logo

ఎగిసిన మంటల్లో... ఆరిన బతుకులు

వారంతా కూలీలు.. రెక్కాడితేనే డొక్కాడని శ్రమజీవులు.. రోజూ కూలీకి వెళితేగానీ పూటగడవని కుటుంబాలు..  వరసకు అక్కాచెల్లెళ్లు, తోడికోడళ్లు.. ఏ పనైనా కలిసి చేస్తారు.. కలిసికట్టుగా వెళ్తారు.. ఎప్పటిలాగే గురువారం ఉదయం బంధువుల పొలంలో కలుపుతీత పనులకు ఆటోల్లో బయలుదేరారు. అందరూ బంధువులు,

Published : 01 Jul 2022 06:08 IST

చిల్లకొండయ్యపల్లి వద్ద ఘోరం 

విద్యుత్తు తీగ తెగి ఆటోపై పడటంతో చెలరేగిన మంటలు

ఐదుగురు సజీవ దహనం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, తాడిమర్రి

ఎంత పనిచేశావ్‌ దేవుడా.. రోదిస్తున్న రామలక్ష్మి అత్త         ప్రమాదంలో దగ్ధమైన ఆటో

వారంతా కూలీలు.. రెక్కాడితేనే డొక్కాడని శ్రమజీవులు.. రోజూ కూలీకి వెళితేగానీ పూటగడవని కుటుంబాలు..  వరసకు అక్కాచెల్లెళ్లు, తోడికోడళ్లు.. ఏ పనైనా కలిసి చేస్తారు.. కలిసికట్టుగా వెళ్తారు.. ఎప్పటిలాగే గురువారం ఉదయం బంధువుల పొలంలో కలుపుతీత పనులకు ఆటోల్లో బయలుదేరారు. అందరూ బంధువులు, ఇరుగుపొరుగు వారు కావడంతో కబుర్లలో పడ్డారు. మరికొన్ని నిమిషాల్లో పొలానికి చేరుకుంటామని అనుకుంటుండగానే ఊహించని ఘటన ఎదురైంది. విద్యుత్తు తీగ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. తోడికోడళ్ల అన్యోన్యత చూసి విధికి కన్నుకుట్టిందేమో.. కాలం, విధి రెండు కలిసి వారి నవ్వుల్ని క్షణాల్లో ఆవిరి చేశాయి. వారి భవిష్యత్తు ఆశల్ని బూడిద చేశాయి. అప్పటివరకు తమతో సంతోషంగా గడిపిన ఆత్మీయులు మంటల్లో కాలిపోతుంటే.. మిగిలిన వారి గుండెలు తల్లడిల్లాయి. కళ్లెదుటే అగ్నికి ఆహుతి కావడంతో గుండెలు బాదుకుంటూ రోదించారు. కాపాడుకోలేపోయామన్న మనోవేదన మిగిలింది.

తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన కుమారి అనే మహిళ పొలంలో కలుపు తీసేందుకు గుడ్డంపల్లికి చెందిన గాయత్రి, శివరత్నమ్మ, నాగేశ్వరమ్మ, ఈశ్వరమ్మ, రమాదేవి, రత్నమ్మ, కుమారి, లక్ష్మీదేవి, కాంతమ్మ, రాములమ్మ, రామలక్ష్మి, అరుణమ్మ ఆటోలో బయలుదేరారు. చిల్లకొండయ్యపల్లి సమీపంలో పొలందారిలో వెళ్తుండగా పక్కనున్న స్తంభంపై నుంచి మధ్యలోని హైటెన్షన్‌ తీగ తెగి ఆటోమీద పడటంతో విద్యుదాఘాతం జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొందరు పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి దూకి ప్రాణాలు కాపాడుకోగా మధ్యలో కూర్చున్న రత్నమ్మ(40), కుమారి(35), లక్ష్మీదేవి(36), కాంతమ్మ(45), వెనుకకూర్చుని ఉన్న రామలక్ష్మి(30) మంటల్లో చిక్కుకున్నారు. ఆటో పూర్తిగా దగ్ధమైంది. తీవ్రంగా గాయపడిన గాయత్రిని 108 వాహనంలో వైద్య చికిత్స కోసం అనంతపురం, అక్కడి నుంచి బెంగళూరు తరలించారు.

అంతా మహిళలు.. రక్తసంబంధీకులే..

ప్రమాదంలో మృతి చెందిన వారంతా మహిళలే. అందులోనూ కుమారి మినహా మిగిలిన వాళ్లంతా రక్తసంబంధీకులు. లక్ష్మీదేవి, కాంతమ్మ తోడికోడళ్లు. లక్ష్మీదేవి భర్త ఈశ్వరయ్య, కాంతమ్మ భర్త చిన్నమల్లయ్య అన్నదమ్ముళ్లు. రామలక్ష్మి భర్త మల్లికార్జున తండ్రి రమణయ్య, రత్నమ్మ భర్త కృష్టయ్య అన్నదమ్ములు. వీళ్ల ఇంటిపేరు కూడా ఒకటే.

ఇనుప మంచె లేకపోయి ఉంటే..

పొలంలో వేసుకునే మంచెను ఇనుముతో తయారు చేయించి ఆటోపై తీసుకెళ్తున్నారు. విద్యుత్తు తీగ తెగి ఆ మంచెకు తగిలింది. దీంతో ఒక్కసారిగా షార్ట్‌సర్క్యూట్‌ అయి మంటలు రేగాయి. ఆటోపై ఇనుప మంచె లేకపోయి ఉంటే ప్రమాద తీవ్రత తగ్గేదని గ్రామస్థులు చెబుతున్నారు.  


గుడ్డంపల్లిలో విషాదం

తీవ్రంగా గాయపడిన  గాయత్రి పిల్లలు

ప్రమాదంలో ఒకేసారి ఐదుగురు చనిపోవడంతో గుడ్డంపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. ఊరంతా కన్నీరు పెట్టింది. బంధువులు గుండెలు బాదుకుంటూ రోదించారు. మృతులకు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.


క్షణాల్లో బూడిదయ్యారు

ఆటోలో అందరం సంతోషంగా పనికి బయలుదేరాం. సరదాగా మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌ వచ్చింది. డ్రైవర్‌ పక్కనే కూర్చుని ఉండటంతో విద్యుత్తు షాక్‌ కాలికి తగిలింది. పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి ఎగిరి పడ్డాను. బయటపడిన వారు తలో దిక్కుకు పరిగెత్తారు. తోటి కూలీల గురించి ఆలోచన చేసేలోపే మంటల్లో చిక్కుకుపోయారు. అందరు హాహాకారాలు చేస్తున్నా ఏం చేయలేని పరిస్థితి.

- పెద్దకాంతమ్మ, ప్రత్యక్ష సాక్షి


కుటుంబానికి అన్నీ తానై

అమ్మా.. ఎక్కడికెళ్లావు.. లక్ష్మీదేవి కుమార్తె మనీషా

గుడ్డంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, ఈశ్వరయ్య దంపతులకు శిరీషా, మనీషా, మోహన్‌ సంతానం. పిల్లలను ఉన్నతంగా చదివించి మంచి భవిష్యత్తు అందించాలని లక్ష్మీదేవి కలలు కనేది. పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఉన్నత విద్యను నేర్పించాలనే తపన పడేది. వారికోసం పైసాపైసా కూడబెడుతోంది. కుటుంబానికి అంతా తానై నడిపించేది. ఇలా అర్ధాంతరంగా తల్లి చనిపోవడంతో పిల్లలను ఎలా చూసుకోవాలని ఈశ్వరయ్య బోరున విలపించారు.


కష్టాలను ఎదురీదుతూ..

ఆగని కన్నీటి ధార: రోదిస్తున్న రామలక్ష్మి భర్త మల్లికార్జున, పిల్లలు అఖిల, నిఖిత, రుత్విక్‌

ప్రమాదంలో చనిపోయిన రామలక్ష్మికి భర్త మల్లికార్జున, ఇద్దరు కుమార్తెలు అఖిల, నిఖిత, ఒక కుమారుడు ఉన్నారు. అందరూ పన్నెండేళ్లలోపు వారే. పెళ్లయినప్పటి నుంచి భర్తతో కలిసి కూలీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించేది. ఎలాంటి సమస్యలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేది. పిల్లల్ని ఉన్నతంగా చదివించి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచాలనే తపనతో నిత్యం కష్టపడేది. ఆమె మరణంతో దిక్కులేనివారమయ్యామని భర్త కన్నీటి పర్యంతమయ్యారు.


పిల్లలను ఉన్నతంగా చూడాలని

పెద్దకోట్ల గ్రామానికి చెందిన రాజా, కుమారి దంపతులు తమకున్న కొద్దిపాటి పొలంలో వేరుసెనగ పంట సాగు చేస్తూ పిల్లల్ని పోషించుకునేవారు. వీరికి భరణికిషోర్‌, బేబి సంతానం. వ్యవసాయంలో వచ్చిన సంపాదనతోనే పిల్లల్ని ఉన్నతంగా చదివించుకోవాలని తాపత్రయ పడుతుండేవారు. సొంత పొలంలో పనులు పూర్తికాగానే కుమారి గ్రామంలో కూలీ పనులకు వెళ్లేవారు. ఏరోజు కూడా ఇంటి వద్ద ఖాళీగా ఉండేవారు కాదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.


ఆరోగ్య సమస్యలను లెక్కచేయక

విద్యుత్తు ప్రమాదంలో మృతిచెందిన కాంతమ్మకు దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలున్నా పట్టించుకోకుండా కుటుంబం కోసం కూలీ పనులకు వెళ్తుండేది. భర్త చిన్నమల్లయ్య గ్రామంలో ఉపాధి, ఇతర పనులకు వెళ్తుండేవాడు. వీరికి ఇద్దరు కొడుకులు మనోజ్‌, వినోద్‌. ఒకరిది బీటెక్‌ పూర్తికాగా.. మరొకరు డిగ్రీ చదువుతున్నారు. కొడుకులు ఉద్యోగాలలో స్థిరపడిపోగానే ప్రశాంతంగా జీవించాలని కాంతమ్మ అందరితోనూ చెప్తుండేదని గ్రామస్థులు తెలిపారు. ఆమె మృతితో కుటుంబం వీధిన పడింది.


అమ్మ తినిపిస్తేనే తింటాడు

బిడ్డా దిక్కెవరు: రోదిస్తున్న భర్త రామకృష్ణ, కుమారుడు మదన్‌మోహన్‌

రత్నమ్మ భర్త కృష్ణయ్య వ్యవసాయ పనులు చేస్తుంటారు. వీరికి ఇద్దరు కుమారులు. వారిలో భువనేశ్వర్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. మరో కుమారుడు మదన్‌మోహన్‌ దివ్యాంగుడు. ఇతను తల్లి తినిపిస్తేనే అన్నం తింటాడు. ప్రతి రోజు కొడుకుకు అన్నం తినిపించిన తరువాతే కూలీ పనులకు వెళ్లేది. గురువారం కూడా ఇద్దరు కుమారులతో ఆప్యాయంగా మాట్లాడించి పనులకు బయలుదేరి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఉన్నత చదువులు చదుకోవాలని భువనేశ్వర్‌కు ఎప్పుడూ సూచించేది. ఇకపై తనకు ఎవరు అన్నం తినిపిస్తారని మదన్‌మోహన్‌ బోరున విలపించడం బంధువులను కలిచివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని