logo
Published : 30 Jun 2022 02:43 IST

కొండల్ని ..కొల్లగొట్టేస్తున్నారు !

యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

ప్రజాప్రతినిధుల అండతో రవాణా

రాప్తాడు మండలం రామినేపల్లిలో కరిగిపోతున్న కొండ

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: కొండలు, గుట్టలు, వాగు వంకలు, కాలువ గట్టు.. ఇలా ఏదైనా సరే అక్రమార్కుల కన్ను పడిందంటే కొల్లగొట్టేస్తున్నారు. చెరువుల గర్భాన్ని తొలుస్తున్నారు. రాత్రికిరాత్రే గుట్టలను కనుమరుగు చేస్తున్నారు. ఉమ్మడి అనంత జిల్లాలో కొందరు అధికార అండతో గ్రావెల్‌, ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ యంత్రాలతో తవ్వేస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. జగనన్న కాలనీల పేరుతో పెద్దఎత్తున మట్టిని తవ్వి ప్రైవేటు లేఅవుట్లకు విక్రయిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అనంత గ్రామీణం, మడకశిర, బుక్కరాయసముద్రం, గోరంట్ల, చిలమత్తూరు, పెనుకొండ, యల్లనూరు తదితర ప్రాంతాల్లో రాత్రివేళల్లో అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.

నిబంధనలు విస్మరించి..

సొంత పొలంలోనైనా అడుగు లోతుకు మించి మట్టి తవ్వాలంటే గనుల శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. దేవుడు మాన్యం, చెరువులు, కాలువ గట్ల వద్ద తవ్వకాలు నిషేధించారు. అయినా నిబంధనలు పక్కనపెట్టేసి గ్రావెల్‌ తవ్వకాలు చేపడుతున్నారు. కొంతస్థలంలో అనుమతి తీసుకుని పరిమితికి మించి తవ్వకాలు జరుపుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా అనంత నగరంతోపాటు ముఖ్య పట్టణాలకు మట్టిని తరలిస్తున్నారు. 6 మీటర్ల లోతుకు మించి తవ్వితే మైనింగ్‌ సేప్టీ మార్గదర్శకాలు అమలుచేయాల్సి ఉంటుంది. 15 అడుగుల నుంచి 30 అడుగుల లోతు వరకు తవ్వుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. చెరువుల్లో పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారుతున్నా అధికారులు నిర్లక్ష్యం వీడలేదు.

టిప్పర్‌ రూ.5 వేలు

స్థానిక నాయకులు మట్టి తరలింపును ఆదాయ వనరుగా మలుచుకున్నారు. ఒక్కో ట్రాక్టరు గ్రావెల్‌కు రూ.1000 నుంచి రూ.1800 వరకు వసూలు చేస్తున్నారు. టిప్పర్‌కు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఒక్క టిప్పర్‌ మట్టి తరలిస్తే రూ.1500 నుంచి రూ.2 వేల వరకు మిగులుతోంది. రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లు తరలిస్తూ రూ.లక్షలు జేబులో వేసుకుంటున్నారు.

ఎక్కడెక్కడ

అనంతపురానికి సమీపాన హంపాపురం, కృష్ణంరెడ్డిపల్లి, చియ్యేడు, ఆలమూరు, బుక్కరాయసముద్రం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మట్టిని తవ్వి నగరంలోని అపార్టుమెంట్ల నిర్మాణానికి, వెంచర్లకు రవాణా చేస్తున్నారు. గుత్తి పరిసర ప్రాంతాలతోపాటు, ఆనుకుని ఉన్న కొత్తపేట, ఎంగిలిబండ గ్రామాల పరిసరాల్లో గుట్టలను జేసీబీలతో కొల్లగొడుతున్నారు. అనంతరం ఆ ప్రాంతాలను చదును చేసి కబ్జా చేస్తున్నారు. ధర్మవరం సమీపంలోని రేగాటిపల్లి కొండ వద్ద, పోతులనాగేపల్లి, రావులచెరువులో యథేచ్ఛగా మట్టి తరలింపు కొనసాగుతోంది. సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో నిర్మాణాలు జోరందుకున్నాయి. మట్టి, గ్రావెల్‌కు డిమాండు ఏర్పడింది. పుట్టపర్తి పరిసరాలు, కర్ణాటకనాగేపల్లి, ప్రశాంతిగ్రామ్‌ గుట్టల్లో జేసీబీ యంత్రాలతో తోడేస్తున్నారు. కళ్యాణదుర్గానికి సమీపాన చెరువులో, బైపాస్‌రోడ్డు, ముదిగల్లు రోడ్డు, పాలవాయి, బోయలపల్లి వద్ద రాత్రిపగలు నిత్యం మట్టిని తరలిస్తున్నారు. మంత్రి ఉష అండతో అధికార పార్టీ నాయకులు పెట్రేగిపోతున్నారు.

వారు చెప్పింది వినాల్సిందే

శింగనమల నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి కొండ గ్రావెల్‌ కోసం అనుమతులు పొంది పరిమితికి మించి తవ్వేస్తున్నారు. రోజుకు 400 టిప్పర్ల వరకు అనంతపురం నగరానికి తరలిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి మట్టి కావాలన్నా ప్రజాప్రతినిధి, లేదా వారి అనుచరుల అనుమతి తీసుకోవాల్సిందే. మరెక్కడా కొనుగోలు చేయడానికి వీలు లేదు. కళ్యాణదుర్గం ప్రాంతంలోనూ అదేపరిస్థితి. అధికారపార్టీ నేతల ప్రమేయంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. రామినేపల్లి సమీపంలోని కొండపై మట్టిని తవ్వి ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. గతంలో అధికారులు దాడులు చేసి టిప్పర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అయినా పరిస్థితి మారలేదు.

చిలమత్తూరు మండలం కోడూరు పరిధిలోని ఏపీఐఐసీ భూముల్లో పెద్దఎత్తున మట్టిని తరలిస్తున్నారు. స్థానిక నాయకుల సాయంతో కొందరు వ్యాపారులు 10 నుంచి 15 అడుగుల లోతు వరకు తవ్వి వెంచర్లకు, ప్రైవేటు భూముల చదును చేయడానికి తీసుకెళుతున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కంకర క్వారీల్లోని దుమ్ము తీసుకొచ్చి గుంతలు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక చెరువులోనూ పెద్దఎత్తున మట్టిని తోడేస్తున్నారు. ఫిర్యాదులు అందినా అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

తనిఖీలు చేస్తున్నాం

బాలసుబ్రహ్మణ్యం, ఏడీ, మైన్స్‌

జిల్లాలో గ్రావెల్‌, ఎర్రమట్టి అక్రమ తవ్వకాలను చాలావరకు నియంత్రించాం. ఆకస్మిక తనిఖీలు చేస్తూ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రకృతి సంపద దోపిడికీ గురికాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డిస్ట్రిక్‌ విజిలెన్స్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించింది. అనుమతులు ఇచ్చిన ప్రాంతాల్లోనూ పరిశీలించి, ఉల్లంఘనలు ఉంటే చర్యలు చేపడుతున్నాం. ఎక్కడైనా అక్రమ రవాణా జరుగుతుంటే మా దృష్టికి తీసుకురావచ్ఛు ఫిర్యాదు చేసేవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని