logo
Published : 27 Jun 2022 06:02 IST

అడిగేవారు లేరని .. అడ్డంగా దోచుకొని..

చెరువులు, గుట్టల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

ఇక్కడ చూస్తున్న చిత్రం పోతులనాగేపల్లి రెవెన్యూ పొలంలో తవ్వినది. ఒకవేల మట్టి తవ్వకానికి అనుమతులు తీసుకున్నా.. కేవలం ఒక మీటరు లోతు మాత్రమే తవ్వాలి. కానీ, నిబంధనలు అతిక్రమించారు. ఆ పరిసర ప్రాంతంలో పేదలు ఇళ్లు కట్టుకుంటే.. చిన్న పిల్లలు ఆడుకుంటూవెళ్లి ఆ గుంతలో పడితే ప్రమాదం తప్పదు. వర్షం వచ్చినప్పుడు నీరు నిల్వ ఉండి స్థానిక ప్రజలకు రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.

పోతులనాగేపల్లి లేఅవుట్‌లో పేదలకు కొండ పరిసర ప్రాంతంలో ఇంటి పట్టా నంబరు 3955 ప్లాట్‌ ఇచ్చారు. ఈ ప్లాట్‌ పక్కనే ఇంకో ప్లాట్‌ ఉంది. వీటి వెనుక వైపు అడుగు లోతుపైగా మట్టి తవ్వేశారు. ఈ పేదలు ఇళ్లు ఎలా కట్టుకుంటారు? ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలు తవ్విన గుంతలను ఎలా పూడ్చుతారు? ఇలా ఇష్టారాజ్యంగా పేదలకు ఇచ్చిన పట్టాలను సైతం వదలకుండా తవ్వేస్తూ మట్టిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: అధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండా.. అధికారపార్టీ నాయకుల అండదండలతో కొందరు కొండలు, గుట్టలను అడ్డంగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నా.. అడ్డుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువులు, బంజర భూములు, గుట్టల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. గోరంత అనుమతి ఉన్నా.. కొండంత తవ్వి వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారు. పలుచోట్ల ప్రమాదకరంగా తవ్వకాలు చేశారు.

ధర్మవరం పట్టణవాసులకు పోతులనాగేపల్లి రెవెన్యూ పొలంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. కొన్ని ప్రాంతాలు గుట్టలకు ఆనుకొని పేదలకు ఇచ్చారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేశారు. ఇళ్లు కట్టుకునేందుకు కూడా వీలులేకుండా మట్టి తవ్వేశారు. అదేవిధంగా రేగాటిపల్లి గ్రామ కొండ పరిసర ప్రాంతాల్లో మట్టిని తరలించేశారు.

ఇలా వసూలు చేస్తున్నారు..

జగనన్న కాలనీలోని లేఅవుట్లలో పేదలు ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. పునాది వేసేందుకు బండరాళ్లు అవసరం. ఇదే అవకాశంగా భావించి అధికార పార్టీ నాయకులు, వ్యాపారులు ట్రాక్టరు బండరాళ్లను రూ.1,000 నుంచి రూ.1,300 చొప్పున విక్రయిస్తున్నారు. స్థానికంగా ఉన్న గుట్టలను తవ్వి ఈ బండరాళ్లను అనుమతి లేకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేవిధంగా చెరువులు, కుంటలు, కొండ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వి వాటిని వాణిజ్య సముదాయాల నిర్మాణాలకు, పునాదులు పూడ్చడానికి ట్రాక్టరు మట్టిని రూ.800 నుంచి రూ.1,000 చొప్పున విక్రయిస్తున్నారు. వీటిని అక్రమంగా తరలించేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు మట్టి, అడుగు రాళ్ల(బండరాళ్లు)ను తరలిస్తున్నారు.

రేగాటిపల్లి గ్రామ రెవెన్యూ పొలంలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు చిలకం మధుసూదన్‌రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని గతంలోనే ఆరోపించారు. అయినా అధికారుల్లో చలనం లేదు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

వరప్రసాద్‌, ఆర్డీవో, ధర్మవరం

క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులతో పరిశీలన చేసి అక్రమంగా తరలింపు చేసి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాము. తప్పనిసరిగా అనుమతులు తీసుకొని నిబంధనలు ప్రకారం మట్టి, రాళ్లను తరలించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని