logo
Published : 07 Jul 2022 03:17 IST

పేదల నెత్తిన బండ

వంటగ్యాస్‌ సిలిండరుపై రూ.50 పెంపు

ఓడీచెరువు, పుట్టపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: ఇంధన కంపెనీలు వంటగ్యాస్‌ సిలిండరు ధరను మరో రూ.50 పెంచాయి. గృహ వినియోగ సిలిండరు ధర పెంచడం సామాన్య, మధ్య తరగతి ప్రజానీకానికి భారంగా మారింది. ఇప్పటికే అన్ని రకాల వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్న సమయంలో మరో రూ.50 పెంచడంపై జనం మండిపడుతున్నారు. పెరిగిన గ్యాస్‌ ధర మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోంది. ధర చుక్కలనంటడం వల్ల పేదలు వాడకం తగ్గించుకోవడం లేదా పూర్తిగా మానేసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. వంటగ్యాస్‌ వదిలి మళ్లీ కట్టెల పొయ్యికి మరలక తప్పదని ఆవేదన చెందుతున్నారు. ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తూ ఇలా ప్రజలపై భారం మోపడం సమంజసం కాదని గగ్గోలు పెడుతున్నారు.

రూ.7.43 కోట్ల భారం

ఉమ్మడి అనంత జిల్లాలో మొత్తం మూడు ఇంధన కంపెనీల పరిధిలో 89 వరకు గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉజ్వల మినహాయిస్తే 14,85,972 వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. గత నెల ఇండేన్‌ వంటగ్యాస్‌ సిలిండరు ధర రూ.1,074 ఉండగా రూ.50 పెంచడంతో సిలిండరు ధర రూ.1,124కు చేరింది. ఇంధన కంపెనీలు, ప్రాంతాలను బట్టి వీటి ధర మారుతూ ఉంటుంది. ఓడీచెరువు మండలంలో హెచ్‌పీసీఎల్‌ ధర జూన్‌లో రూ.1,037 ఉండగా ప్రస్తుతం రూ.1,087 ఉంది, అదే భారత్‌ గ్యాస్‌ గతనెల రూ.1069.50 ఉంటే ప్రస్తుతం రూ.1119.50 ఉంది. సిలిండరుపై రూ.50 అదనపు భారం మోపడంతో వినియోగదారులపై రూ.7.43 కోట్ల భారం అదనంగా పడింది.

కట్టెల పొయ్యి తప్పదు

హోటల్‌లో పనిచేస్తాను. రోజూ రూ.150 కూలి ఇస్తారు. వచ్చే సొమ్ముతో ఇంటి ఖర్చులు, ఇతరవాటికి సరిపోతుంది. వంట గ్యాస్‌కి రూ.1100 పోతే ఎలా బతకాలి. 2014లో సిలిండరు రూ.550 ఉండేది. ఇప్పుడు రూ.1100లకు చేరింది. వంటగ్యాస్‌కు అలవాటు పడ్డాం. కట్టెల పొయ్యితో వంట చేయలేని పరిస్థితి. ప్రభుత్వం చూస్తే ధర పెంచేస్తోంది. దిక్కులేని పరిస్థితిలో మళ్లీ కట్టెల పొయ్యి వెలిగించక తప్పదు. - ఈశ్వరమ్మ, సున్నంపల్లి

పూర్తి ధరకు కొంటున్నట్లుంది

ధరలు తగ్గించి పేదలను ఆదుకోవాల్సిన పాలకులు ఇలా ధరలు పెంచడం సరికాదు. కూరగాయలు, విద్యుత్తు బిల్లు, నిత్యావసర ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న పేదలు వంటగ్యాస్‌ ధర పెంచడంతో ఖర్చులు పెరిగి అప్పులు చేసే పరిస్థితి. ప్రభుత్వం మాలాంటి పేద కుటుంబాలకు ధరలో మినహాయింపు ఇవ్వాలి. గ్యాస్‌ ధర పెంచడం మినహా రాయితీ మాత్రం ఇవ్వరు. పూర్తి ధరకు కొంటున్నట్లుంది. - రమాదేవి, ఓబులదేవరచెరువు

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts