logo

Andhra News: అనంతపురం జిల్లాలో నకిలీ జాయింట్‌ కలెక్టర్‌ హల్‌చల్‌

శెట్టూరు మండలంలో జేసీ పేరిట ఓ మహిళ బుధవారం హల్‌చల్‌ చేసింది. చింతర్లపల్లి, ములకలేడు, తిప్పనపల్లి సచివాలయాలను తనిఖీ చేసింది. తన పేరు సింధూరి జంపాల అని, సచివాలయాల జేసీగా బాధ్యతలు చేపట్టానంటూ సిబ్బంది హాజరు పట్టిక, బయోమెట్రిక్‌పై ఆరా తీసింది.

Updated : 26 May 2022 10:15 IST


చింతర్లపల్లి సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న సింధూరి

శెట్టూరు, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలో జేసీ(జాయింట్‌ కలెక్టర్‌) పేరిట ఓ మహిళ బుధవారం హల్‌చల్‌ చేసింది. చింతర్లపల్లి, ములకలేడు, తిప్పనపల్లి సచివాలయాలను తనిఖీ చేసింది. తన పేరు సింధూరి జంపాల అని, సచివాలయాల జేసీగా బాధ్యతలు చేపట్టానంటూ సిబ్బంది హాజరు పట్టిక, బయోమెట్రిక్‌పై ఆరా తీసింది. అనంతరం శెట్టూరు పీహెచ్‌సీకి వచ్చింది. వైద్యుడి కుర్చీలో కూర్చుని.. సిబ్బంది ఎవరెవరు ఎక్కడి నుంచి విధులకు వస్తున్నది, మందుల నిల్వ వివరాలు అడిగింది. సచివాలయాల సిబ్బంది విషయాన్ని తహసీల్దారు శంకరయ్య, ఎంపీడీవో వెంకటనాయుడు, ఎస్సై యువరాజ్‌కు చేరవేశారు. వారందరూ పీహెచ్‌సీకి చేరుకుని ఆమెను ప్రశ్నించారు. జేసీ హోదాతోనే తనిఖీ చేస్తున్నానని, ఎక్కడైనా విచారించుకోండని చెప్పడంతో తహసీల్దార్‌ కలెక్టరేట్‌కు ఫోన్‌ చేశారు. ఆ పేరుతో జేసీ ఎవరూ జాయిన్‌ కాలేదని చెప్పడంతో నకిలీగా నిర్ధారించుకుని కలెక్టరేట్‌కు తీసుకెళ్లారు. అక్కడ జేసీ కేతన్‌గార్గ్‌ ఆమె వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అనంతరం శెట్టూరుకు తీసుకొచ్చి కేసు నమోదు చేశారు. ఆమె వెంట శెట్టూరు మండలం ములకలేడు ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేసే హెల్త్‌ అసిస్టెంట్‌ లక్ష్మణ్‌ ఉన్నారు. ఎస్సై మాట్లాడుతూ సింధూరి సొంతూరు శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురమని, బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివిందని తెలిపారు. గతంలో జిల్లాకేంద్రంలో పదో తరగతి స్క్వాడ్‌గా, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఓ వైద్యుడిని సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించిందని, రెండు ప్రైవేటు పాఠశాలలు, బత్తలపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిందన్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని