logo

విలీనం వద్దు..పాత పాఠశాలే ముద్దు

విలీనం పేరుతో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలుపుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రెండోరోజైన బుధవారం సైతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి. విలీనం వద్దు..

Published : 07 Jul 2022 03:17 IST

రెండోరోజూ కొనసాగిన ఆందోళనలు

- న్యూస్‌టుడే బృందం

విలీనం పేరుతో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలుపుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రెండోరోజైన బుధవారం సైతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి. విలీనం వద్దు.. పాత పాఠశాలలే ముద్దు అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయా పాఠశాలల గేట్లకు తాళాలు వేసి నిరసనలు తెలిపారు. మరికొన్నిచోట్ల చిన్నారులు సైతం రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. సౌకర్యాలు లేకపోవడం, దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి విలీన ప్రక్రియను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

తల్లిదండ్రుల ఆగ్రహం..

పాఠశాలకు తాళం వేస్తున్న సర్పంచి, గ్రామస్థులు

మేడాపురం(చెన్నేకొత్తపల్లి), న్యూస్‌టుడే: ఉన్నత పాఠశాలలో విలీనం వద్దని, పాత పాఠశాలలోనే తమ పిల్లలను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు, సర్పంచి రామాంజనేయులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. విద్యార్థులను బయటకు పంపి ఉపాధ్యాయులను పాఠశాలలోనే ఉంచి ప్రధాన గేటుకు తాళాలు వేశారు. విద్యార్థులతో కలిసి పాఠశాల ఎదుట రహదారిపై బైటాయించి విలీనానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ 3, 4, 5 తరగతులకు చెందిన విద్యార్థులు 107 మంది ఉన్నారన్నారు. ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తే నిత్యం రద్దీగా ఉండే రహదారిని దాటేందుకు పిల్లలు ఇబ్బందులకు గురవుతారన్నారు. అనుకోని ఘటనలు జరిగితే దానికి ఎవరు బాధ్యులు అంటూ మండిపడ్డారు. దాదాపు గంటపాటు రహదారిపై బైటాయించారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం హెచ్‌ఎం వెంకటరామిరెడ్డికి వినతిపత్రం అందించారు.

సదుపాయాలు లేవు.. వెళ్లేదెలా?

విద్యార్థులతో కలిసి ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు, గ్రామస్థులు

మాయదార్లపల్లి(కుందుర్పి), న్యూస్‌టుడే: మండలంలోని మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విలీనం రద్దు చేసి గ్రామంలోనే కొనసాగించాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం బడికి తాళం వేశారు. గేటు వద్ద ముళ్లకంపలు వేశారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 103 మంది విద్యార్థులు ఉన్నారు. సమీపంలోని కుంట్లోవారితోట, నేలబడితోట కాలనీల నుంచి పిల్లలు ఇక్కడికి వస్తున్నారన్నారు. 3 నుంచి 8వ తరగతి విద్యార్థులను గ్రామానికి 4 కి.మీ. దూరంలో, ఎలాంటి ప్రయాణ సౌకర్యం, కనీస సదుపాయాలు లేని బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. బస్సు, ఆటోల సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడే పాఠశాల కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చేంతవరకు పిల్లలను బడికి పంపమని ఇళ్లకు తీసుకెళ్లిపోయారు.

రోడ్డుపై బెఠాయించి..

పెనుకొండ పట్టణం: తిమ్మాపురంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులు చదువుతున్న 26 మంది విద్యార్థులను అర కిలోమీటరు దూరంలోని వెంకటరెడ్డిపల్లిలోగల ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఇందుకు నిరసనగా విద్యార్థులు, తల్లిదండ్రులు, నాయకులు తిమ్మాపురం పాఠశాల ఎదురుగా ఉన్న పుట్టపర్తి- పెనుకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తెదేపా కౌన్సిలర్‌ శోభన్‌ సప్తగిరి, సీపీఎం నాయకులు హరి, రమేష్‌ పాల్గొన్నారు.

ఆటో సౌకర్యం కూడా లేదు

మెళవాయి ప్రాథమికోన్నత పాఠశాల ముందు..

మడకశిరగ్రామీణం: మెళవాయి ప్రాథమికోన్నత పాఠశాలను సిద్ధగిరి ఉన్నత పాఠశాలకు విలీనం చేయవద్దని బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాల ముందు నిరసన తెలియజేశారు. 2కిలోమీటర్ల దూరంలోని సిద్ధగిరి గ్రామానికి వెళ్లాలంటే కనీసం ఆటో సౌకర్యం కూడా లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని