logo
Published : 30 Jun 2022 02:43 IST

గ్రీన్‌ఫీల్డు రహదారికి వడివడిగా అడుగులు

ఎకనామిక్‌ కారిడార్‌గా మార్పు

కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు

నల్లమాడ మండలం వేళ్లమద్ది వద్ద సర్వేలో అధికారులు, సిబ్బంది

పుట్టపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో విజయవాడ-బెంగళూరు గ్రీన్‌ఫీల్డు ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనులకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. 332 కి.మీ. మేర ఆరు వరుసలుగా నిర్మించే ఈ జాతీయ రహదారి శ్రీసత్యసాయి జిల్లాలో కొడికొండ వద్ద మొదలై ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద ముగుస్తుంది. జిల్లాలో 75 కి.మీ. మేర సాగే పనుల కోసం 736.63 హెక్టార్ల భూమిని సేకరించే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఈ మార్గం హద్దులు గుర్తించారు. తాజాగా భూసేకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. వారం రోజులుగా ఏ సర్వే నంబరులో ఎంత వరకు రహదారి వెళుతుందో కొలతలు తీసి రాళ్లు నాటుతున్నారు. నల్లమాడ మండలం వేళ్లమద్ది, రెడ్డిపల్లి పంచాయతీల్లో సర్వే పూర్తయింది.

ఆకృతుల్లో మార్పులు

గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి నిర్మాణ ఆకృతుల్లో మార్పులు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ కాకుండా ఎకనామిక్‌ కారిడార్‌గా అభివృద్ధి చేయాలని తలపెట్టింది. ఇందుకు ఆకృతుల్లో స్వల్ప మార్పులు చేసింది. గతంలో నాలుగు వరుసలు రహదారిగా నిర్ణయించగా ప్రస్తుతం ఆరు వరుసలుగాను, తొలి ఆకృతుల్లో వెడల్పు 90 మీటర్లుగా నిర్ఱయిస్తే తాజాగా 70 మీటర్లకు కుదించి భూసేకరణ చేపట్టాలని ఆదేశించింది.

కొడికొండ-మేదరమెట్ల మధ్యే నిర్మాణం

జిల్లావాసులు విజయవాడ చేరాలంటే దాదాపు 550 కి.మీ. ప్రయాణం చేయాల్సి వస్తోంది. విజయవాడ వాసులు బెంగళూరు వెళ్లాలన్నా అదే ప్రయాస. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ నుంచి వైఎస్సార్‌ జిల్లా మీదుగా బెంగళూరు ఎన్‌హెచ్‌-44కి అనుసంధానం చేస్తూ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా కొడికొండ-మేదరమెట్ల మధ్య మాత్రమే రహదారి నిర్మాణ పనులు చేపడతారు.

మార్పులకు వెసులుబాటు

గ్రీన్‌ ఫీల్డు, బ్రౌన్‌ ఫీల్డు రహదారులతో విజయవాడ-బెంగళూరు ప్రాజెక్టుగా ఉండనుంది. ఇది వరకు ఆకృతుల్లో భాగంగా గ్రీన్‌ ఫీల్డు రహదారిపైకి అన్నిచోట్ల ప్రవేశించడానికి అవకాశం ఉండేదికాదు. 332 కి.మీ. రహదారి పరిధిలో కేవలం 13 చోట్ల మాత్రమే ప్రవేశానికి, నిష్క్రమణకు అవకాశం కల్పిస్తూ గతంలో ఆకృతులు రూపొందించారు. దీంతో రహదారి మార్గంలోని నగరాలు, పట్టణాలకు అసౌకర్యంగా ఉంటుందనే అభ్యంతరాలు ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి కేంద్రానికి వెళ్లడంతో పరిస్థితిని గుర్తించిన కేంద్రం ‘ఎకానామిక్‌ కారిడార్‌’గా మార్పు చేసి రహదారిపైకి మరిన్ని చోట్ల ప్రవేశ, నిష్క్రమణలు కల్పిస్తూ మార్పులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది.

నవంబరుకు సర్వే పూర్తి చేస్తాం

- రామకృష్ణ, ప్రాజెక్టు డైరెక్టర్‌, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, కడప

విజయవాడ-బెంగళూరు జాతీయ రహదారికి సంబంధించి ఆకృతుల్లో స్వల్ప మార్పులు చేయాలన్నది వాస్తవమే. వెడల్పు 70 మీటర్లుగా, నాలుగు వరుసలు ఉన్న రహదారిని ఆరుకు మార్చారు. నగరాలు, పట్టణాలు ఉన్నచోట్ల నిష్క్రమణ, ప్రవేశాలకు వెసలుబాటు కల్పించారు. నవంబరుకు సర్వే, టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తాం. 2025కి రహదారిని వినియోగంలోకి తేవాలని యోచిస్తున్నాం.

ఇదీ స్వరూపం..

అంచనా: రూ.17 వేల కోట్లు

భూసేకరణ: 8 వేల ఎకరాలు

ప్రతిపాదిత ప్రాజెక్టు దూరం: 518 కి.మీ.

రహదారి వరుసలు: 6

వెడల్పు: 70 మీటర్లు

నిర్మాణం: కొడికొండ-ప్రకాశం జిల్లా మేదరమెట్ల

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని