logo
Published : 30 Jun 2022 02:43 IST

అక్రమార్కులపై కొరడా

‘రెవెన్యూ’లో అలజడి


కలెక్టర్‌ కార్యాలయం

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లా రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలపై చర్యలకు ఉపక్రమించడంతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తహసీల్దారు కేడర్‌ నుంచి టైపిస్టు దాకా అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇద్దరు తహసీల్దార్లకు ఉప తహసీల్దార్లుగా రివర్షన్‌ ఇవ్వడం, టైపిస్టును ఏకంగా వాచ్‌మెన్‌ కేడర్‌కు పంపడం చర్చనీయాంశమైంది. మరో తహసీల్దార్‌కు ఛార్జ్‌మెమో జారీ చేశారు. ఓ వీఆర్వోను సస్పెండ్‌ చేశారు. ఇలా వరుసగా చర్యలు చేపట్టడంతో రెవెన్యూ శాఖలో అలజడి మొదలైంది. కొంత కాలంగా జిల్లా రెవెన్యూ శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. శింగనమల, నార్పల, పుట్లూరు, కూడేరు, అనంత గ్రామీణం, ఉరవకొండ, రాప్తాడు, కదిరి, కళ్యాణదుర్గం, నల్లమాడ.. తదితర మండలాల్లో అవినీతి, అక్రమాలు వెలుగుచూశాయి. వీటిపై ‘గుట్టపై గుంటనక్కలు, నకిలీ బాగోతం.. యంత్రాంగం నిర్లక్ష్యం, అవినీతికి అంతులేదు.. అంతం లేదు, నకిలీ ఎన్‌ఓసీల కలకలం’.. శీర్షికలతో కథనాలను ‘ఈనాడు’ ప్రచురించిన సంగతి తెలిసిందే. కలెక్టర్‌ నాగలక్ష్మి, జేసీ కేతన్‌ గార్గ్‌ సారథ్యంలో విచారణ చేయించారు. అన్ని ప్రాంతాల్లోనూ అక్రమాలు జరిగినట్లు తేలింది.

విచారించి చర్యలు తీసుకుంటున్నాం

రెవెన్యూలో జరిగే అక్రమాలపై విచారణ చేస్తున్నాం. ఎక్కడ పొరపాటు జరిగినా చర్య తీసుకుంటున్నాం. ఇటీవలే కొందరిపై చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏకు సిఫారసు చేశాం. ఇంకా కొన్ని ఘటనలకు సంబంధించి విచారణ సాగుతోంది. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు. - కేతన్‌ గార్గ్‌, జేసీ

ఎవరిపై చర్యలు

పుట్లూరు మండలం తహసీల్దార్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. గతంలో శింగనమలలో పనిచేసిన సమయంలోనూ ఇష్టారాజ్యంగా కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూములకు పట్టాలు ఇచ్చారు. పుట్లూరులో లేనిభూమికి 1బీ, అడంగల్‌ ఇచ్చేసిన వైనం వెలుగు చూసింది. దీంతో తహసీల్దార్‌ విజయకుమారికి ఉప తహసీల్దార్‌గా రివర్సన్‌ ఇచ్చేశారు. శింగనమలలో తహసీల్దార్‌కు వంతపాడిన టైపిస్టు ధనలక్ష్మిపై చర్య తీసుకున్నారు. ఈమెను ఏకంగా వాచ్‌మెన్‌గా రివర్సన్‌ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఈమె ఉరవకొండలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌పీకుంట తహసీల్దారు రమణ కూడా రివర్సన్‌కు గురయ్యారు. తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్‌, భూ రికార్డులు తారుమారు చేశారన్న అభియోగంపై కూడేరు తహసీల్దార్‌కు తాఖీదు ఇవ్వగా, వీఆర్వోను సస్పెండ్‌ చేశారు.

ఆగని అక్రమాలు

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత భూ అక్రమాలు పెచ్చుమీరాయి. వెబ్‌ల్యాండ్‌లో అక్రమాలు, భూమి రికార్డులు తారుమారు, హక్కుదారుల పేర్లు తొలగించి అడ్డగోలుగా ఇతర పేర్లు నమోదు చేయడం, ప్రైవేట్‌ భూముల రికార్డులు సైతం సవరణలు చేయడం.. ఇలా అనేక అక్రమాలు నిత్యకృత్యంగా మారాయి. శింగనమల, పుట్లూరు, కదిరి ప్రాంతాల్లోని అధికారులపై చర్య తీసుకున్నా అక్రమాలు తగ్గడం లేదు. తమకేమీ సంబంధం లేదనట్లుగా కొన్ని ప్రాంతాల్లో తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, వీఆర్వోలు, ఆర్‌ఐలు తన చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. అనంత గ్రామీణం, కూడేరు, నార్పల, బీకే సముద్రం, కళ్యాణదుర్గం, రాప్తాడు వంటి ప్రాంతాల్లో అక్రమాలు తెరపైకి వస్తున్నాయి. ఎప్పటికప్పుడు.. ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటే తప్ప వాటికి కళ్లెం పడటం కష్టం.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని