logo
Published : 07 Jul 2022 03:17 IST

సమస్యలెదురైనా.. సాధించారు

గ్రూప్‌ 1 పరీక్షల్లో జిల్లావాసుల జయకేతనం

- న్యూస్‌టుడే బృందం

సమస్యలు ఎదురయ్యాయని కుంగిపోలేదువారు. అందివచ్చిన అవకాశాలను అందుకుంటూనే ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి పట్టుదలతో శ్రమించారు. అనుకున్నది సాధించి.. తమ కలలు, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి నలుగురి నుంచి అభినందనలు అందుకుంటున్నారు.

నాన్న ఆశయ సాధనే లక్ష్యం

భవానిశంకరి

అనంతపురం విద్య: కన్నతండ్రి ఆశయం కోసం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేసి కలెక్టర్‌ కావాలనే తపనతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు అనంతకు చెందిన భవానిశంకరి. నగరంలోని అనంత టౌన్‌షిప్‌లో నివాసముంటున్న వెంకటబాలజీ, సావిత్రి దంపతుల కుమార్తె భవానిశంకరి. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలకు 2 నెలల ముందు తండ్రి మరణం భవానిశంకరిని కలచివేసింది. నాన్న ఆశయాలు సాధించడం కోసం మనోధైర్యంతో పరీక్షలు రాశారామె. లక్ష్య సాధనలో విజయం సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఉన్నత ఉద్యోగం సాధించినప్పుడు నాన్న లేరన్న బాధ ఉందని ఆమె తెలిపారు. ఆయన ప్రోత్సాహంతోనే ఉద్యోగం సాధించానని చెప్పారు.

వైద్యవృత్తి నుంచి డిప్యూటీ కలెక్టర్‌గా

డాక్టర్‌ ఎస్‌.భరత్‌నాయక్‌

కర్నూలు నేరవిభాగం: వైద్య వృత్తి నుంచి గ్రూప్‌-1 ఉద్యోగం సాధించారు కర్నూలు జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సహాయ పర్యవేక్షణాధికారి డాక్టర్‌ ఎస్‌.భరత్‌ నాయక్‌. అనంతపురం నగరానికి చెందిన భరత్‌నాయక్‌ తండ్రి ఎస్‌.శంకర్‌నాయక్‌ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పట్టు విభాగాధిపతిగా, తల్లి శాంతాబాయి ఖజానా సహాయ అధికారిణిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. భరత్‌నాయక్‌ అనంతపురంలోనే ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో సివిల్స్‌కు సన్నద్ధమై రెండుసార్లు ప్రయత్నించారు. 2016 గ్రూప్‌-1 రాసి మద్యనిషేధ, అబ్కారీశాఖలో సహాయ పర్యవేక్షణాధికారిగా ఎంపికయ్యారు. కర్నూలులో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో టాస్క్‌ఫోర్స్‌లో విధులు నిర్వర్తిస్తూనే మళ్లీ 2018 గ్రూప్‌-1కు సన్నద్ధమయ్యారు. డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు.

ఆర్డీవోగా రైతు బిడ్డ

నాన్నకు మిఠాయి తినిపిస్తున్న మనీష

రాప్తాడు (ఆత్మకూరు): రైతు బిడ్డ ఆర్టీవోగా ఎంపికయ్యారు. రాప్తాడు మండలం బుక్కచెర్ల గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి, సావిత్రి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. వీరి కుమార్తె మనీష 2017లో హైదరాబాద్‌లోని ఐఏఎస్‌ అకాడమీలో డిగ్రీ చేశారు. 2018లో గ్రూప్‌ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపి ఆర్టీవోగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts