logo

వర్షం వస్తే నీళ్లు కదలవు!

కళ్యాణదుర్గంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగు రోడ్డుపైకి చేరుతోంది. వర్షపునీరు లోతట్టు ప్రాంతాల్లో రోజుల తరబడి నిల్వ ఉంటోంది. పట్టణంలోని కోటవీధి, రాచప్పబావి వీధి, బోయవీధి ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతమైన జయనగర్‌ కాలనీ, రెవెన్యూ

Published : 29 Jun 2022 05:32 IST

సాయిబాబా గుడివద్ద ఇది పరిస్థితి..

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: కళ్యాణదుర్గంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగు రోడ్డుపైకి చేరుతోంది. వర్షపునీరు లోతట్టు ప్రాంతాల్లో రోజుల తరబడి నిల్వ ఉంటోంది. పట్టణంలోని కోటవీధి, రాచప్పబావి వీధి, బోయవీధి ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతమైన జయనగర్‌ కాలనీ, రెవెన్యూ కాలనీ, దొడగట్టరోడ్డు ప్రాంతానికి కాలువల ద్వారా మురుగు నీళ్లు వస్తాయి. కొన్నిచోట్ల కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని ఛిద్రమవడంతో మురుగు సక్రమంగా సాగడంలేదు. గాంధీసర్కిల్‌లో కోటవీధి నుంచి వచ్చేనీళ్లు వెంకటేశ్వర థియేటర్‌ వెనుకవైపు నుంచి వెళ్లి జయనగర్‌ సమీపంలో పెద్ద కాలువలో కలవాలి. చెత్త పేరుకుపోవడం, ప్రవాహం అధికంగా ఉండటంతో గాంధీసర్కిల్‌లో ఉన్న మార్గబిలం నుంచి ప్రధాన రోడ్లపైకి వస్తోంది.

లోతట్టు ప్రాంతాలకు ముప్పు..

* తేలికపాటి వర్షానికే ఎస్టీ కాలనీలో పెద్దఎత్తున నీళ్లు నిలిచి చెరువును తలపిస్తోంది. వెంకటేశ్వర థియేటర్‌ వెనుక మురుగు కాలువ అధ్వానంగా ఉండటం, వ్యర్థాలు పేరుకుపోవడంతో వర్షపునీరు రోడ్ల మీదుగా ఎస్టీ కాలనీలో దిగువ ప్రాంతానికి చేరుతాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నీళ్లు నిలిచి ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. సుమారు పది రోజుల పాటు కాలనీలో దోమలు, దుర్వాసనతో జనాలు ఇబ్బంది పడుతుంటారు.

* అనంతపురం ప్రధాన రహదారిలో సాయిబాబా గుడి వద్ద పెద్ద మురుగు కాలువ ఉంది. ఊర్లో నుంచి వచ్చే నీళ్లన్నీ ఆ కాలువలోనే సుబేదారు కుంటకు చేరుతాయి. కల్వర్టు సన్నగా ఉండటం, చెత్త అడ్డుపడటంతో నీటి ప్రవాహం సాఫీగా సాగడంలేదు. వర్షానికి పెద్ద ఎత్తున చెత్త కొట్టుకురావడంతో కల్వర్టు పైనుంచి అనంతపురం రోడ్డు మీద వర్షపు నీళ్లు ప్రవహిస్తాయి. దిగువనున్న సాయిబాబా గుడి, వెనువైపు కాలనీల్లోని ఇళ్లలోకి చేరుతున్నాయి. కల్వర్టు ఆధునికీకరించి నీటి ప్రవాహం సక్రమంగా వెళ్లేలా చూడాల్సిన అవసరం ఉంది.

* ప్రధాన కాలువ ఆక్రమణకు గురి కావడంతో చిన్నదిగా మారిపోతోంది. పిచ్చిమొక్కలు ప్రవాహానికి అడ్డుగా ఉండటంతో రోడ్డుపైకి మురుగు చేరుతోంది. వర్షాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్‌ అధికారులు కాలువ శుభ్రం చేయించి అడ్డంకి లేకుండా చర్యలు తీసుకోవాలి.


పట్టణం: కళ్యాణదుర్గం

వార్డులు: 24

జనాభా: 50 వేలు

డ్రైనేజీ కాలువలు: 16 కి.మీ.


కాలువలకు ప్రతిపాదనలు పెట్టాం..

14వ ఆర్థిక సంఘం కింద కాలువలకు ప్రతిపాదనలు పెట్టాం. గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో నిధులు వెనక్కివెళ్లాయి. కాలువలు ఏర్పాటు చేస్తే లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు వెళ్లే పరిస్థితి ఉండదు. 15వ ఆర్థిక సంఘంలో కొన్ని కాలువల ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టాం. అనంతపురం రోడ్డు కల్వర్టు విషయమై ర.భ.శాఖ అధికారులే చర్యలు తీసుకోవాలి.

-వెంకటేశులు, మున్సిపల్‌ కమిషనర్‌


వారం రోజులు నిల్వ ఉంటాయి..

తేలికపాటి వర్షం వచ్చినా ఊర్లో నీళ్లు కాలనీలోకి చేరుతున్నాయి. బయటికెళ్లే దారిలేక ఖాళీ స్థలాల్లో నిలిపోతున్నాయి. వర్షం ఆగి వారం రోజులైనా అదే పరిస్థితి. దోమల వ్యాప్తి పెరిగింది.

-రామాంజినమ్మ, ఎస్టీ కాలనీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని