logo

విలీనం ఆపరు..సమస్యలూ తీర్చరు

మడకశిర మండలం బేగార్లపల్లి ప్రాథమికోన్నత (యూపీఎస్‌) పాఠశాలలో 6 నుంచి 8వ తరగతి వరకు 56 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిని ప్రస్తుతం మడకశిర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. బేగార్లపల్లి నుంచి మడకశిరకు 3 కిలోమీటర్ల

Published : 07 Jul 2022 03:17 IST

ఉమ్మడి జిల్లాలో 398 ప్రాథమిక పాఠశాలల ఎంపిక

వ్యతిరేకిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

మడకశిర మండలం బేగార్లపల్లి ప్రాథమికోన్నత (యూపీఎస్‌) పాఠశాలలో 6 నుంచి 8వ తరగతి వరకు 56 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిని ప్రస్తుతం మడకశిర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. బేగార్లపల్లి నుంచి మడకశిరకు 3 కిలోమీటర్ల దూరం కాగా.. ఉన్నత పాఠశాలకు వెళ్లడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. విద్యార్థులు ఉన్నత పాఠశాలకు వెళ్లడానికి గ్రామం నుంచి కనీస రవాణా సౌకర్యం లేదు. మార్గం మధ్యలో వంక ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే మండలంలోని మెళవాయి ప్రాథమిక పాఠశాలను సిద్ధగిరి ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. గ్రామం నుంచి సిద్ధగిరికి రెండు కిలోమీటర్ల దూరం ఉండగా.. కనీసం ఆటోలు కూడా తిరగని పరిస్థితి.

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, అనంత విద్య, ఉరవకొండ, మడకశిర: గతంలో ఎన్నడూ లేనివిధంగా చిన్నారులు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఆందోళనకు దిగుతున్నారు. చివరికి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయినా.. ప్రభుత్వానికి పట్టడం లేదు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. విలీనం చేయడం ద్వారా వచ్చే సమస్యల్ని పరిష్కరించకుండానే ముందుకెళుతున్నారు. ముందు ప్రక్రియ పూర్తిచేయండి.. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం అంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. గతేడాది 3 కిలోమీటర్ల పరిధిలోని పీఎస్‌, యూపీఎస్‌ పాఠశాలల విలీన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీనిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో ఈసారి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న వాటిని మాత్రమే విలీనం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే అసలు విలీనమే వద్దు అని.. తరగతులకు ప్రాథమిక పాఠశాలల్లోనే యథావిధిగా కొనసాగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండు చేస్తున్నారు. చాలాచోట్ల పాఠశాలలకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధ్యాయులు, గదుల కొరత

ఉమ్మడి అనంత జిల్లాలో 3,170 ప్రాథమిక, ప్రాథమికోన్నత, 509 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. నూతన విద్యావిధానంలో భాగంగా మొదటి విడతలో 351 ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ప్రస్తుతం సవరించిన నిబంధనల మేరకు వీటిలో కొన్ని పాఠశాలల విలీనాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం రెండో విడతలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను 398 విలీనం చేస్తున్నారు. అయితే చాలాచోట్ల గదులు, ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విలీనానికి అనుగుణంగా 1,128 మంది ఉపాధ్యాయులు అదనంగా అవసరమవుతారు. 217 పాఠశాలల్లో గదుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీనికితోడు చాలాచోట్ల పాఠశాల దూరంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో పిల్లలను బడి వద్ద దించి రావడం భారంగా మారుతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

కాలువలు, వంకలు దాటి..

మొన్నటివరకు ఊరిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు విలీనంతో ఇప్పుడు వ్యయప్రాయాసలకు ఓర్చి ఉన్నత పాఠశాలకు వెళుతున్నారు. రాయదుర్గం, ఉరవకొండ, మడకశిర తదితర ప్రాంతాల్లో సాగునీటి కాలువలు, వంకలు దాటి బడికి వెళ్లాల్సిన పరిస్థితి. పలుగ్రామాల నుంచి కనీస రవాణా సౌకర్యం లేకపోవడంతో కిలోమీటర్ల మేర వీపుపై పుస్తకాల బరువుతో నడవాల్సి వస్తోంది. దీంతోపాటు ఉన్నతపాఠశాలకు వెళ్లడానికి పలుచోట్ల విద్యార్థులు జాతీయ రహదారులు దాటాల్సి వస్తోంది. నిత్యం రద్దీగా ఉండే కూడళ్లను ప్రమాదకరంగా దాటాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

అనంతపురంలోని నాలుగోరోడ్డులోని నేతాజీ నగరపాలక ఉన్నత పాఠశాలలో 493 మంది విద్యార్థులున్నారు. ఒక కిలోమీటరు దూరంలో ఉన్న 8 ప్రాథమిక పాఠశాలలను విలీనం చేశారు. ఆయా పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులు 450 మంది ఉన్నత పాఠశాలలో విలీనం అవుతున్నారు. గదుల కొరత కారణంగా విద్యార్థులు ప్రాథమిక పాఠశాలల్లోనే కొనసాగుతున్నారు. నాడు-నేడు పథకం కింద 9 అదనపు గదులు నిర్మించాల్సి ఉండగా.. ఇంకా పునాదులు కూడా తీయలేదు.

నిబంధనల ప్రకారమే చేస్తున్నాం

పాఠశాలల విలీనం నిబంధనల మేరకే చేస్తున్నాం. పాఠశాలల్లో తరగతి గదుల సౌకర్యం ఉన్న చోట్లే పిల్లలను పంపుతున్నాం. ఎంఈవోలతో ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాతనే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నాం. విద్యార్థులకు ఇబ్బందులుంటే పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. - కృష్ణయ్య, అనంత జిల్లా ఇన్‌ఛార్జి విద్యాశాఖాధికారి

ఉరవకొండలోని జిల్లాపరిషత్‌ సెంట్రల్‌ ఉన్నత పాఠశాలలో పాతపేటలోని ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను విలీనం చేశారు. ప్రస్తుతం ఉన్నత పాఠశాలలో 933 మంది విద్యార్థులు ఉండగా.. కొత్తగా 187 మంది విద్యార్థులు వచ్చి చేరారు. ఇక్కడ 24 గదులు అవసరం కాగా ప్రస్తుతం 16 ఉన్నాయి. గదులు సరిపడా లేకపోవడంతో 8 సెక్షన్ల విద్యార్థులకు వరండాలోనే చదువులు చెబుతున్నారు. దీంతోపాటు పాఠశాలలో బోధనేతర సిబ్బంది ఒక్కరూ లేకపోవడంతో అన్ని పనులు ఉపాధ్యాయులే నిర్వహించాల్సి వస్తోంది.

విలీనమవుతున్న ప్రాథమిక పాఠశాలు 393

విద్యార్థులు సుమారు 20 వేలు

గదుల కొరత ఉన్న పాఠశాలలు 217

అదనంగా అవసరం ఉన్న ఉపాధ్యాయులు 1,128

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని