logo

విమర్శంచి.. విస్మరించి!

వందల సంఖ్యలో చెరువులు నింపి.. వేల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర పథకం ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. పాలకుల నిర్లక్ష్యంతో మూడేళ్లుగా పనులు ముందుకు కదలలేదు. గత

Published : 28 Jun 2022 04:50 IST
మడకశిర బ్రాంచి కెనాల్‌పై నీలినీడలు
మూడేళ్లుగా ఒక్క అడుగూ పడలేదు
ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, మడకశిర
గుడిబండ పరిధిలో బ్రాంచ్‌ కెనాల్‌పై నిలిచిన వంతెన పనులు

వందల సంఖ్యలో చెరువులు నింపి.. వేల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర పథకం ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. పాలకుల నిర్లక్ష్యంతో మూడేళ్లుగా పనులు ముందుకు కదలలేదు. గత ప్రభుత్వంలో పనుల్ని పరుగులు పెట్టించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కన్నెత్తి కూడా చూడటం లేదు. గతంలో తవ్విన కాలువ గట్లు తెగి, చెట్లు మొలిచి రూపుకోల్పోతున్నాయి. మిగిలిన చిన్నచిన్న పనుల్ని పూర్తిచేయడానికి అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా ప్రభుత్వ ఆమోదానికి నోచుకోవడం లేదు. మరోవైపు కొత్తగా బైపాస్‌ కాలువను నిర్మించే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. బైపాస్‌ కెనాల్‌ ప్రతిపాదన బాగానే ఉన్నా బ్రాంచి కెనాల్‌కు సంబంధించి మిగిలిన పనుల్ని పూర్తి చేయకపోతే లక్ష్యం నెరవేరదు. దీనిపై ఎలా ముందుకు వెళ్తారనేది స్పష్టం కావాల్సి ఉంది.

రూ.730 కోట్ల అంచనాతో..

హంద్రీనీవా జలాలతో మడకశిర నియోజకవర్గంలోని 5 మండలాలకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మడకశిర బ్రాంచి కాలువకు శ్రీకారం చుట్టారు. తెదేపా హయాంలో పనులు చురుగ్గా చేపట్టారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి పెనుకొండ, సోమందేపల్లి, హిందూపురం, లేపాక్షి, పరిగి మండలాల మీదుగా మడకశిరకు కాలువ నిర్మించారు. మొత్తం 17 లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి మడకశిర, గుడిబండ, అమరాపురం, రొళ్ల, అగళి మండలాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. రూ.730 కోట్ల అంచనా వ్యయంతో 170 కిలోమీటర్ల కాలువ తవ్వారు. అలాగే అగళి వరకు 30 కి.మీ. కాలువ, అమరాపురం వరకు మరో 30 కి.మీ. కాలువ కలుపుకొని మొత్తంగా 230 కిలోమీటర్ల మేర జలాలను తరలించేలా పనులు చేశారు. దీనిద్వారా మడకశిరతోపాటు ఇతర మండలాల్లోని చిన్నవి, పెద్దవి కలిపి 265 చెరువులను కృష్ణా జలాలతో నింపాలనేది ముఖ్య ఉద్దేశం.

గతంలోనే 90 శాతం పూర్తి

మడకశిర నియోజకవర్గం పరిధిలో 122 కి.మీ.ల మేర కాలువ పనుల్ని 56, 57, 58 ప్యాకేజీల్లో చేపట్టారు. తెదేపా ప్రభుత్వంలోనే 90 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. కల్వర్టులు, వంతెనలు మినహా ప్రధాన కాలువ పూర్తయింది. అప్పట్లోనే మడకశిర చెరువుకు నీరు అందించారు. మిగిలిన 10 శాతం పనులు పూర్తయితే 5 మండలాల్లోని చెరువులకు నీరు చేరే అవకాశం ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

మిగిలింది వంతెనలే..

కృష్ణానది జలాలు హంద్రీనీవా ద్వారా చెరువులకు చేరాలంటే కాలువపై వంతెనలు, కల్వర్టులు మాత్రమే పూర్తికావాల్సి ఉంది. మూడు ప్యాకేజీల్లో కలిపి 280 వరకు వంతెనలు, కల్వర్టులు నిర్మించాల్సి ఉండగా.. 202 వరకు పూర్తయ్యాయి. 78 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పూర్తిచేయడానికి రూ.70 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఇప్పటివరకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. 58వ ప్యాకేజీలో అగళి, అమరాపురం మండలాల్లో 65 కిలోమీటర్ల కాలువ ఉంది. దీనిపై 167 వంతెనలు నిర్మించాల్సి ఉండగా.. 121 పూర్తి చేశారు. 56వ ప్యాకేజీలో 10 వంతెనలు, 57వ ప్యాకేజీలో 22 వంతెనలు పెండింగ్‌లో ఉన్నాయి.

కొత్తగా బైపాస్‌ ప్రతిపాదన

గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి మడకశిర చివరి వరకు 160 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ నిర్మాణం జరిగింది. అంతదూరం నీరు ప్రవహించి మడకశిర చేరుకోవడానికి ఎక్కువ సమయంతోపాటు నీటి వృథా అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీనికి పరిష్కారంగా మడకశిర బైపాస్‌ కెనాల్‌ను కొత్తగా తెరపైకి తీసుకొచ్చారు. బ్రాంచి కెనాల్‌పై 41వ కిలోమీటరు  నుంచి 125వ కిలోమీటరు వరకు 37 కిలోమీటర్ల కాలువ నిర్మించాలనేది ఆలోచన. దీనివల్ల 47 కి.మీ.ల దూరం తగ్గుతుందని చెబుతున్నారు. ఈ బైపాస్‌ కెనాల్‌పై రెండు లిఫ్టులు వస్తాయి. రూ.214 కోట్ల అంచనాతో నిర్మించనున్నారు.


ఇదీ పరిస్థితి..

56వ ప్యాకేజీలో మడకశిర మండలం సి.కొడిగేపల్లి వద్ద ప్రారంభమై మనూరు, కల్లుమర్రి, హరేసముద్రం చెరువు వరకు 7 కి.మీ.ల కాలువ, అక్కడి నుంచి కదిరేపల్లి మీదుగా రాళ్లపల్లి, జంబులబండ, గుడిబండ మండలం సింగేపల్లి వరకు 31 కి.మీ.లు, అక్కడి జంక్షన్‌ నుంచి రెండుగా చీలిపోయి అగళి మండలంలో 32 కిలోమీటర్లు, అమరాపురం మండలంలో 32 కిలోమీటర్లు మేర కాలువ నిర్మాణం చేశారు. రొళ్ల మండలంలో 14 కిలోమీటర్ల మేర కాలువ వెళ్తుంది. 57 ప్యాకేజీలో హరేసముద్రం చెరువు నుంచి జంబలబండ సమీపంలోని సింగేపల్లి చెరువు వరకు 32 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం సాగింది.


‘మడకశిర బ్రాంచి కెనాల్‌ పనులపై తెదేపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. బ్రాంచ్‌ కెనాల్‌ కోసం రూ.250 ఖర్చు చేసి 80 శాతం పనుల్ని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పూర్తిచేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 20 శాతం పనులు కూడా చేయలేకపోయారు. వైకాపా అధికారంలోకి రాగానే పూర్తి చేసి నీళ్లిస్తాం’.

- 2019 మార్చి 30న ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాట


ప్రతిపాదనలు పంపిస్తాం
దేశానాయక్‌, ఎస్‌ఈ, హంద్రీనీవా

మడకశిర బ్రాంచి కెనాల్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వంతెనల నిర్మాణానికి గతంలో ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఇటీవల జరిగిన సమావేశంలో కొత్తగా ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించాం. కొత్త ధరలు ఖరారైన తర్వాత పూర్తిస్థాయి అంచనాలు రూపొందిస్తాం. మడకశిరకు వేగంగా నీటిని తీసుకెళ్లాలనే ప్రతిపాదనతో బైపాస్‌ కెనాల్‌ నిర్మాణం చేపడుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని