Andhra News: శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం.. ఐదుగురు సజీవదహనం

శ్రీసత్యసాయి జిల్లాలో ఘోరం జరిగింది. ఆటోపై విద్యుత్‌ తీగలు తెగిపడడంతో ఐదురుగు మృతి చెందారు...

Updated : 30 Jun 2022 14:13 IST

తాడిమర్రి: ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్‌ విద్యుత్‌ తీగ తెగి పడింది. దీంతో ఐదుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.

వివరాల్లోకి వెళితే.. డ్రైవర్‌ సహా తాడిమర్రి మండలం గుండంపల్లి, పెద్దకోట్ల గ్రామాలకు చెందిన 12 మంది మహిళా కూలీలు పొలం పనుల నిమిత్తం చిల్లకొండయ్యపల్లి గ్రామానికి ఆటోలో వెళ్తున్నారు. మార్గంమధ్యలో ఆటోపై హైటెన్షన్‌ విద్యుత్‌ తీగ తెగిపడింది. దీంతో ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు మహిళా కూలీలు మృతిచెందగా.. డ్రైవర్‌తో పాటు 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మృతులను కుమారి(35), రత్నమ్మ(35), రాములమ్మ(35), లక్ష్మి లక్మీదేవి(32), కాంతమ్మ(32)గా గుర్తించారు. క్షతగాత్రులను ఆర్డీటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఉడుతే ప్రమాదానికి కారణం: ఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరినాథరావు

ప్రమాదానికి ఉడుత కారణమని ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరినాథరావు తెలిపారు. విద్యుత్‌ తీగల నుంచి స్తంభంపై ఉన్న ఇనుప క్లాంప్‌ మీదకు ఉడుత దూకిన సమయంలో ఎర్తింగ్‌ రావడంతో తీగలు తెగి ఆటోపై పడ్డాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.2లక్షలు చొప్పున పరిహారం అందించనున్నట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని