logo
Published : 30 Jun 2022 02:43 IST

బాధ్యత మరచి.. స్థలాలు పంచి

జాబితాలో అర్హులకు దక్కని చోటు

నార్పలలో అధికారి ఇష్టారాజ్యం

నార్పల ప్రభుత్వ స్థలంలో వేసిన లేఅవుట్లు

నార్పల గ్రామీణం, న్యూస్‌టుడే: సొంతిల్లు లేని పేదలకు స్థలాలు ఇచ్చి గృహాలు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తలచింది. అందులో భాగంగానే అర్హులను గుర్తించి జగనన్న లేఅవుట్లలో స్థలాలను పంపిణీ చేస్తోంది. అయితే నార్పలలో ఓ అధికారి బాధ్యత మరచి.. అనర్హులకు ఇష్టారాజ్యంగా భూములు పంచేస్తున్నారు.. ఫలితంగా అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోంది. నీడలేని వారికి మాత్రమే దక్కాల్సిన స్థలాలు, నేతల సిఫారసు ఉన్నవారికే సొంతం అవుతున్నాయి. ఇప్పటికే ఒకసారి స్థలం పొంది.. ఇళ్ల నిర్మాణాలకు నిధులు అందుకున్న వారికి సైతం వైఎస్సార్‌ జగనన్న ఇళ్ల పట్టాలు అందుతుండటం గమనార్హం. నిబంధనల ప్రకారం గ్రామసభ నిర్వహించి స్థానికంగా నివాసం ఉన్న వారికి లాటరీ పద్ధతిలో స్థలాలు కేటాయించాలి. తాజాగా విడుదల చేసిన జాబితా పరిశీలిస్తే.. గ్రామసభ నిర్వహించకుండా.. లాటరీ తీయకుండానే స్థలాలు కేటాయించారు. సదరు అధికారి అనర్హుల వద్ద పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు చేసి వాలంటీర్ల ప్రమేయం లేకుండానే అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి పట్టణాల్లో నివాసం ఉండే వారిని జాబితాలో చేర్చినట్లు విమర్శలు వెల్లువెత్తాయి.

ఇతర ప్రాంతాల్లో వారికి నివాస స్థలాలు

అనంత నగరం సమీపంలోని ఎ.నారాయణపురంలో నివాసం ఉంటున్న ఓ మహిళ పేరు జాబితాలో ఉంది. ఆమె ఆధార్‌, రేషన్‌కార్డులు అక్కడే ఉన్నాయి. ప్రతి నెలా అక్కడే రేషన్‌ సరకులు తీసుకుంటోంది. ఆమెకు నార్పల మేజర్‌ పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీలో సర్వే నంబరు-197-2లో స్థలం కేటాయించారు.

ధర్మవరంలో నివాసం ఉండే ఓ మహిళ పేరున సర్వే నంబరు 94-1లో స్థలం కేటాయిస్తూ జాబితాలో చేర్చారు.

అనంతపురం అజాద్‌నగర్‌లో ఉండే మరో మహిళతోపాటు పలువురికి రెవెన్యూ అధికారులు నార్పలలోని ఇళ్ల స్థలాల జాబితాలో ప్లాట్లు కేటాయించారు.

నాలుగుసార్లు దరఖాస్తు చేశాం

నా భర్త మదార్‌వలి ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌గా పని చేస్తారు. మేము, మా అత్త వాళ్లు గత 26 ఏళ్లుగా పాత తపాలా కార్యాలయం సమీపంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాం. ఇంటి స్థలం కోసం మొదటి విడతలో దరఖాస్తు చేసుకుంటే రాలేదు. మళ్లీ దరఖాస్తు చేస్తే 90 రోజుల్లో ఇస్తామన్నారు. ఇప్పటికి నాలుగు సార్లు దరఖాస్తు చేసిన ఫలితం లేదు. - సాయిసింధు, నార్పల

ఎంపీటీసీ సభ్యురాలు రాజీనామా చేసినా..

నార్పల మేజర్‌ పంచాయతీలో ఇంటి స్థలం కోసం సుమారు 1150 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు, వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి 312 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. ఈ జాబితాలో సగం మంది ఇళ్లు ఉన్న వాళ్లకే స్థలాలు కేటాయించారు. స్థానికంగా కాకుండా అనంతపురం ఆజాద్‌నగర్‌, ఎ.నారాయణపురం, తాడిపత్రితోపాటు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండే వారిని సైతం జాబితాలో చేర్చారు. అధికార పార్టీ నాయకుల ఆశీస్సులతో అనర్హులకు నివాస స్థలాలు కేటాయిస్తూ అక్రమాలకు తెర లేపారు. డబ్బులిచ్చిన వారికి రోడ్డుకు దగ్గరగా, ఇతరులకు దూరంగా స్థలాలు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే చొరవ తీసుకొని అనర్హులను తొలగించి అర్హులకు స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పేద ప్రజలు కోరుతున్నారు.

నిబంధనలకు పాతర

నార్పల సీపీఐ కాలనీలో ఇళ్లు ఏర్పాటు చేసుకొన్న సుమారు 110 మందికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేతుల మీదుగా గతేడాది అక్టోబరులో పొజిషన్‌ సర్టిఫికెట్లు మంజురు చేశారు. వీటిలోనూ అధికారులు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. నార్పల గ్రామస్థులకు కాకుండా తాడిపత్రి, పామిడి, అనంతపురం, ధర్మవరంతోపాటు నార్పల మండలంలోని పలు గ్రామాల్లో నివాసం ఉండేవారికి పట్టాలు ఇచ్చారని స్థానిక ప్రజలు ఆందోళన చేశారు. రెవెన్యూ అధికారులు అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నారని నార్పల వైకాపా ఎంపీటీసీ-4 సభ్యురాలు భాగ్యలక్ష్మీ తన అభ్యర్థిత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు. అయినా నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయంపై తహసీల్దార్‌ శ్రీధర్‌మూర్తిని వివరణ కోరగా ఇళ్ల స్థలాల జాబితాలో అనర్హులు ఉన్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని