logo
Published : 27 Jun 2022 06:02 IST

2 ఏళ్లన్నారు .. ఏళ్లయినా పలకరు!

హంద్రీనీవా ప్రగతిపై మాటతప్పిన ప్రభుత్వం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, ఉరవకొండ

ఉరవకొండ పరిధిలోని హంద్రీనీవా ఉపకాలువ

కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేయడం కోసం 1989లో హంద్రీనీవా పథకానికి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లాలోని హంద్రీ, చిత్తూరు జిల్లాలోని నీవా నదుల్ని అనుసంధానం చేసి కృష్ణా జలాలను తరలించాలనేది ప్రధాన ఉద్దేశం. అప్పటినుంచి 2019 వరకు పనిచేసిన ప్రభుత్వాలన్నీ పథకం పనుల్ని ఎంతోకొంత ముందుకు తీసుకెళ్లాయి. అయితే వైకాపా ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లయినా ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రతిపక్ష హోదాలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు నీటిమీద రాతలుగా మారిపోయాయని రైతులు విమర్శిస్తున్నారు.

గతంలోనే 95 శాతం పూర్తి..

హంద్రీనీవా ఫేజ్‌-1 పనులు 2012లోనే పూర్తయ్యాయి. అప్పటినుంచి జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరుతున్నాయి. అయితే పక్కనే నీరు ప్రవహిస్తున్నా వినియోగించలేని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం హంద్రీనీవా కాలువ నుంచి ఆయకట్టుకు నీరందించే ఉప, పిల్లకాలువలు పూర్తికాకపోవడమే. 33, 34, 36 ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టారు. ఈ మూడు ప్యాకేజీల పనులను వివిధ ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించారు. 33వ ప్యాకేజీకి సంబంధించి 96 శాతం, 34 ప్యాకేజీలో 95 శాతం పనులు గతంలోనే పూర్తయ్యాయి. వంతెనలు, కల్వర్టులు, అక్విడెట్‌ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. వీటిని పూర్తి చేస్తే చెరువులను నింపి ఆయకట్టుకు నీరందించవచ్ఛు అప్పటివరకు చేసిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. 2, 3 శాతం పనులు మాత్రమే పూర్తికావాల్సిన నేపథ్యంలో గడిచిన రెండేళ్లలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

అనుమతుల కోసం నిరీక్షణ

ప్యాకేజీ 36కు సంబంధించి 18 శాతమే పనులు పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 శాతం కంటే తక్కువ పూర్తయిన పనుల్ని రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆ ప్యాకేజీ పనుల్ని రద్దు చేశారు. తర్వాత పనుల్ని పూర్తిచేయడానికి రూ.600 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ఇందులో భూసేకరణ కోసం రూ.200 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ప్రతిపాదనల్లో కొన్ని సవరణలు సూచిస్తూ ప్రభుత్వం వెనక్కి పంపినట్లు సమాచారం. ఈ మూడు ప్యాకేజీలు పూర్తయితే జిల్లాలోని ఉరవకొండ, గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం పరిధిలోని 1.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

ఆందోళనలో అన్నదాతలు

హంద్రీనీవా ప్రధాన, ఉపకాలువల నిర్మాణంలో భాగంగా చాలామంది రైతులు తమ భూమిని కోల్పోయారు. తమకున్న పొలంలో కొంత కాలువ నిర్మాణం కోసం పోయినా కృష్ణా జలాలతో మిగిలిన భూమిలో వ్యవసాయం చేయవచ్చని రైతులు ఆశపడ్డారు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఆశలు నెరవేరే దిశగా అడుగులు పడటం లేదు. రైతుల పొలాల గుండా తవ్విన పిల్లకాలువలు ఇప్పటికే చాలావరకు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. హంద్రీనీవా పథకం కింద ఇప్పటివరకు ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా నీరు అందించకపోవడం గమనార్హం.

నిధుల లేమి..

పథకం పనులు ముందుకు కదలకపోవడానికి నిధుల లేమి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 33, 34 ప్యాకేజీల్లో ఇప్పటికీ 150 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది. భూముల ధరలు పెరగడంతో పరిహారం ఎక్కువ ఇవ్వాలని రైతులు డిమాండు చేస్తున్నారు. వీటికి సంబంధించి నిధులు సర్దుబాటు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల కొన్ని చోట్ల పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకురాగా రైతులు అడ్డుకున్నారు. పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని తేల్చి చెబుతున్నారు. దీనికితోడు 33, 34 ప్యాకేజీల్లో చేసిన పనుల్లో కొన్నింటిని బిల్లులు ఆమోదం పొందడం లేదని తెలుస్తోంది.

ప్రతిపాదనలు పంపాం

దేశానాయక్‌, ఎస్‌ఈ, హంద్రీనీవా

హంద్రీనీవా పథకంలో ఇటీవల కొంతమేర భూసేకరణ చేశాం. 36వ ప్యాకేజీకి సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు పనుల్ని రద్దు చేసి కొత్తగా ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. అనుమతి వచ్చిన వెంటనే పనులు మొదలుపెడతాం.

నాటిమాట

‘నాన్నగారి హయాంలో హంద్రీనీవాకు అత్యంత ప్రాధాన్యమిచ్చి రూ.4 వేల కోట్లు కేటాయించారు. ఫేజ్‌-1లో 90 శాతం పనులు పూర్తిచేశారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా తక్కిన 10 శాతం పనులు కూడా పూర్తిచేయలేదు. మిగిలిపోయిన డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తిచేస్తే ఒక్క అనంతపురం జిల్లాలోనే 1.18 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్ఛు ప్రాజెక్టు పూర్తిచేయకపోతే పోరాటం చేస్తాం. లేదంటే మన ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల సమయం ఇవ్వండి.. హంద్రీనీవాను పూర్తిచేసి ఆయకట్టుకు నీరందిస్తాం.’’ 2017 ఫిబ్రవరి 6న ఉరవకొండలో జరిగిన మహాధర్నాలో ప్రతిపక్షహోదాలో వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి వాఖ్యలివి.

నేటి పరిస్థితి..

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయింది. ఇప్పటివరకు ఒక్కశాతం పనులు కూడా ముందుకు సాగలేదు. గతంలో తవ్విన కాలువలు కూడా కంపచెట్లతో దర్శనమిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటరీల కాలువలు పూర్తిగా రూపం కోల్పోయాయి. గతంలో చేసిన పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకురావడం లేదు. కొన్ని ప్యాకేజీల్లో పనులు రద్దు చేసి కొత్తగా ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. కళ్లముందే నీరు ప్రవహిస్తున్నా వాడుకోలేని దుస్థితి ఏర్పడిందని ఆయకట్టు రైతులు వాపోతున్నారు.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని