logo

సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తిలో శ్రీసత్యసాయి జిల్లా వైకాపా ప్లీనరీ సమావేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకరనారాయణ అధ్యక్షతన జరిగిం

Published : 29 Jun 2022 05:32 IST

మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పక్కన ఎంపీ మాధవ్‌, ఎమ్మెల్యేలు శంకరనారాయణ, శ్రీధర్‌రెడ్డి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తిలో శ్రీసత్యసాయి జిల్లా వైకాపా ప్లీనరీ సమావేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకరనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి, సామాజిక విప్లవం తీసుకొచ్చామన్నారు. శంకరనారాయణ మాట్లాడుతూ పార్టీలు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 14 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ మాధవ్‌ మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ సమష్టిగా వచ్చినా ఒరిగేదేమీలేదన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు, మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. ఎమ్మెల్యేలు సిద్దారెడ్డి, తిప్పేస్వామి, ఎమ్మెల్సీ ఇక్బాల్‌, ఉర్దూ అకాడమి ఛైర్మన్‌ నదీమ్‌ ప్రసంగించారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హాజరుకాలేదు.  


మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతుండగానే ఇంటిబాట

మంత్రి ప్రసంగించే సమయానికి ఖాళీ అయిన కుర్చీలు

ప్లీనరీ సమావేశం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం 4 గంటలకు మొదలైంది. ఉదయం అనంతపురంలో జరిగిన ప్లీనరీలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి సాయంత్రానికి పుట్టపర్తి చేరుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడిన అనంతరం పెద్దిరెడ్డి ప్రసంగించారు. ఆయన ప్రసంగం ప్రారంభించే సమయానికే సభకు హాజరైన మహిళలు ఒక్కొక్కరిగా వెళ్లిపోవడంతో కుర్చీలు ఖాళీ అయ్యాయి. ప్లీనరీ సమావేశానికి పట్టణంలోని మెప్మా సభ్యుల్ని ఆటోల్లో తరలించారు. ఆలస్యం కావడంతో మధ్యలోనే ఇంటి బాట పట్టారు. పోలీసులు, వైకాపా నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మెప్మా అధికారులు వారించినా మహిళలు పట్టించుకోకుండా సభాప్రాంగణం నుంచి వెళ్లిపోయారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని