logo
Published : 27 Jun 2022 06:02 IST

బిల్లులు బకాయిలు .. వెలగని వీధి దీపాలు

రాయదుర్గంలో అంధకారం

కణేకల్లు రోడ్డులో వెలగని వీధి దీపాలు

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాయదుర్గంలో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గత మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో రూ.4 లక్షల వరకు సాధారణ నిధులు కేటాయించి రెండుమార్లు టెండర్లు పిలిచినా సరఫరాకు గుత్తేదారులు ముందుకు రాలేదు. రూ.లక్ష చొప్పున కౌన్సిలర్లకు కేటాయించి బల్బుల ఏర్పాటుకు కౌన్సిల్‌లో నిర్ణయించినా ఆ ప్రతిపాదన ఇంకా కార్యరూపం దాల్చలేదు.

కానరాని నిర్వహణ..

కొత్త వీధిదీపాల ఏర్పాటు సంగతి దేవుడెరుగు.. కనీసం పనిచేయనివాటి నిర్వహణకు కూడా విడి పరికరాల సరఫరా సక్రమంగా జరగటంలేదు. 32 వార్డుల్లో 3,500కు పైగా వీధి దీపాలున్నాయి. అందులో 300 వరకు వెలగడంలేదు. బకాయిలు పేరుకుపోవడంతో నిర్వహణ బాధ్యత చూడాల్సిన ఈఈఎస్‌ఎల్‌ సంస్థ పట్టించుకోవడంలేదు. ప్రతినెలా సదరు సంస్థకు రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. సీఎఫ్‌ఎంఎస్‌ విధానంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. 2016 నుంచి ఇప్పటి వరకు రూ.1.64 కోట్ల బకాయిలు ఉన్నాయి.

2వేలకు పైగా కొత్తవి అవసరం..

పట్టణం, శివారు కాలనీలు నానాటికీ విస్తరిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో కొత్తబల్బులు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఇలా దాదాపు 2వేల వరకు అవసరమని గుర్తించారు. ఉన్నవాటికే మరమ్మతులు చేయని నేపథ్యంలో కొత్తవాటి సంగతి మరిచిపోవాల్సిందేనని స్థానికులు చెబుతున్నారు. బకాయిలతో సంబంధం లేకుండా ఈఈఎస్‌ఎల్‌ ద్వారా ప్రస్తుతం కేటాయించిన నిధులతో నేరుగా వీధి దీపాల కొనుగోలుకు మున్సిపల్‌ అధికారులు నిర్ణయించినా నేటికీ చర్యలు తీసుకోలేదు.

పట్టించుకోవడం లేదు..

విద్యుత్తు తీగల లూజ్‌ కనెక్షన్లతో వీధి దీపాలు సక్రమంగా వెలగడంలేదు. ఒకరోజు వెలిగితే రెండు రోజులు చీకట్లు ఉంటున్నాయి. ఎవరూ పట్టించుకునేవారు లేరు. మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలి. -రఫీక్‌, ఓబుళాచారిరోడ్డు, రాయదుర్గం

పలుచోట్ల ప్రజల అవస్థలు

పట్టణంలోని కణేకల్లు రోడ్డులో అంధకారం నెలకొంది. బళ్ళారిరోడ్డు, కె.బి ప్యాలెస్‌ రోడ్డు, మొలకాల్మూర్‌ రోడ్డు, అనంతపురం రహదారితోపాటు పలుచోట్ల అదే పరిస్థితి. ద్విచక్రవాహనదారులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొండశివారున ఆత్మకూరు వీధి తదితర ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం, విషపురుగుల కారణంగా రాత్రిళ్లు బయటికి రావాలంటే భయాందోళన చెందుతున్నారు. తరచూ గొలుసు దొంగతనాలు, ఇతర చోరీలు చోటుచేసుకుంటున్నాయి. పట్టణంలో 433 విద్యుత్తు స్తంభాలకు మూడో లైన్‌ లేదు. ఈదురు గాలులు వీచినప్పుడు, వర్షానికి బల్బులు పనిచేయడంలేదు. సిబ్బందికి తెలిపినా స్పందించటంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్‌ సాధారణ నిధులతోనైనా కొత్త బల్బులు అమర్చాలని కోరుతున్నారు.

చర్యలు చేపడతాం..

వీధి దీపాలు ఎన్ని పనిచేయడం లేదు, కొత్తవి ఎన్ని అవసరమవుతాయనే విషయంపై వార్డు సచివాలయాల సిబ్బంది నుంచి నివేదిక కోరాం. సమాచారం అందిన తర్వాత వీధి దీపాల కొనుగోలుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటాం. 175 వీధి దీపాలకు స్థానికంగానే మరమ్మతులు చేయిస్తాం. -దివాకర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, రాయదుర్గం

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని