగోలు చేయడానికి అధికారం ఇచ్చారు. స్థానిక కొనుగోలులో భాగంగా రూ.11 లక్షలు సర్జికల్‌కు, రూ.30 లక్షలు మందుల కొనుగోలుకు కేటాయిస్తారు. అంటే త్రైమాసికానికి రూ.41 లక్షలు బడ్జెట్‌ ఆసుపత్రి పర్యవేక్షకుల ఖాతాకు చేరుతుంది. 
* గత మూడేళ్లుగా సర్జికల్‌కు నిధులు కేటాయించలేదు. సుమారు రూ.40 లక్షలకు పైగా మందుల ఏజెన్సీలకు బకాయిలు ఉన్నాయి. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు ప్రస్తుతం రుణంపై మందులు సరఫరా చేయడానికి ముందుకు రావడం లేదు. 
* కరోనా నేపథ్యంలో మూడేళ్లుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మందులు, సర్జికల్‌ వస్తువుల వినియోగం పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర కొరత ఏర్పడిందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 
చీకటి పడితే.. చుక్కలే
* రాత్రి 11 గంటల తర్వాత నగరంలో దుకాణాలు మూసి వేస్తారు. ఒకటో, రెండో 24 గంటలు పని చేసే మందుల దుకాణాలు ఉన్నాయి. ఆ సమయంలో ఆసుపత్రి నుంచి అక్కడికి వెళ్లడానికి ఆటో బాడుగ రూ.100 నుంచి రూ.150 చెల్లించాలి. ఆటో తీసుకొని వెళ్లినా సర్జికల్‌ వస్తువులు లభించక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
* ఆసుపత్రిలో మందుల కొరత కొందరు ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలకు ఆదాయ వనరుగా మారింది. కొందరు సిబ్బంది సర్జికల్‌ చేతి తొడుగులు, కుట్లు వేయడానికి వినియోగించే దారం, ఎన్‌ఎస్, ఆర్‌ఎల్‌ గ్లూకోజ్‌ బాటిళ్లను వద్ద ఉంచుకొని గుట్టుగా విక్రయిస్తున్నారు. రాత్రి వేళ బయటకు వెళ్లలేక అధిక మొత్తం చెల్లించి రోగి సహాయకులు కొనుగోలు చేస్తున్నారు.


బయట నుంచి తెచ్చుకోవడానికి రాసిన చీటీ 

మే21న
శింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన శోభ కత్తిపోటుకు గురై ప్రభుత్వాసుపత్రిలో చేరింది. వైద్యులు చికిత్స చేసినప్పటికీ మందులు తెచ్చుకోవాలని బయటకు చీటి రాసి పంపారు. ఆమె ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఓ స్వచ్ఛంద సంస్థ రూ.2,500 ఖర్చు చేసి మందులు కొని ఇచ్చింది.

ప్రభుత్వం సరఫరా చేయకపోవడం దారుణం
- పెద్దన్న, పెద్దపప్పూరు
రెండు రోజులుగా మా బంధువు శివ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. మొదటి రోజు మందులకు రూ.950 ఖర్చు అయ్యింది. ఆసుపత్రికి వచ్చేది పేద రోగులు. ఇలాంటి చోట మందులు ప్రభుత్వం సరఫరా చేయలేకపోవడం దారుణం.
కొనుగోళ్లు చేస్తున్నాం
- డాక్టర్‌ విజయమ్మ, ఉప ఆర్‌ఎంవో
స్థానికంగా మందులు కొనుగోళ్లు చేపట్టాం. కొన్ని రకాలవి వచ్చాయి. పది రోజుల తర్వాత అన్ని రకాల మందులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కొరతపై ఉన్నతాధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. 

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts