logo

విద్యుత్తు ధర్మం.. విస్మరించారు!

అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో తరచూ విద్యుత్తు ప్రమాదాలు జరుగుతున్నాయి. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉపకేంద్రాలు, లైన్లు, స్తంభాలు, నియంత్రికలను పరిశీలించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. మరమ్మతులు

Published : 01 Jul 2022 06:08 IST

కంపచెట్లలో విద్యుత్తు తీగలు

అనంత(విద్యుత్తు), న్యూస్‌టుడే: అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో తరచూ విద్యుత్తు ప్రమాదాలు జరుగుతున్నాయి. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉపకేంద్రాలు, లైన్లు, స్తంభాలు, నియంత్రికలను పరిశీలించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. మరమ్మతులు క్రమంగా చేపట్టాలి. ఆదిశగా చర్యలు తీసుకోకపోవడం వల్లే.. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్లలో 537 మంది విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారంటే.. ఆలోచించాల్సిన అవసరం ఉంది.

భవనాలకు ఆనుకుని ప్రమాదకరంగా ఇలా..

ఈ ఎత్తులో ఉండాలి

రోడ్డు క్రాసింగ్‌ ఉన్న చోట భూమి నుంచి 11 కేవీలైన్‌ 7.5మీ, 33 కేవీ 8.73, 120 కేవీ 10.10, 200 కేవీ 11, 400 కేవీ 12.5 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలు చాలా ప్రాంతాల్లో అమలు చేయడం లేదు. కిందకు తీగలు వేలాడుతున్నా సరిచేసే నాథుడే లేరు.

పర్యవేక్షణ విస్మరించారు

ఎల్టీ లైన్‌ను లైన్‌ఇన్‌స్పెక్టర్‌, 11 కేవీలైన్‌ను ఏఈ, 33 కేవీలైన్‌ను డీఈఈ మూడు నెలలకోసారి కచ్చితంగా పరిశీలించాలి. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలి. ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు మినహా వీరిలో ఎక్కువమంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లటం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

దశాబ్దాల క్రితం ఏర్పాటు

* ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ దశాబ్దం కిందట ఏర్పాటు చేసిన విద్యుత్తులైన్లు ఉన్నాయి. స్తంభాలకు ఏర్పాటు చేసిన కండక్టరు, కేబుల్‌కి అధిక, అల్ప విద్యుత్తు సరఫరా అయినప్పుడల్లా వీటి నాణ్యత దెబ్బతిని తెగిపడుతుంటాయి. తెగిన తీగలకే అతుకులు వేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

* అధికారుల వివరాల ప్రకారం 812 కి.మీ. ఎల్టీ బేర్‌ కండక్టరు, సాధారణ ఎల్టీ కండక్టరు 6,935 కి.మీ., 11 కేవీ కండక్టరు 10,995 కి.మీ., 33 కేవీ 2,045 కి.మీ. ఉంది. వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవటంతో తరచూ తీగలు తెగుతున్నాయి.

* ఉమ్మడి జిల్లాలోని ఉపకేంద్రాల్లో 33కేవీ హెచ్‌వీవీసీబీలు 370, 11 కేవీ ఎల్‌వీవీసీబీలు 370 మార్చాలని సదరు అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. వాటిపై ఎవరూ శ్రద్ధచూపడం లేదు. బ్రేకర్‌లు పనిచేయకపోతే ప్రమాద సమయంలో లైన్‌ట్రిప్‌ కాదు. దీంతో తెగిపడినా విద్యుత్తు నిలిచిపోదు.


ఏడాది కిందట పెద్దపప్పూరు మండలం వరదాయపల్లికి చెందిన తల్లి వెంకటలక్ష్మమ్మ, కొడుకు వెంకటస్వామి తమ పొలానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా 11 కేవీ తీగ తెగి వారి మీదపడటంతో విద్యుదాఘాతంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.


ఏప్రిల్‌ 19న లత్తవరానికి చెందిన చిరంజీవి ఎద్దులబండిపై వెళుతుండగా ఎల్‌టీ లైన్‌ తెగి ఎద్దుల మీద పడింది. ఈ క్రమంలో చిరంజీవి బండిమీద నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.


మే 5న ఉరవకొండ మండలం మైదారంపల్లి రహదారిపై కౌకుంట్ల గ్రామానికి చెందిన అశోక్‌ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా 11కేవీ విద్యుత్తుతీగ కింద పడటంతో విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు.


మే 5 బుక్కరాయసముద్రం మండలం కేకే అగ్రహారం గ్రామానికి చెందిన రమణమ్మ (45) ఇంటి ముందు ఉన్న చెట్టుకొమ్మలపై విద్యుత్తులైన్‌ తెగి పడింది. ఇంటికి విద్యుత్తు సరఫరా కావడంతో ప్రాణాలు కోల్పోయింది.


కనిపించని రక్షణ వలయాలు

రోడ్డు, రైలు క్రాసింగ్‌ ఉన్న ప్రాంతాల్లో విద్యుత్తులైన్లను ఏర్పాటు చేస్తే కచ్చితంగా తీగల కింద రక్షణ వలయం (సేఫ్‌గార్డ్‌)లను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ట్రైన్‌ క్రాసింగ్‌ల వద్ద మినహా ఎక్కడా వీటిని ఏర్పాటు చేయటం లేదు.

సిబ్బంది కొరత

విద్యుత్తుశాఖలో పెరుగుతున్న సర్వీసులకు అనుగుణంగా నియామకాలు చేపట్టడం లేదు.  ఉన్న ఉద్యోగులే పనిఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో లైన్‌మెన్‌, జేఎల్‌ఎంలు నాలుగు నుంచి 10గ్రామాల వరకు పర్యవేక్షిస్తుండటంతో దృష్టికి వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది. లైన్‌మెన్‌లు 558 మందికి 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఎల్‌ఎంలు 535కు 348 ఖాళీలు ఉన్నాయి. జేఎల్‌ఎంలు 449 ఉండాల్సి ఉండగా 275 ఖాళీలు ఉన్నాయి.


ప్రమాదాల నివారణకు చర్యలు

విద్యుత్తు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తీగలు ఎన్నేళ్లు వాడినా ఇబ్బంది ఉండదు. ఎక్కడైనా డ్యామేజ్‌ అయితే వాటిని వెంటనే మార్పు చేస్తాం. మాకు అందిన ఫిర్యాదులను సకాలంలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గతంలో లైన్‌లు ఎక్కువ దూరంగా ఉండేవి ఈ క్రమంలో సేఫ్‌గార్డులు వేసేవాళ్లు. ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగానే దూరం ఉంటోంది. దీంతో సేఫ్‌గార్డులు వేయటం లేదు.

- నాగరాజు, ఎస్‌ఈ, విద్యుత్తుశాఖ


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని