logo

ఎన్‌సీసీ శిక్షణ.. భవితకు నిచ్చెన!

దేశభక్తి, సేవాభావం, ఐక్యత ఆలోచనలను కలిగిన యువతను దేశానికి అందించటంలో ఎన్‌సీసీ కీలక పాత్ర పోషిస్తోంది. క్రమశిక్షణ, మంచి నడవడికను నేర్పుతూ, దేశ రక్షణలో భాగస్వాములు అయ్యేలా శిక్షణ ఇస్తోంది. సైన్యంతో సమానంగా వారికి ప్రత్యేకంగా

Published : 01 Jul 2022 06:08 IST

కళాశాల విద్యార్థుల కవాతు

ఉరవకొండ, కూడేరు, న్యూస్‌టుడే: దేశభక్తి, సేవాభావం, ఐక్యత ఆలోచనలను కలిగిన యువతను దేశానికి అందించటంలో ఎన్‌సీసీ కీలక పాత్ర పోషిస్తోంది. క్రమశిక్షణ, మంచి నడవడికను నేర్పుతూ, దేశ రక్షణలో భాగస్వాములు అయ్యేలా శిక్షణ ఇస్తోంది. సైన్యంతో సమానంగా వారికి ప్రత్యేకంగా శిక్షణను   ఇస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకునేలా, సమాజంలో మంచి మార్గాన్ని పాటించేలా  భరోసాను కల్పిస్తోంది. కూడేరు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ఉన్న ఎన్‌సీసీ నగర్‌ వేదికగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

దిల్లీ శిబిరానికి సన్నద్ధత దిశగా..

ఎన్‌సీసీ నగర్‌లో ప్రస్తుతం తలసేనిక్‌ శిబిరానికి క్యాడెట్లను సన్నద్ధం చేస్తూ శిక్షణ కొనసాగుతోంది. ఈ శిబిరం సెప్టెంబరులో దిల్లీలో జరగనుంది. దానికి అనుగుణంగా ఇక్కడ నాలుగు జిల్లాల నుంచి శిక్షణకు హాజరైన విద్యార్థులకు గన్‌ షూటింగ్‌, గోడలు దాటుకోవడం, మ్యాప్‌ రీడింగ్‌, టెంట్‌లను ఏర్పాటు చేయడం, తొలగించడం, ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవటం తదితర అంశాలపై కఠినతరమైన శిక్షణను సైన్యం వచ్చిన శిక్షకులు ఇస్తున్నారు.

దీంతో పాటు సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలువడంతో పాటు, వారిని ఎలా రక్షించాలన్న అంశాలను శిక్షణలో నేర్పుతున్నారు. ఇక్కడ బాగా ప్రతిభ చూపిన 45 మంది బాలురు, 40 మంది బాలికలను రాష్ట్రస్థాయి శిబిరానికి ఎంపిక చేయనున్నారు. శిక్షణ పూర్తిచేసుకుని ఏ, బీ, సీ సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తిస్తాయి. కేంద్రం ప్రభుత్వం తాజాగా తీసుకు వచ్చిన అగ్నిపథ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ఎన్‌సీసీ క్యాడెట్లకు అదనపు మార్కులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. దీంతో ఈ శిక్షణకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

రెండేళ్ల తర్వాత మళ్లీ..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌సీసీ ప్రత్యేక శిక్షణకు శాశ్వత ప్రదేశం ఈ ఎన్‌సీసీ నగర్‌ ఒక్కటే. ఇక్కడ 2009 నుంచి ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల ఎన్‌సీసీ క్యాడెట్లతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన క్యాడెట్లకు శిక్షణను ఇస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా రెండేళ్లుగా ఎలాంటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించలేదు. తాజాగా అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 550 మంది విద్యార్థినీ విద్యార్థులకు పది రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని క్యాంప్‌ కమాండెంట్‌ కల్నల్‌ నీరజ్‌ మెహతా, ఉప కమాండెంట్‌ కల్నల్‌ సందీప్‌ ముండ్ర, సూపరింటెండెంట్‌ తోట నాగేంద్ర ప్రసాద్‌ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. దీంతో ఎన్‌సీసీ నగర్‌ ఆయా జిల్లాల క్యాడెట్లతో కళకళలాడుతోంది.

గన్‌ షూటింగ్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు


పాఠశాల స్థాయిలోనే చాలా తెలిశాయి

మాది కడప జిల్లా. అనంతపురంలో ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాను. ఇక్కడ గన్‌ షూటింగ్‌తో పాటు ఇతర అంశాలపై శిక్షణ పొందాను. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వామిని అయ్యాను. ఈ శిక్షణ ద్వారా పాఠశాల స్థాయిలోనే నాకు అనేక విషయాలు తెలిశాయి. ఎన్‌సీసీ శిక్షణతో పాటు, చదువులోనూ బాగా రాణించి భవిష్యత్తులో ఐపీఎస్‌ను సాధించాలన్నది లక్ష్యం. ఆ దిశగా ఇప్పటి నుంచే ప్రత్యేకంగా సాధన చేస్తాను.  

- తోట తేజశ్రీ, అనంతపురం


అందరూ సమానమే అన్న భావన

నేను కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాను. ఇక్కడ సైన్యంతో సమానమైన శిక్షణతోపాటు ఉన్నత చదువులపై అవగాహన, క్రమశిక్షణ, పట్టుదల, లక్ష్యాన్ని సాధించాలన్న ఆలోచన ఏర్పడుతుంది. అందరూ సమానమే అన్న భావన కలిగింది. సామాజిక సేవలపై అవగాహన ఏర్పడింది. శిక్షణను భవిష్యత్తుకు అనుగుణంగా సద్వినియోగం చేసుకుంటాను.

- సింధునందన, ప్రభుత్వ వైద్య కళాశాల, కర్నూలు


సమాజంపై అవగాహన పెరుగుతుంది

ఎన్‌సీసీ శిక్షణతో విద్యార్థుల్లో మంచి నడవడికతో పాటు దేశభక్తి అలవడుతుంది. సమాజంలో ఎలా రాణించాలన్న అవగాహన పెరుగుతుంది. దీంతో భవిష్యత్తులో ఎంచుకున్న అంశాల్లో సులువుగా విజయం సాధించటానికి మార్గం ఏర్పడుతుంది. శిక్షణ ద్వారా సైన్యంతో పాటు ఇతర ఉద్యోగాలు, ఉన్నత విద్య ప్రవేశాల్లో అదనపు ప్రయోజనాలను పొందడానికి వీలుంటుంది. ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు సైన్యంతో సమానమైన శిక్షణను ప్రత్యేకంగా ఇస్తున్నాం.

- నాగేశ్వరరావు, శిబిరం సీవో


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని